సన్నిధి
నిర్మలవాణి
శ్రీ మాతాజీ నిర్మలాదేవి
సత్యాన్ని వినడం వేరు.. సత్యాన్ని తెలుసుకోవడం వేరు.. సత్యాన్ని స్వయంగా అనుభూతి చెందడం మరొకటి. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ఎంతో ముఖ్యం. పరమచైతన్యం గురించి ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, దానిని మన అంతరంగంలో అనుభూతి చెందనంతవరకు ఆ జ్ఞానం సంపూర్ణం కాదు. ఈ లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని శ్రీ మాతాజీ తన బోధనల ద్వారా మనకు వివరిస్తారు.
సత్యం అనేది మన అభిప్రాయాలకు అనుగుణంగా మారిపోయేది కాదు. మనం నమ్మినా, నమ్మకపోయినా సత్యం తన ఉనికిని కలిగి ఉంటుంది. మన బుద్ధి, తర్కం, విశ్లేషణలతో ప్రపంచంలోని అనేక విషయాలను తెలుసుకోగలం. కానీ సృష్టి వెనుక ఉన్న సూక్ష్మమైన చైతన్యాన్ని కేవలం బుద్ధితోనే పూర్తిగా గ్రహించలేం.
ప్రకృతిలో జరిగే ఎన్నో అద్భుతాలను మనం చూస్తుంటాం. విత్తనం మొలకెత్తడం, పువ్వు వికసించడం, భూమి తన కక్ష్యలో పరిభ్రమించడం వంటి ప్రక్రియల వెనుక ఉన్న క్రమబద్ధత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ విశ్వవ్యవస్థను నడిపించే దివ్యశక్తిని శ్రీ మాతాజీ ‘పరమచైతన్యం’గా వివరిస్తారు. దాని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, దానితో అనుసంధానమై ప్రత్యక్ష అనుభూతిని పొందడమే నిజమైన ఆధ్యాత్మిక అన్వేషణలో కీలక దశ.
ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభం
మహర్షులు, అవతారాలు, సద్గురువులు మానవ జీవితంలో ఆత్మజ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు తెలియజేశారు. అయితే ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? అది ఎలా సాధ్యమవుతుంది? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. సాధారణంగా మనిషి తనను శరీరంతో, మనస్సుతో, ఆలోచనలతో, భావోద్వేగాలతో గుర్తించుకుంటాడు. తనలోని అంతరాత్మను తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నించడు. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం కేటాయించే మనిషి, తన అంతరంగాన్ని తెలుసుకోవడానికి కొంత సమయమైనా కేటాయించాలి.
శ్రీ మాతాజీ బోధనల ప్రకారం, ఆత్మసాక్షాత్కారం కేవలం ఒక భావన కాదు. అది మనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలిపి, మన అంతర్గత స్థితిలో మార్పును అనుభూతి చెందే ప్రక్రియ. సహజయోగంలో ఈ అనుభవానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది.
– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు
ఇదీ చదవండి: భగవంతుడు ఎక్కడ ఉంటాడు? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!


