హెల్త్
సిప్ చేసే ముందు కాస్త ఆగండి..
అధిక వేడితో టీ, కాఫీలు తాగితే కేన్సర్ ముప్పు
మనలో చాలామంది ఉదయాన్నే పొగలు కక్కే వేడి వేడి టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. అయితే, నోరు కాలేంత వేడిగా ఉండే పానీయాలను తరచుగా తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తాగే పానీయం టీ, కాఫీ లేదా సూప్.. ఏదైనా, అది ఎంత వేడిగా ఉందనేదే ఇక్కడ కీలకమైన విషయం.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐ.ఎ.ఆర్.సి.) పరిశోధనల ప్రకారం 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను కేన్సర్‌కు దారి తీసే అవకాశం ఉన్న పదార్థాలుగా వర్గీకరించారు. చాలా వేడిగా ఉన్న ఆహార పదార్థాలు లేదా పానీయాలు తీసుకోవడం వల్ల నోరు, గొంతు, ఆహార నాళం తీవ్రంగా కాలడమే కాకుండా, మింగేటప్పుడు నొప్పి, మంట కలిగిస్తాయి. పదేపదే ఇలా వేడి పానీయాలు తాగడం వల్ల ఆహార నాళంలోని సున్నితమైన కణాలపై విపరీతమైన ఒత్తిడి పడి వాపునకు కారణమవుతుంది.
కేన్సర్‌కు ఎలా దారి తీస్తుంది?
మనం వేడి పానీయాలు తాగినప్పుడు అన్నవాహికలోని సున్నితమైన కణజాలం కాలుతుంది. ఒకసారి కాలితే కణాలు త్వరగానే కోలుకున్నప్పటికీ, రోజుకు అనేకసార్లు సంవత్సరాల తరబడి ఇలాగే వేడి పానీయాలు తాగుతుంటే ఆ కణజాలం పదే పదే గాయపడుతుంది. నిరంతరం ఇలా మంట, గాయం కారణంగా అక్కడ కొత్తగా ఏర్పడే కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇది కాలక్రమేణా కణాల అసాధారణ ఎదుగుదలకు, అంటే అన్నవాహిక కేన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.
కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి టీ లేదా కాఫీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కేవలం తాగే పద్ధతిని మార్చుకుంటే సరిపోతుంది. కప్పులో పోసిన తర్వాత కేవలం 4 నుంచి 5 నిమిషాల పాటు ఆగితే దాని ఉష్ణోగ్రత 50 నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద పానీయాలను తాగడం వల్ల నోటికి, గొంతుకు ఎలాంటి హాని జరగదు.
లక్షణాలేంటి? జాగ్రత్తలెలా?
అన్నవాహిక కేన్సర్ ప్రారంభ లక్షణాలు సాధారణ జీర్ణక్రియ సమస్యల్లాగే ఉంటాయి. అందుకే చాలామంది వీటిని కేవలం గ్యాస్ లేదా అసిడిటీ అని పొరపాటు పడి నిర్లక్ష్యం చేస్తారు.
ఆహారం మింగుతున్నప్పుడు గొంతులో ఇరుక్కుపోయినట్లు అనిపించడం, అసిడిటీ మందులు వాడినా తగ్గకుండా ఛాతీలో నిరంతరం మంట ఉండటం, తీవ్రమైన గొంతునొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం లేదా ఎక్కువకాలం దగ్గు ఉండటం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అతి వేడి పానీయాలతో పాటు పొగాకు వాడకం, మితిమీరిన మద్యం సేవించడం, ఊబకాయం, పోషకాహార లోపం ఉన్నవారిలో ఈ కేన్సర్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
- సాక్షి, స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ రకం రొమ్ము క్యాన్సర్.. అసలేంటీ హర్–2?


