ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ రకం రొమ్ము క్యాన్సర్‌.. అసలేంటీ హర్‌–2? | Her2 Breast Cancer Treatment Awareness | Sakshi
Sakshi News home page

ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ రకం రొమ్ము క్యాన్సర్‌.. అసలేంటీ హర్‌–2?

Oct 27 2026 11:17 AM | Updated on Oct 27 2026 11:18 AM

Her2 Breast Cancer Treatment Awareness

హెల్త్‌

‘హ్యూమన్‌ ఎపిడర్మల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ రిసెప్టార్స్‌ – 2’ అనే మాటకు సంక్షిప్తరూపమే ‘హర్‌–2’. ఇది రొమ్ము క్యాన్సర్లలో ఒక రకం అని చెప్పవచ్చు. ఈ రకం రొమ్ముక్యాన్సర్‌ వ్యాప్తి వేగమూ ఎక్కువే. దీని విస్తృతి కూడా ఎక్కువే. దీని విస్తృతి ఎంతంటే... ప్రతి ఐదు రొమ్ము క్యాన్సర్లలోనూ ఈ తరహా కేసు ఒకటి తప్పక కనిపిస్తుంది! ‘‘ఎవ్రీ స్టోరీ ఈజ్‌ యూనీక్, ఎవ్రీ జర్నీ మ్యాటర్స్‌’’ అనే థీమ్‌తో నిర్వహితమవుతున్న ‘బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ మంత్‌గా పరిగణించే ఈ అక్టోబరు నెలలో ‘ఆమెకు వచ్చే క్యాన్సర్‌’గా ‘హర్‌–2’ అని పేరు పెట్టుకున్న ఈ యూనిక్‌ క్యాన్సర్‌ గురించి తెలుసుకోడానికి ఉపయోగపడేదే కథనమిది.

సాధారణంగా ఎవరైనా మహిళకు రొమ్ముక్యాన్సర్‌ వచ్చినప్పుడు అందుకు కారణాలేమిటంటూ పరీక్షిస్తారు. అలా పరీక్షించే సమయంలో రొమ్ముక్యాన్సర్‌కు పాజిటివ్‌ రిపోర్టు వచ్చి... ఈ హర్‌ రిసెప్టార్‌లు ఎక్కువగా కనిపిస్తే అప్పుడు దాన్ని ‘హర్‌–2’ క్యాన్సర్‌గా చెబుతారు. ఇది ‘హర్‌–2’ అయితే మరి ‘హర్‌–1’ అనేది ఏదో ఉంటుంది కదా అనే సందేహం రావచ్చు.

నిజమే. మనుషుల్లో ‘హర్‌–1’ అనే రిసెప్టార్‌లూ ఉంటాయి. దీనికంటే ముందు అసలు రిసెప్టార్‌ అంటే ఏమిటో తెలుసుకోవడం అన్నది ఈ పేరెందుకు వచ్చిందనే విషయం తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.

రెండు కణాల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఇలా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కోసం కొన్ని రసాయనాలు ఉపయోగపడతాయి. నిజానికి ఎంతో సంక్లిష్టమైన అర్థమున్న ఈ పదాల గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే... ఇలా సమాచారమిచ్చిపుచ్చుకునే ప్రక్రియలో ఉపయోగపడే జీవరసాయనాలను ‘రిసెప్టార్‌’ అనవచ్చు. వాస్తవంగా అందరు వ్యక్తుల్లోనూ సాధారణంగా ‘హ్యూమన్‌ ఎపిడర్మల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ రిసెప్టార్‌’ అనేవి ఉంటాయి. అయితే ఈ ప్రత్యేక తరహా క్యాన్సర్‌లోని రిసెప్టార్‌లు అచ్చంగా వాటిని పోలి ఉండటం వల్ల ‘హ్యూమన్‌ ఎపిడర్మల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ రిసెప్టార్‌’ పక్కనే రెండు అనే అంకెతో వీటిని సూచిస్తుంటారు. ఫలితంగా దీనికి ‘హర్‌–2’ అనే పేరు వచ్చింది.

వేగంగా విస్తరించినప్పటికీ సమర్థమైన చికిత్స కూడా... 
మామూలుగా కొన్ని ఇతర రకాల క్యాన్సర్ల కంటే ఈ రొమ్ము క్యాన్సర్‌ చాలా వేగంగా విస్తరించినప్పటికీ దీనికి సమర్థమైన చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన టార్గెట్‌ థెరపీతో, అలాగే కొందరికి తమవరకే చేసే వ్యక్తిగత (పర్సనలైజ్‌డ్‌) చికిత్సతో, సరిపడిన మరికొందరిలో ఇమ్యూనోథెరపీతో దీనికిప్పుడు చికిత్స అందించేందుకు వీలున్న ‘ట్రీటబుల్‌ క్యాన్సర్‌’ ఇది. ప్రభావపూర్వకమైన ఈ చికిత్సల సహాయంతో బాధితులు కూడా చాలావరకు కోలుకుని, ఇంచుమించు పూర్తి నార్మల్‌గా జీవించేందుకు అవకాశాలూ (ప్రోగ్నోసిస్‌) ఎక్కువే. ఈ క్యాన్సర్‌లో ఉన్న కొంత సానుకూల అంశమిది.

ఇక్కడే ‘జీన్‌ యాంప్లిఫికేషన్‌’ మొదలు... 
అలా దెబ్బతిన్న ‘హర్‌–2’ రిసెప్టార్లకు చెందిన జన్యువులు తమను తాము చాలా పెద్ద సంఖ్యలో కాపీలు చేసుకుంటూ పెరుగుతూ పోతాయి. ఈ పరిస్థితినే ‘హర్‌ – 2’ జీన్‌ యాంప్లిఫికేషన్‌ అంటారు. ఇలాంటప్పుడు ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే.... ఆ పరీక్షల్లో ‘హర్‌–2’ పాజిటివ్‌ వస్తుంది. అంటే ఈ పాజిటివ్‌ కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి క్యాన్సర్‌కు కారణమవుతాయని అర్థం. దాదాపు 10% నుంచి 20% రొమ్ము క్యాన్సర్‌ కేసుల్లో ఇలా జరుగుతుంది.

‘హర్‌–2’ను నయం చేసే చికిత్సలివి...

  • తొలి దశలో దాదాపుగా పూర్తిగా నయమయ్యే క్యాన్సర్‌ ఇది. అయితే తొలి దశ దాటిన తర్వాతి కొన్ని దశల్లో దీనికి చికిత్స అందుబాటులో ఉందని చెప్పవచ్చు. అంటే ఇది ట్రీటబుల్‌గా ఉంటుందని అర్థం.

  • కీమోథెరపీతో పాటు టార్గెటెడ్‌ థెరపీ కూడా ఇచ్చి, నాలుగో దశకు (స్టేజ్‌ – 4కు) వెళ్లకుండా నివారించడం, మళ్లీ మళ్లీ రాకుండా చూడటం (రికరెన్స్‌) సాధ్యమయ్యే క్యాన్సర్‌ ఇది.

  • కొన్ని కేసుల్లో కీమోథెరపీ ఇస్తూనే ‘ట్రాస్టుజుమాబ్‌’ అనే ‘హర్‌ – 2 యాంటీబాడీ’ మందు; లేదా పెర్టుజుమాబ్‌ వంటి టార్గెటెడ్‌ థెరపీ మందులను నోటిద్వారా ఇస్తూ ఈ క్యాన్సర్‌ను నయం చేయవచ్చు.

  • వీటితోపాటు హార్మోన్‌ థెరపీ, ఇమ్యూనోథెరపీల వంటి అత్యాధునిక చికిత్స ప్రక్రియలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నిపుణులు వీటిని కాంబినేషన్లలోనూ ఇస్తుంటారు. ఒక ఏడాది ఈ మందులు వాడాక, ఆ తర్వాత కొంతమందిలో నెరాటినిబ్‌ అనే మందు ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరో ఏడాది పాటు వాడాల్సి ఉంటుంది.

  • రొమ్ముక్యాన్సర్‌ బాధితుల్లో హర్‌–2 ప్రోటీన్‌ చాలా ఎక్కువగా వెలువడుతుంది కాబట్టి ఈ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేసే కొన్ని మందులను... అంటే ఉదాహరణకు పైన పేర్కొన్న ట్రాస్టుజుమాబ్, పెర్టుజుమాబ్‌ వంటి వాటితో పాటు... కొన్ని సందర్భాల్లో ట్రాస్టుజుమాబ్‌ డెరక్స్‌టెకాన్‌ , టుకాటినిబ్‌ వంటి టార్గెటెడ్‌ థెరపీలనూ అందించాల్సి రావచ్చు.

ఇదీ చదవండి: ఆహారంతోనే ఆరోగ్యం సంరక్షించబడుతుంది

ఆరోగ్యవంతుల్లోనూ ‘హర్‌–2’
ఆరోగ్యవంతులైన మహిళల రొమ్ముల్లోనూ సాధారణ ఎపిడెర్మల్‌ సెల్స్‌ రెసెప్టార్లతో పాటు ఈ ‘హర్‌–2’ కూడా కొన్ని ఉండనే ఉంటాయి. అయితే వీటి సంఖ్య చాలా చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం 20,000 రిసెప్టార్‌లలో కేవలం రెండు మాత్రమే ‘హర్‌–2’ జన్యువుల కాపీలు ఉంటాయి. అదే రొమ్ము క్యాన్సర్‌ వచ్చినప్పుడు వీటి సంఖ్య 40 నుంచి 100 రెట్ల వరకు పెరిగిపోతుంది. ఇలా పెరగడాన్ని ‘జీన్‌ యాంప్లిఫికేషన్‌’ అంటారు.

ఈ ‘హర్‌ – 2’ లోనే మళ్లీ అనేక రకాలు!
ఈ ‘హర్‌ – 2 ’ క్యాన్సర్‌లోనే మరో నాలుగు రకాలు ఉంటాయి. వీటిని సబ్‌ గ్రూప్స్‌గా చెప్పవచ్చు. ఈ రిసెప్టారు చిన్నపిల్లల్లో బ్లడ్‌ క్యాన్సర్‌ను కలగజేసే ‘టైరోజిన్‌ కైనేజ్‌ రిసెప్టారు’ కుటుంబానికి చెందింది. నిజానికి ఈ ‘హ్యూమన్‌ ఎపిడర్మల్‌ రిసెప్టారు– హర్‌’ అనేది కణల విభజనకూ, మనుగడ కోసం ఉపయగపడేందుకు ఉద్దేశించిన రిసెప్టార్లు. అయితే అవి చెడిపోవడం వల్ల ఇలా ‘క్యాన్సర్‌’కు కారణమవుతాయి.

‘హర్‌’ తాలూకు ఎగ్జాక్ట్‌ లొకేషన్‌ ఎక్కడంటే...
‘హర్‌ – 2’ అనే రొమ్ముక్యాన్సర్‌కు కారణమయ్యే ఈ రిసెప్టార్‌... మానవదేహంలోని 17వ క్రోమోజోముపై (లాంగ్‌ ఆర్మ్‌ ఆఫ్‌ హ్యూమన్‌ క్రోమోజోమ్‌ తాలూకు 17వ దానిపై) ఉంటుంది. దీని లొకేషన్‌ తెలియడానికి సాంకేతికంగా ‘17క్యూ12’ అని చెబుతుంటారు.

మానవ దేహంలో ఎక్కడెక్కడ, ఏయే వ్యవస్థల్లో ‘హర్‌’ ఉంటాయంటే... 
శరీర నిర్మాణంలో ‘హర్‌’లు అనేక రకాల వ్యవస్థ (బాడీ సిస్టమ్స్‌)ల్లోని కణజాలాల్లో ఉంటాయి. ఉదాహరణకు నాడీ వ్యవస్థల్లో, అనేక భాగాల్లోని పైన ఉండే కణాల్లో... అంటే ఎపిథీలియల్‌ సెల్స్‌లో, రొమ్ముల్లో ఉంటాయి. అవి అక్కడ కణాల పెరుగుదలకు తోడ్పడుతుంటాయి. అయితే సాధారణంగా కణాల విభజనకూ, పెరుగుదలకూ ఉపయోగపడుతుంటే ఇవి... ఒక్కోసారి ఇబ్బడి ముబ్బడిగానూ, ఆ పైన అనియంత్రితంగా విపరీతంగా పెరిగిపోవచ్చు. అలా జగినప్పుడు అవి క్యాన్సర్‌ కణాలుగా మారతాయి. 

వాస్తవానికి ఆరోగ్యకరమైన మంచి కణాల్లో ఒక గుణం ఉంటుంది. ఏదైనా కణంలోని జీవపదార్థం దెబ్బతిని, అనారోగ్యానికి గురైతే... తమ వల్ల మిగతా ఆరోగ్యకణాలకు ఇబ్బంది కలగనివ్వకుండా ఒక అనారోగ్యకరమైన కణం తనను తాను ధ్వంసం/నాశనం చేసుకుంటుంది. ఈ గుణాన్ని ‘అపా΄్టోసిస్‌’ అంటారు. కానీ క్యాన్సర్‌ కణం అలా తనను తాను నాశనం చేసుకోదు. పైగా సాధారణ ఆరోగ్యకరమైన కణంలా కాకుండా కొత్తగా ప్రవర్తిస్తుంటుంది. క్రమబద్ధమైన పెరుగుదలతో కాకుండా... విపరీతంగా పెరిగిపోతూ మిగతా ఆరోగ్యకరమైన కణాలకు ముప్పుగా మారుతుంది. ఇలా విపరీతంగా పెరిగిపోతూ మిగతా ఆరోగ్యకరమైన కణాలకు ముప్పుగా పరిణమించడం వల్లనే వీటిని క్యాన్సర్‌ కణాలుగా చెబుతుంటారు.

‘హర్‌–2’ రిసెప్టార్‌ పనేమిటంటే... 
హర్‌ –2 అనే ప్రోటీన్స్‌ రొమ్ము కణాల్లో ఉంటాయి. సాధారణంగానైతే... ఈ ‘హర్‌–2’ రిసెప్టార్‌లు రొమ్ము పెరుగుదలకు, అక్కడి కణాలు ఆరోగ్యవంతంగా విభజితం అయ్యేందుకు, కణాలేవైనా దెబ్బతింటే వాటిని రిపేర్లు చేసేందుకు అవసరమైన ఆదేశాలను అక్కడి కణాలకు అందిస్తుంటాయి. కానీ అవే క్యాన్సర్‌ కారకాలుగా పరిణమించాంటే... అవి తాము నెరవేర్చాల్సిన విధులను సక్రమంగా చేయ(లే)ని విధంగా దెబ్బతిన్నాయని అర్థం.

‘హర్‌–2’ కనుగొనడానికి ఇవీ పరీక్షలు...
ఈ క్యాన్సర్‌ను కనుగొనడానికి కొన్ని స్కాన్‌లు, ల్యాబ్‌ టెస్టులు అవసరమవుతాయి. ఈ క్యాన్సర్‌ ఉందని అనుమానించినప్పుడు రొమ్ము కణితిని ట్రూ–కట్‌ లేదా కోర్‌ నీడిల్‌ బయాప్సీ ద్వారా పరీక్షిస్తారు. ఈ పరీక్షను ‘ఐహెచ్‌సీ’ (ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ)గా చెబుతారు. ఇందులో 0 – 3 వరకు స్కోర్లు ఉంటాయి. దీని అర్థం ఏమిటంటే...

  • స్కోరు 0 నుంచి 1+ వరకు వస్తే క్యాన్సర్‌ లేనట్టు.

  • ఒకవేళ 2+ వస్తే క్యాన్సర్‌ బార్డర్‌లైన్‌లో ఉన్నట్లు. (వచ్చే అవకాశాలు ఉన్నట్టు). ఇలా 2+ వచ్చినవారికి ఫిష్‌ (ఫ్లోరొసెంట్‌ ఇన్‌ సిట్యూ హైబ్రిడైజేషన్‌) టెస్ట్‌ అనే మరో పరీక్ష చేయించాల్సి ఉంటుంది.

  • అదే 3+ వచ్చిందంటే అది ‘హర్‌ – 2’ క్యాన్సర్‌కు పాజిటివ్‌కు సూచనగా పరిగణించవచ్చు. (అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే... రొమ్ముల్లోని ప్రతి గడ్డ లేదా కణితి క్యాన్సర్‌ కాదు. రొమ్ముల్లో గడ్డలు వస్తుండటం చాలా సాధారణం. అయితే అది హానికరమా, కాదా అన్నది పరీక్షల ద్వారా తెలుసుకుని... ఒకవేళ అది హానికరం కాని గడ్డగా తేలితే నిశ్చింతగా ఉండవచ్చు).

‘హర్‌–2’ క్యాన్సర్‌లో నయమయ్యే అవకాశాలివి... 
తొలి దశలో కనుక్కుంటే (అర్లీ బ్రెస్ట్‌ క్యాన్సర్స్‌లో) దాదాపు పూర్తిగా నయమవుతుంది. ‘హర్‌ –2’ పాటిటివ్‌ రొమ్ము క్యాన్సర్‌లో నయమయ్యేందుకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ. పర్సంటేజీలో చెప్పాలంటే దాదాపు 95 శాతం నయమయ్యేందుకు అవకాశాలుంటాయి. మరీ కచ్చితంగా చెప్పాలంటే 92.5% కంటే ఎక్కువే. కాబట్టి ఒకవేళ ‘హర్‌–2’ క్యాన్సర్‌ డిటెక్ట్‌ అయితే బాధితులు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తగిన చికిత్స తీసుకోవడం వల్ల నయమవుతుందనే భరోసాతో ధైర్యంగా ఉండాలి. 

చాలా తక్కువ కేసుల్లోనే రొమ్ము తొలగింపు.... 
ఈరకం రొమ్ముక్యాన్సర్‌కు గురైనవారు చాలావరకు కాస్త తేలిగ్గానే చాలావరకు బాగా కోలుకుంటారు. మందులు వాడుతూ, చికిత్స తీసుకున్న చాలా కేసుల్లో మొత్తం రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉండదు. అయితే... కొన్ని పరిస్థితుల్లో మాత్రం కొన్నిసార్లు (స్టేజ్‌ 2, 3లలో) రొమ్ము తొలగింపు తప్పకపోవచ్చు. దీనికి ఇప్పుడు విచారించాల్సిన అవసరం లేదు. ఇలా రొమ్ము తొలగించాల్సి వచ్చినప్పుడు జబ్బు పూర్తిగా తొలగిపోయాక మళ్లీ ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా తొలగించిన రొమ్మును రీ–కన్‌స్ట్రక్ట్‌ చేయవచ్చు. కాబట్టి రొమ్ము తొలగింపు వల్ల వ్యాధి దూరం కావడం తప్ప నష్టమేమీ ఉండదు.

చివరగా... ‘హర్‌–2’ చాలా త్వరితగతిన విస్తరిస్తూ వేగంగా పెరిగిపోయే రొమ్ముక్యాన్సర్‌ అయినప్పటికీ... వైద్యరంగంలో ఇప్పుడు ఉన్న పురోగతి వల్ల మొదటిదశలో అయితే దాదాపు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉండటంతో పాటు... మిగతా దశల్లోనూ చాలావరకు దీని నుంచి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువనే అవగాహన పెంచుకోవడం అవసరం. దీనివల్ల ఎంతోమంది బాధితులకు మానసికంగా ధైర్యం, స్థైర్యం పెరుగుతాయి.
- డాక్టర్‌ నమ్రత సాయిరెడ్డి, కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌.

నిర్వహణ : యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement