ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
జ్యోతిర్మయం
తీవ్రమైన ఉత్కంఠలో ఉండి ఏ కబురు వినవలసి వస్తుందో అని భయంతో కంగారు పడుతున్న వాళ్లకు ఏదైనా శుభవార్త అందించవలసి వస్తే అప్పుడు మనం పలికే మొదటి మాటకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. మొదట క్షేమవార్తను, శుభవార్తను చెప్పి, తర్వాత దాని వెనక ఉన్న విషయాన్ని వివరంగా వివరిస్తే సదరు వ్యక్తులు నిశ్చింతగా వినగలుగుతారు.
అలా చెప్పకపోవటం వల్ల సంబంధిత వ్యక్తులు ఉత్కంఠ భరించలేక అనారోగ్యానికి కూడా గురవవచ్చు. కొందరు అసలు విషయాన్ని చెప్పకుండా జరిగిందంతా కథలు కథలుగా చెపుతూ ఫలితాన్ని చివరికి చెపుతారు. ఇది ఉత్కంఠ భరితులకు పెద్ద పరీక్ష. ఎదుటి వారి భయాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు.
రామాయణంలో సీతను అన్వేషించటానికి వెళ్లిన హనుమంతుని రాకకై వానరులు ఎదురు చూస్తున్నారు. హనుమంతుడు వచ్చాడు. ఏమి చెపుతాడోననే తీవ్రమైన ఉత్కంఠతో వానరులు చూస్తున్నారు. హనుమ, వాళ్లతో ‘కనిపించింది సీత’ అన్నాడు (దృష్టా సీతా). ముందు, సీత అంటే, కనిపించింది అంటాడో, కనిపించలేదు అంటాడో తెలియక వారంతా కంగారు పడవచ్చు. వాళ్ళను అలా కంగారు పెట్టటం, భయపెట్టటం ఇష్టంలేక, హనుమ ముందు, కనిపించింది అన్నాడు. వారి ఆనందా నికి అవధుల్లేవు.
బ్రహ్మ వర గర్వితుడైన హిరణ్యకశిపుడు దేవతలను పలు బాధలు పెడుతున్నాడు. దేవతలు విష్ణువును నిశ్చల భక్తితో ప్రార్థిస్తున్నారు. విష్ణువు, భయపడకండి, మీకు మేలు జరుగుతుంది, అన్నాడు. దేవతలు నిశ్చింతులు అయ్యారు. తర్వాత నెమ్మదిగా విష్ణువు, హిరణ్యకశిపు సంహారం ఇప్పుడే కాదు. కాలం కలిసిరావాలి అన్నాడు. ముందే ఈ మాట చెపితే దేవతలకు, కాలం ఎప్పుడు కలిసి వస్తుంది? ఎప్పుడు విష్ణువు సంహరిస్తాడు? అని ఉత్కంఠ తీవ్రతరం కావచ్చు. విష్ణువు మొదటి మాట దేవతలకు ఆనందం కలిగించింది. ఎదుటివారు భయంకర ఉత్కంఠలో ఉన్నప్పుడు మనం అనుసరించవలసిన పద్ధతి ఇదే!
– డా. చెంగల్వ రామలక్ష్మి


