breaking news
mythology
-
దుర్వాసుడి కోపానికి భార్య భస్మం.. ఆమె పేరుతో పుట్టిన చెట్టు ఇదే!
ఒకానొకప్పుడు దుర్వాసుడు గంధమాదన పర్వతంపైనున్న వనంలో తపస్సు చేసుకుంటున్నాడు.ఆయన తపస్సు చేసుకుంటున్న కాలంలోనే ఒకనాడు బలిచక్రవర్తి మనవడైన సాహసికుడు, అప్సరస తిలోత్తమ తగిన ఏకాంతం కోసం వెదుకులాడుతూ అక్కడకు వచ్చారు. నిశ్చలంగా తపోనిష్ఠలో కూర్చున్న దుర్వాసుడిని వారు గమనించినా, అతడిని పట్టించుకోకుండా, అతడి ఎదుటనే వారు యథేచ్ఛగా సరస సల్లాపాలకు దిగారు.వారి మాటలకు, వారు చేసే శబ్దాలకు దుర్వాసుడి ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆయన కళ్లు తెరిచి చూశాడు. తన ఎదుటనే సల్లాపాలు సాగిస్తున్న తిలోత్తమా సాహసికులు కనిపించారు. అసలే ముక్కోపి అయిన దుర్వాసుడు వారి చేష్టలకు మండిపడ్డాడు.‘దుర్మార్గులారా! తపోనిష్ఠలో ఉన్న నా ఎదుటనే మీరు నిర్లజ్జగా సల్లాపాలకు దిగారు. మీరు భూలోకంలో రాక్షసులై జన్మిస్తారు’ అని శపించాడు.దుర్వాసుడి ఆగ్రహానికి తిలోత్తమా సాహసికులు భయంతో వణికిపోయారు.‘మహర్షీ! మా అపరాధానికి మన్నించు. శాపోపశమనం నువ్వే అనుగ్రహించు’ అని ప్రార్థించారు.‘సాహసికుడికి బలరాముడి చేతిలో హతమయ్యాక శాప విమోచనం కలుగుతుంది. శ్రీకృష్ణుడి తనయుడితో కొంతకాలం జీవనం సాగించిన తర్వాత తిలోత్తమకు శాప విమోచనం కలుగుతుంది’ అని పలికాడు దుర్వాసుడు.తిలోత్తమా సాహసికుల కారణంగా తపోభంగం కలిగిన దుర్వాసుడికి తిరిగి ఏకాగ్రత కుదరలేదు. ఆయన మనస్సులో సంసార వాంఛ కలిగింది. దాంతో తపోనిష్ఠను విరమించుకున్నాడు. తనకు తగిన వధువును చూసుకుని, సంసారాశ్రమంలోకి ప్రవేశించాలని తలచాడు. ఔర్వ మహర్షి కుమార్తె కందళి వివాహానికి తగిన వయసులో ఉందని విన్నాడు. వెంటనే ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘మహర్షీ! నీ కుమార్తె వివాహానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నాను. నీకు అభ్యంతరం లేకుంటే, ఆమెను నేను వివాహం చేసుకుంటాను’ అని చెప్పాడు.‘దుర్వాసా! నా కుమార్తె కందళి అతిగారాబం వల్ల అవివేకిగా, కోపిష్టిగా తయారైంది. ఆమెను భరించడం కష్టం. అయినా నువ్వు ఆమెను పెళ్లాడతానంటే నాకు అభ్యంతరమేమీ లేదు’ అన్నాడు ఔర్వుడు.దుర్వాసుడు కందళిని వివాహం చేసుకోవడానికి తన సమ్మతి తెలిపాడు. ఔర్వుడు వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు.వివాహం తర్వాత దుర్వాసుడు భార్యను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. తన తపో మహిమతో ఆశ్రమంలో అన్ని భోగాలను కల్పించాడు. ఎన్ని భోగాలు కల్పించినా, కందళి తన ధోరణిని మార్చుకోలేదు. గయ్యాళితనంతో భర్తను నిత్యం దేనికో దానికి సాధించసాగింది. భరించినంత కాలం భరించిన దుర్వాసుడు తుదకు సహనం కోల్పోయాడు. ఒకనాడు ధ్యానం చేసుకుంటున్న దుర్వాసుడిని కందళి నిందించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కళ్లు తెరిచి ఆమెను తీక్షణంగా చూశాడు. ఆమె అక్కడికక్కడే భస్మీపటలమైపోయింది.వెంటనే ఆమె భస్మమైన చోటకు ఎగువగా ఆకాశంలో ఒక సుందరి రూపం కనిపించింది. ‘స్వామీ! నా దోషాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించు’ అని పలికి అదృశ్యమైపోయింది.ఆ దృశ్యాన్ని చూసిన దుర్వాసుడు తన భార్య కందళి పేరు భూమ్మీద శాశ్వతంగా నిలిచి ఉండేలా ‘కదళి’ వృక్షజాతిని సృష్టించాడు. దుర్వాసుడి భార్య పేరు కదళీ వృక్షాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయింది.ఇదంతా జరిగిన కొన్నాళ్లకు ఔర్వుడు దుర్వాసుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో తన కుమార్తె కందళి కనిపించలేదు. ఆయన దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. దుర్వాసుడిపై మండిపడ్డాడు.‘ఓరీ! నువ్వు అన్నీ తెలుసుకుని నా కుమార్తెను వివాహం చేసుకుని, ఆమెను భస్మీపటలం చేసి, నన్ను తీవ్రంగా అవమానించావు. దీనికి ఫలితంగా నువ్వు భవిష్యత్తులో అంబరీషుడి చేతిలో అవమానం పొంది మిగుల దుఃఖాన్ని అనుభవించగలవు’ అని శపించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఔర్వుడి శాపానికి దుర్వాసుడు కొంత చింతించాడు. అయినా జరిగేది జరగక మానదు అని తనను తాను సమాధానపరచుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు.- సాంఖ్యాయనపురావిశేషం..ఈ ఏడాది పితృపక్షంగా పేరుపొందిన మహాలయపక్షం నేటితో మొదలవుతోంది. పితృతర్పణాలకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం తమిళనాడులోని తిలతర్పణపురి. ఈ క్షేత్రంలోని ప్రధాన దైవం ముక్తీశ్వర స్వామి. అమ్మవారు స్వర్ణవల్లి. శైవక్షేత్రమైన ఈ ప్రదేశంలో పితృదేవతలకు తిలతండులాలతో తర్పణాలు విడిచిపెడితే వారికి ఉత్తమగతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.త్రేతాయుగంలో శ్రీరాముడు తన తండ్రి దశరథుడికి ఇక్కడే పిండప్రదానం చేశాడని, అలాగే, ద్వాపరయుగంలో పాండవులు కూడా తమ పితృదేవతలకు ఇదేచోట పిండప్రదానం చేశారని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో మరెక్కడా లేని విధంగా నరముఖ గణపతి ఆలయం ఉండటం విశేషం. ఆదివినాయకుడిగా పేరుపొందిన ఇక్కడి వినాయకుడు గజముఖంతో కాకుండా, మానవముఖంతో దర్శనమిస్తాడు.ఇదీ చదవండి: ఒకే నగరం.. ఎన్నో మ్యూజిక్ వేదికలు! ఎందుకంత స్పెషల్? -
శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
పూర్వం మాళవదేశంలో ఔరవుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగవేత్త, పండితుడు, మేధావి. అతడి భార్య సుమేధ. భర్తకు తగిన ఇల్లాలు. ఆ దంపతులకు ఒక బాలిక జన్మించింది. వారు ఆమెకు శమీక అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచసాగారు.శమీకకు ఎనిమిదేళ్లు వచ్చాక ఔరవుడు కుమార్తె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు. ధౌమ్యుడి పుత్రడు, శౌనక మహర్షి శిష్యుడు, గురుసేవాతత్పరుడు అయిన మందారుడు అనే బాలుడి గురించి విన్నాడు. ధౌమ్య శౌనకులతో తన ఇంటికి సకుటుంబ సపరివారంగా ఆహ్వానించి, మందారుడితో తన కుమార్తె శమీక వివాహాన్ని జరిపించాడు. వివాహం తర్వాత మందారుడు తన గురుకులానికి వెళ్లిపోయాడు.కొంతకాలానికి శమీక వ్యక్తురాలైంది. ఈ సంగతి తెలుసుకుని, మందారుడు అత్తవారింటికి వచ్చాడు. ఔరవుడు అతడికి మృష్టాన్న భోజనం పెట్టి, అల్లుడి మర్యాదలన్నీ చేశాడు. ధన కనక రాశులతో కుమార్తెను అప్పగించాడు. ‘విప్రపుత్రా! నా కుమార్తెను విధి విధానంగా నీకు అప్పగిస్తున్నాను. ఆమెను అత్యంత ప్రేమగా చూసుకుంటూ, జాగ్రత్తగా దాంపత్యం చేయాలి’ అని పరిపరి విధాలుగా జాగ్రత్తలు చెప్పి, సాగనంపాడు. శమీక మందారులు వెంటనే ఆశ్రమానికి వెళ్లక వనంలోనే సల్లాపాలాడుతూ గడపసాగారు. కొద్ది రోజులకు వారు ఉంటున్న వనానికి భృశుండి మహర్షి వచ్చాడు. దీర్ఘతపస్సు ఆచరించడం వల్ల ఆయన భ్రూమధ్యంలో తొండం అంకురించింది. నుదుట తొండం ఉన్న ఆ మహర్షి రూపాన్ని చూసి, శమీక మందారులు యవ్వన చాపల్యంతో పరిహసించారు.వారి పరిహాసానికి భృంశుడికి కోపం వచ్చింది. ‘మూర్ఖులారా! మీరు నన్ను పరిహసించి నవ్వారు. అందువల్ల మీరు సర్వప్రాణులూ వర్జించే వృక్షాలుగా మారిపోండి’ అని శపించారు. భృంశుడి శాపానికి శమీక మందారులు భయంతో వణికిపోయారు. వెంటనే క్షమించమంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లారు.‘మీరు నా నుదుటనున్న తొండాన్ని చూసి నవ్వారు. అందువల్ల తొండమున్న దేవుడైన వినాయకుడు మిమ్మల్ని కటాక్షించినప్పుడు మీకు మీ నిజరూపాలు తిరిగి వస్తాయి’ అని చెప్పి, వెళ్లిపోయాడు. శమీక శమీవృక్షంగా, మందారుడు మందారవృక్షంగా మారిపోయారు. అత్తవారింటికి వెళ్లిన శిష్యుడు ఎన్నాళ్లయినా తిరిగి రాకపోవడంతో శౌనకుడు శిష్య సమేతంగా ఔరవుని ఇంటికి వెళ్లి, మందారుడి గురించి అడిగాడు. తాను కూతురితో సహా అల్లుడిని చాలారోజుల కిందటే పంపానని ఔరవుడు బదులిచ్చాడు. పిల్లలు జాడలేకుండా పోవడంతో శౌనకుడు, ఔరవుడు– ఇద్దరూ చింతాక్రాంతులయ్యారు. అడవిమార్గంలో వారిని ఏ క్రూరమృగాలైనా చంపేసి ఉంటాయేమోనని లేదా చోరుల బారినపడి హతమైపోయి ఉంటారేమోనని భయపడ్డారు. చివరకు ఇద్దరూ కలసి శమీక మందారులను వెదకడానికి అడవిలోకి వెళ్లారు. అటవీమార్గంలో వారి పాదచిహ్నాలను గుర్తించారు. అలసిపోవడంతో ఔరవ శౌనకులు అడవిలోని కొలనులో స్నానం చేసి, ధ్యానమగ్నులయ్యారు. ధ్యానంలో వారికి జరిగినదంతా తెలిసింది.‘మందారుడిని చదువు కోసం అతడి తండ్రి నా గురుకులంలో వదిలి వెళ్లాడు. అతడికి నేనిప్పుడు ఏమని బదులివ్వాలి?’ అని శౌనకుడు శోకతప్తుడయ్యాడు. ఔరవుడిదీ అదే పరిస్థితి. గణేశుడిని ఆరాధించి, వీరి శాపవిమోచనను కోరుకుందాం అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వారు ఒంటికాలిపై నిలబడి గణేశుని కోసం తపస్సు ప్రారంభించారు. నిరాహారులై వారు ఒంటికాలిపై ఏకధాటిగా సాగిస్తున్న తపస్సుకు గణేశుడు ప్రసన్నుడయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఏకదంతుడు కళ్లముందు నిలిచే సరికి శౌనక ఔరవులు భక్తిపారవశ్యంతో అతడిని స్తుతించారు.‘భక్తులారా! మీ తపస్సుకు మెచ్చాను. మీ మనోభీష్టమేమిటో చెప్పండి, నెరవేరుస్తాను’ అని పలికాడు గజాననుడు. శౌనక ఔరవులు శమీక మందారుల వృత్తాంతాన్ని చెప్పి, వారికి శాపవిమోచనం కలిగించాలని కోరారు. గణేశుడు ‘తథాస్తు’ అని పలికాడు.‘నేను ఎల్లప్పుడూ మందారవృక్ష మూలంలో నిలిచి ఉంటాను. శమీవృక్షంలోనూ కొలువై ఉంటాను. నాకు దూర్వాంకురాలే కాకుండా శమీపత్రాలు కూడా ప్రీతిపాత్రమవుతాయి. దూర్వాంకురాలు, మందార పత్రాలు లభించనప్పుడు శమీపత్రాలతో పూజిస్తే, నేను ప్రసన్నుడనవుతాను. దూర్వాంకుర, మందారపత్ర, శమీపత్రాలతో నన్ను పూజించేవారికి మనోవాంఛిత సిద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయి’ అని పలికి గణపతి అంతర్ధానమయ్యాడు.పురావిశేషం..ఇది దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కుమావూ కొండల ప్రాంతంలో చితాయి గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు ‘గోలూ దేవతా’ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి మూలవిరాట్టు ‘చితాయీ గోలూ దేవత’ శివుడి అవతారమైన గౌరభైరవుడు. గౌరభైరవుడు సత్వరన్యాయం చేస్తాడని భక్తుల విశ్వాసం. న్యాయం కోరుతూ రాసే విజ్ఞాపనపత్రాలను భక్తులు ఈ ఆలయంలో వేలాడదీస్తారు. తమకు న్యాయం జరిగితే, ఆలయానికి తిరిగి వచ్చి కంచు లేదా రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన గంటలను వేలాడదీస్తారు. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా, అసంఖ్యాకంగా గంటలు, భక్తులు వేలాడదీసే విజ్ఞాపనపత్రాల కాగితాలు కనిపిస్తాయి.- సాంఖ్యాయనఇదీ చదవండి: కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు? -
ఏ శుభకార్యమైనా గణపతి పూజతోనే ఎందుకు మొదలు? కారణం ఇదే!
మహాభారత కర్త, అష్టాదశ పురాణకర్త వేదవ్యాసుడు వేదాలకు వ్యాఖ్యానంగా, కలియుగంలో మానవులకు సరళ సుబోధకంగా ఉండేటట్లు ప్రతి ఆశ్రమంలోను పాటించవలసిన విధి విధానాలను చెప్పాలనుకున్నాడు. కానీ భావస్ఫూర్తి, వ్యక్తీకరణలలో స్తబ్ధత ఏర్పడింది. ఎందుకలా జరిగిందో తెలియలేదు. వెంటనే వ్యాసుడు సత్యలోకానికి వెళ్లి, బ్రహ్మ పాదాలకు ప్రణమిల్లి, ఈ స్తబ్ధతకు కారణం తెలపమని, దాని నుంచి బైటపడి కార్య సాఫల్యం జరిగే మార్గం తెలపమని ప్రార్థించాడు.అప్పుడు బ్రహ్మ వ్యాసునితో, ‘నువ్వు వేద విభాగ కార్యారంభంలో, ఈ సృష్టికి ఆద్యుడు, సర్వ కార్యాలకు కర్త, త్రిమూర్తులమైన శివుడు, విష్ణువు, నేను కూడా ప్రణవస్వరూపంగా ధ్యానించే మూర్తి, ముఖ్యంగా నమ్మినవారికి కార్య సాఫల్యం కూర్చేవాడు అయిన గజాననుని పూజించలేదు. ఆ వినాయకుని సర్వ కార్యారంభాలలోనూ, స్మరించుట చేతనూ, భక్తితో పూజించటం వల్లనూ సకల విఘ్నాలు దూరమవుతాయి. గణపతి ప్రసన్నుడైతే నీ కార్యం సాను కూలమవుతుంది. వెంటనే ఆ దేవదేవుని పూజించి శరణు పొందు’ అని బ్రహ్మ చెప్పాడు.అప్పుడు వ్యాసుడు బ్రహ్మను ‘ఆ విఘ్నహరుడు ఎలా ఉంటాడు? ఇంతకు మునుపు ఎవరెవరిని అనుగ్రహించాడు? ఆయన చేసిన మహత్తర కార్యాలేవి?’ అని ఆసక్తిగా ప్రశ్నించాడు. గణేశుని పూజించి తరించిన అనేక భక్తుల కథలను బ్రహ్మ వినిపించి, వ్యాసునికి కార్యసిద్ధి ప్రదం అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి, అనుష్టాన క్రమాన్ని వివరించి, గణేశుని ప్రసన్నుని చేసుకుని వరం కోరుకొమ్మన్నాడు. అలాగైతేనే ‘నీకు సమస్త గ్రంథ రచనా శక్తి కలుగుతుం’దని చెప్పాడు. కారణం తెలిసింది. వ్యాసుని నిర్వేదం తొలగింది. గణపతి ఆదిదైవం. అందుకే ఏ పూజనైనా, ఏ శుభ కార్యాన్నైనా గణపతి పూజతోనే ప్రారంభిస్తాం.– డా. చెంగల్వ రామలక్ష్మిఇదీ చదవండి: తెలివైన చలికోడి -
దేవుడు వరమందిస్తే...!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మైథాలజీ , డివోషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాల ట్రెండ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘ఇరుముడి’, సూర్య తమిళ సినిమా ‘కరుప్పు’, బాలీవుడ్ సినిమా ‘హను మాన్ అంశ్’, యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ చిత్రాల సక్సెస్‌ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజీ అండ్ డివోషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఏంటి? దేవుడు వరం అందిస్తే... తమకు హిట్ కావాలన్నట్లుగా ఏయే హీరోలు ఈ జానర్లో సినిమాలు చేస్తున్నారు? అన్న అంశాలపై మీరూ ఓ లుక్ వేయండి.భూలోకం టు సత్యలోకం బ్రహ్మదేవుడి సత్యలోకం ఎలా ఉండబోతుందనేది వెండితెరపై ‘విశ్వంభర’ సినిమాలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వంభర’. ఈ మైథాలజీ అంశాలతో కూడిన ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. కథ రీత్యా... పధ్నాలుగు లోకాలు దాటుకుని సత్యలోకంలో ఉన్న హీరోయిన్ను హీరో ఎలా భూలోకానికి తిరిగి తీసుకు వస్తాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, కథలో భాగంగా దొరబాబు పాత్రకు ఐదుగురు సిస్టర్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. సురభి, రమ్య పసుపులేటి వంటి నటీమణులు ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ పనులు కూడా తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఏడాది అక్టోబరులో దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ కాకపోవచ్చని, వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి తొలి వారంలో (జనవరి 9న విడుదల అని ఫిల్మ్‌నగర్ టాక్) తెరకు రావొచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘కాకా’ జనవరి 13న రిలీజ్‌కి షెడ్యూల్ అయ్యింది. దీంతో వచ్చే సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ అవుతుందా? లేక ముందుగా అనుకున్నట్లుగా ‘కాకా’నే సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. రామాయణం ఆధారంగా వారణాసి మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయిందని ఈ చిత్రదర్శకుడు రాజమౌళి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ‘వారణాసి’ సినిమా ప్రధాన కథాంశం తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమా కథనంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, మైథాలజీ అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ఓ 30 నిమిషాల సీక్వెన్స్‌లో రాముడు పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లుగా రాజమౌళి అండ్ టీమ్ ఆల్రెడీ పేర్కొంది. దీంతో రాముడి గెటప్‌లో మహేశ్‌బాబు ఎలా ఉండబోతున్నారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇంకా ఈ మైథాలజీ సీక్వెన్స్ ‘వారణాసి’ సినిమాకు ఎంత హైలైట్‌గా ఉండబోతుంది? అన్న అంచనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేశ్‌బాబు క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని తెలిసింది. రుద్రగా, రాముడిగా మహేశ్‌బాబు కనిపించనున్నారు. ఈ రెండు పాత్రల్లోనే కాకుండా మరో మూడు డిఫరెంట్ గెటప్స్‌లో మహేశ్‌బాబు కనిపిస్తారని, థియేటర్స్‌లో ఇవి ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇంకా ఈ చిత్రంలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శివభక్తుడి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారని తెలిసింది. ఇక ప్రపంచ సంరక్షణ కోసం కాలాతీతంగా సాహసోపేతమైన ప్రయాణం చేసే ఓ వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో ‘వారణాసి’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. తొలిసారిగా... ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటి విజయ్ దేవరకొండనే మెయిన్ హీరోగా ఓ మైథాలజీ డ్రామా వస్తే ఆయన అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అందుకే ఈ తరహా సినిమాను త్వరలోనే సెట్స్‌కు తీసుకుని వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై సరైన స్పష్టత రావాల్సి ఉంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమాల రిలీజ్ తర్వాత శౌర్యువ్ సినిమాను విజయ్ సెట్స్‌కు తీసుకువెళ్తారని ఊహించవచ్చు. ఇటు జై హనుమాన్ – అటు మహాకాళి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ‘హను–మాన్’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో సినిమా ‘జై హను మాన్’. ‘కాంతార’ ఫేమ్ కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కథనం ప్రధానంగా లార్డ్ హనుమాన్ నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇందులో రానా, బాలీవుడ్ నటి వామికా గబ్బి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలోని రాముడు పాత్రలో ఓ టాప్ టాలీవుడ్ స్టార్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే ఈ ‘పీవీసీయూ’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న మరో మైథాలజీ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘మహాకాళి’. ‘ది ఎండ్ బిగిన్స్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రేయా రెడ్డి, రోహిత్ సరాఫ్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరిట ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారి తీస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా, పూజ అపర్ణ కొల్లూరు దర్శ కత్వంలో ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా, అమ్మవారి పాత్రలో శ్రియా రెడ్డి నటిస్తున్నారని ఇటీవల విడుదలైన, గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఈ ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వడ్డీ కాసులవాడు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న డివోషనల్ ఫిల్మ్ ‘వడ్డీ కాసులవాడ’. ఈ చిత్రంలో రవి మోహన్ (‘జయం’ రవి) వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్నారు. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం ఈ సినిమాకు సహ–నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇలా మైథాలజీ అండ్ డివోషనల్ అంశాలు మిళితమైన మరికొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.దేవ సేనాపతి ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి యాక్షన్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండోసారి సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. లార్డ్ కుమారస్వామి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ సినిమా అనౌన్స్మెంట్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. కొంత కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోని ‘డ్రాగన్’ సినిమాతో ఇటు ఎన్టీఆర్, వెంకటేశ్ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో అటు త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు.‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు నెలలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్‌తో తాను చేయబోయే సినిమాతో త్రివిక్రమ్ మరింత బిజీ అవుతారని ఊహించవచ్చు. అంతే కాదు... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం ‘దేవ సేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించిందట యూనిట్. ఈ చిత్రం 2028లో థియేటర్స్‌లోకి రావొచ్చనే ఊహాగానాలు కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.భక్తి నేపథ్యంలో కూడిన సినిమాలకు ఇటీవలి కాలంలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలుస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందినప్పటికీ ఈ సినిమాకు కాస్త డివోషనల్ టచ్ ఉంది. అయ్యప్పస్వామి బ్యాక్‌డ్రాప్‌ని కథలో కన్విన్సింగ్‌గా మిళితం చేయడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. ⇒ సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’గా రిలీజైంది). ఈ సినిమా వీరభద్రుడి స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ⇒ జస్ట్ రూ. 2 కోట్లతో తీసిన హిందీ సినిమా ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి, ట్రేడ్ వర్గీయులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ డివోషనల్ సినిమాకు డా. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. రాగిణి ఎస్, నమ్రత జి. సింగ్, అనుప్రియ ఎ. నగర్, డా. విశాల్ చతుర్వేది నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. త్రివిక్రమ్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 18న రిలీజ్ చేస్తోంది.⇒ నయనతార నటించిన మైథాలజీ అండ్ డివోషనల్ ఫిల్మ్ ‘ముక్కుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాదేవి’) ఈ దీపావళికి రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది. సుందర్.సి ఈ సినిమాకు దర్శకుడు. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.మైథాలజీ, భక్తి నేపథ్యంలో లైవ్ యాక్షన్ సినిమాలే కాకుండా, యానిమేషన్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను సాధిస్తున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్’ యూనివర్స్ నుంచి ఇప్పటికే వచ్చిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ 2025లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ యూనివర్స్ నుంచి రెండో భాగంగా ‘మహావతార్ పరశురామ్’ 2027లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మొత్తం ఏడు సినిమాలు ఈ యూనివర్స్ నుంచి రిలీజ్ కానున్నాయి. అశ్విన్ కుమార్ ఈ యానిమేషన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సంవత్సరాలకొకసారి ఈ యూనివర్స్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుందని, అప్పట్లో మేకర్స్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ⇒ ‘బాహుబలి’ ఎంతటి బ్లాక్‌బస్టర్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యూనిమేషన్ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం వచ్చే ఏడాది రానుంది. స్వర్గలోకాధిపతి ఇంద్రుడికి, బాహుబలికి మధ్య వైరం ఎలా మొదలైంది? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘బాహుబలి’ని మైథాలజీ వరల్డ్‌లోకి రాజమౌళి తీసుకువచ్చారు. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ యానిమేషన్ సినిమాను నిర్మిస్తుండగా, ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూనిమేషన్ మూవీలోని బాహుబలి పాత్రకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వనుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ⇒ ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. లార్డ్ హనుమాన్ ఆధారంగా ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై మరోమారు సరైన అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ యానిమేషన్ సినిమాను తీస్తున్నారని, కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని, త్వరలోనే ఈ అంశంపై ఓ అప్డేట్ రానుందనే ప్రచారం సాగుతోంది. ఇలా మైథాలజీ, భక్తిభావంతో కూడిన మరికొన్ని యూనిమేషన్ సినిమాల రూపకల్పనకు తెలుగు దర్శక– నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. – ముసిమి శివాంజనేయులు -
పాండురాజుకు ఆ శాపం ఎందుకు వచ్చింది?
పాండురాజుకు మృగవధ వలన శాపం తగిలింది. ‘ఎవరికీ అపకారం చేయక, ప్రకృతి సహజమైన సుఖాన్ని పొందుతున్న సమయంలో, విచక్షణా రహితంగా మమ్ములను బాణహతికి గురిచేసావు. కాబట్టి నీవు కూడా నీ చివరి క్షణాలలో మావంటి బాధనే అనుభవించి మరణిస్తావు!’ అని శపించింది ఆ మృగమిథునం.మృగమిథునం పాండురాజుకు ఇచ్చిన ఈ శాపంతో మహాభారత కథ రెండవ అతిపెద్ద మలుపు తిరిగింది. శంతనుడి రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టిన ఇద్దరు కొడుకులు– చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు– పుత్రహీనులుగా మరణించగా, వారి భార్యలైన అంబిక, అంబాలికలకు, దేవరన్యాయం పద్ధతిన వ్యాసమహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతానంగా కలగడం అన్నది మహాభారత కథలోఅంతకు ముందు చోటుచేసుకున్న మొదటి ముఖ్యమైన మలుపు.అయితే ఆ ముగ్గరిలో రాజు కాగలిగి, రాజ్యాధికారం చేపట్టగలిగిన లక్షణాలున్న పాండురాజుకు, మృగమిథున శాపం తగిలి, తన భార్యలైన కుంతి, మాద్రిల ద్వారా తన సంతానాన్ని నేరుగా కురువంశానికి అందించలేకపోవడం అన్న విచిత్ర స్థితి దాపురించి, తన అంశతో సంతానాన్ని ఇవ్వగలగడం అన్నది విధివశాన లేకుండాపోయింది.క. ఎట్టి విశిష్ట కులంబునబుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్గట్టిన కర్మఫలంబులునెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్?‘పూర్వం చేసిన దుష్కర్మల ఫలం వెంటాడుతుంది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ, అతడిని కొన్ని క్షణాలు విచక్షణను పోగొట్టుకునేలా చేసి, పాపకార్యం మళ్ళీ చేసేలా అది చేస్తుంది. అలా సంక్రమించిన పాపకార్య ఫలం ఒక జన్మలో కాకుంటే, ఆ తరువాత మరొక జన్మలో భోగింపక– అనగా అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతటి వానికైనా సాధ్యంకాదు’ అని పై సందర్భానికి అనుగుణంగా నన్నయ భట్టారకుడు ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వంలో సర్వకాలీనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూక్తీకరించి చెప్పాడు.– భట్టు వెంకటరావు -
సంకష్టహర చతుర్థి వ్రతం.. తన జీవితాన్నే మార్చేసింది!
పూర్వం హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు అమిత బలసంపన్నుడు, ధర్మపరాయణుడు. అతడి భార్య సుగంధి. సంపదలకు లోటు లేకున్నా, వారికి సంతానమే లేదు. సంతాన ప్రాప్తికి వారు చేయని వ్రత, దాన, యజ్ఞ యాగాలు లేవు. ఎన్ని చేసినా, పురాకృత పాపఫలితంగా వారికి సంతానం కలగలేదు.సంతాన రాహిత్యంతో రాజదంపతులు నిరాశలో కూరుకుపోయారు. రాజ్యాన్ని, సంపదను అమాత్యులకు విడిచి, తపోనిష్ఠతో కాలం గడపడానికి అడవులకు బయలుదేరారు. అడవులలో వారు కఠిన నియమాలను పాటిస్తూ, తపోనిష్ఠలో కాలం గడపసాగారు. కేవలం చెట్ల నుంచి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుండటంతో కృశించిపోయారు. వారు ధ్యానంలో ఉన్నప్పుడు వారి శరీరాలను క్రిమి కీటకాదులు తినేయసాగాయి. కొన్నాళ్లకు రాజదంపతులు శల్యావశిష్టులుగా మిగిలారు.ఒకనాడు గగనమార్గాన పోతున్న త్రిలోక సంచారి నారద మహర్షి కృతవీర్య దంపతుల పరిస్థితిని గమనించాడు. ఆయన వెంటనే పితృలోకానికి చేరుకుని, అక్కడ కృతవీర్యుడి తండ్రి వద్దకు వెళ్లి, ‘మర్త్యలోకంలో నీ కొడుకు, కోడలు సంతానం కోసం అలమటిస్తూ, తపశ్చర్యలో నిమగ్నులై, శల్యావశిష్టులుగా మిగిలారు. వారి పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా ఉంది.’ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు.దారిలో నారదుడికి ఒక దారుణ దృశ్యం కనబడింది. భృంశ మహర్షి తల్లిదండ్రులు, బంధువులు కుంభీపాక నరకంలో అధోముఖులై వేలాడుతూ, యమభటుల దండనలకు తాళలేక హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి, నారదుడు విచలితుడయ్యాడు. వెంటనే, భృంశుడి వద్దకు వెళ్లాడు. ‘మహర్షీ! నువ్వు సాక్షాత్తు సర్వజ్ఞుడవు. సాక్షాత్తు గణేశ సమానుడవు. కపిలాది మహర్షులు నీ దర్శనం కోరి వస్తుంటారు. అలాంటి నీ తల్లిదండ్రులు, బంధువులు నరకంలో యమబాధలు అనుభవిస్తుండటం బాధ కలిగిస్తోంది. నీ పూర్వుల నరక విమోచనం కోసం చేయదగిన పరిహారం ఏదైనా ఉంటే, నువ్వు ఉపేక్షించక దానిని వెంటనే ఆచరించు’ అని పలికాడు.నారదుడి ద్వారా తన పితరుల బాధలు తెలుసుకున్న భృంశుడు చింతాక్రాంతుడై, కొద్దిసేపు ఆలోచించాడు. తాను ఏళ్లతరబడి ఆచరిస్తూ వచ్చిన సంకష్టహర చతుర్థి వ్రతఫలంలో ఒకరోజు వ్రతఫలాన్ని ససంకల్పితంగా తన పితరులకు ధారపోశాడు. అతడు తన వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే భృంశుడి పితరులందరూ నరక కూపం నుంచి విముక్తి పొందారు. దేవతలు తీసుకువచ్చిన దివ్యవిమానంలో వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, నారదుడి ద్వారా తన కుమారుడి పరిస్థితి తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి, ‘బ్రహ్మదేవా! నా కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకపోవడం వల్ల తపోనిష్ఠలో శల్యావశిష్టుడిగా మిగిలాడు. నా కుమారుడి సంతానలేమికి కారణమేమిటి? అతడి పురాకృత పాపకర్మ నశించడానికి తగిన తరుణోపాయమేది? నువ్వే చెప్పాలి’ అని అడిగాడు.‘నీకు నీ తనయుడి పూర్వజన్మ విశేషాలు చెబుతాను, విను. నీ రాజ్యంలోనే సామ అనే దుష్టుడు ఉండేవాడు. అతడు నిష్కారణంగా పన్నెండుమంది బ్రాహ్మణులను వధించి, వారి మృతదేహాలను ఒక కొండగుహలో పారవేశాడు. ఒకనాడు అతడికి పొద్దుగూకే వరకు ఎక్కడా తిండి, నీళ్లు దొరకలేదు. అలసి సొలసి పొద్దు గూకిన తర్వాత ఇంటికి చేరుకున్న మరుక్షణమే, తన కొడుకును ‘గణేశా! గణేశా!’ అని పిలిచాడు. కొడుకుతో కలసి భోజనం చేశాడు. సామకు తెలియకున్నా, ఆరోజు మాఘ కృష్ణ చతుర్థి. మరికొన్నాళ్లకు అదే తిథినాడు సామ కాలధర్మం చెందాడు. సంకష్టహర చతుర్థినాడు తెలియక చేసిన పుణ్యఫలితంగా మరణానంతరం స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పుణ్యశేషం వల్లనే నీకు కొడుకుగా పుట్టాడు. పురాకృత పాపకర్మ మిగిలి ఉండటం వల్ల అతడికి సంతానం కలగలేదు’ అని బ్రహ్మదేవుడు చెప్పాడు.‘విరించీ! పాపాకర్మ పరిహారానికి తరుణోపాయమేమిటో నువ్వే చెప్పు’ అడిగాడు కృతవీర్యుడి తండ్రి.‘సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారం ఆచరిస్తే, అతడికి పాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పి, వ్రత విధానాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు.బ్రహ్మదేవుడి ద్వారా సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకున్న అతడు తన కొడుకు వద్దకు చేరుకుని, ‘కృతవీర్యా! పురాకృత పాపకర్మ ఫలితంగానే నీకు సంతానం కలగలేదు. సంకష్టహర చతుర్థివ్రతం ఆచరించినట్లయితే, నీకు పాపవిమోచనం కలిగి, సంతానం కలుగుతుంది’ అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రత విధానాన్ని బోధించాడు.కృతవీర్యుడు పత్నీసహితంగా నియమానుసారంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పాపకర్మ నశించింది. కొన్నాళ్లకు కృతవీర్యుడి భార్య సుగంధి గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అయితే, అతడికి చేతులు లేవు. పెరిగి పెద్దయ్యాక అతడు తీవ్ర తపస్సుతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, సహస్రబాహువులు పొందాడు. సహస్రబాహు అర్జునుడిగా, కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు.- సాంఖ్యాయనఇవి చదవండి: ఒకనాటి ఆదివారం -
ఇంద్రపదవి అడిగిన రజి.. దేవతలు చెప్పిన మాటతో కథే మారిపోయింది!
పురూరవుడి కొడుకు ఆయువుకు నహుషుడు, క్షుత్రవృద్ధుడు, రంభుడు తర్వాత మహా బలసంపన్నుడైన రజి అనే కొడుకు కలిగాడు. రజికి ఐదువందల మంది కొడుకులు కలిగారు. రజి తన రాజ్యాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో దేవ దానవుల నడుమ భీకర సంగ్రామం జరిగింది. రోజులు గడుస్తున్న కొద్ది పోరు మరింత ఘోరంగా పరిణమిస్తోందే తప్ప, జయాపజయాలు ఎటూ తేలడం లేదు. ఎటూ తోచక ఉభయపక్షాలవారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, ‘బ్రహ్మదేవా! ఈ పోరులో అంతిమ విజయం ఎవరికి దక్కుతుందో నువ్వే చెప్పాలి’ అని అడిగారు.అప్పుడు బ్రహ్మదేవుడు, ‘నాయనలారా! రజి మహారాజు మీలో ఎవరి పక్షం వహిస్తే, పోరులో విజయం వారినే వరిస్తుంది’ అని చెప్పాడు.వెంటనే మొదట దానవులు రజి మహారాజు వద్దకు వెళ్లారు. రజి వారిని సాదరంగా ఆహ్వానించి, వచ్చిన పనేమిటో చెప్పమన్నాడు.‘మహారాజా! మాకు, దేవతలకు సంగ్రామం జరుగుతోంది. నువ్వు మా పక్షాన యుద్ధంలో పాల్గొనాలని మా కోరిక’ అని చెప్పారు దానవులు.‘మీ తరఫున యుద్ధం చేయాలంటే, నాదొక్కటే షరతు. యుద్ధం ముగిశాక నాకు ఇంద్రపదవి ఇస్తామని మాట ఇవ్వండి’ అన్నాడు రజి మహారాజు.దానవులు తమలో తాము తర్జన భర్జనలు పడి, ‘రాజా! ఇప్పుడు మాట ఇచ్చి, తర్వాత కాదనడం ధర్మం కాదు. అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురమే మంచిది. మా లోకానికి రాజు ప్రహ్లాదుడు. ఆయనకు ఇంద్ర పదవి దక్కాలనే మేమంతా దేవతలతో యుద్ధానికి సిద్ధపడ్డాం. కాబట్టి నీకు ఇంద్రపదవిని ఇవ్వలేము. మరింకేదైనా కోరుకుంటే తప్పక ఇస్తాము’ అని చెప్పారు.‘ఇంద్ర పదవి తప్ప మరేదీ నాకు సమ్మతం కాదు’ తెగేసి చెప్పాడు రజి మహారాజు.చేసేది లేక దానవులు వెళ్లిపోయారు.దానవులు వెళ్లిపోయిన కొద్దసేపటికే దేవతలందరూ రజి మహారాజు వద్దకు వచ్చారు. యుద్ధంలో తమ పక్షాన పాల్గొనాలని అభ్యర్థించారు.దానవులతో చెప్పినట్లే, ‘యుద్ధం ముగిశాక నాకు ఇంద్ర పదవి ఇవ్వడానికి అంగీకరిస్తేనే మీ తరఫున యుద్ధంలో పాల్గొంటాను’ అని కరాఖండిగా చెప్పాడు.దేవతలు ఎక్కువగా ఆలోచించకుండా, రజి మహారాజు షరతుకు తమ సమ్మతి తెలిపారు.రజి మహారాజు తన సేనలను వెంటబెట్టుకుని దేవతల తరఫున యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధరంగంలో వీరవిహారం చేస్తూ, శత్రువులు కని విని ఎరుగని దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. అనాయాసంగానే అశేష దానవ వాహినిని పరాజితులను చేశాడు. అతడి అస్త్రాల ధాటికి మరణించిన వారు మరణించగా, మిగిలిన దానవులు పలాయనం చిత్తగించారు. రజి మహారాజు సాయంతో దేవతలు విజేతలయ్యారు.యుద్ధం ముగిశాక దేవేంద్రుడు రజి మహారాజు పాదాల ముందు మోకరిల్లి, ‘మహానుభావా! ఆర్తుడనైన నాకు అభయప్రదానం చేసి, స్వర్గలోకాన్ని కాపాడావు. అభయప్రదాతవు గనుక నువ్వు నాకు సాక్షాత్తు పితృసమానుడవు. ముల్లోకాలకూ ఆరాధ్యుడవైన పురుషోత్తముడవు నువ్వు. నన్ను నీ పుత్రుడిగా స్వీకరించు’ అని ప్రార్థించాడు.దేవేంద్రుడి ప్రణుతి వాక్యాలలోని అంతరార్థాన్ని గ్రహించిన రజి మహారాజు చిరునవ్వు చిందించాడు. ‘శరణు కోరినవాడు పగవాడైనా తిరస్కరించడం వీరధర్మం కాదు. నర్మగర్భంగా, నయంగా మాట్లాడి నువ్వు నా మనసు చూరగొన్నావు. నీ మనోగతం నాకు అవగతమైంది. నీ స్వర్గాన్ని నీకు పునర్దత్తం చేస్తున్నాను’ అని పలికి, తనకు దేవతలు ఇచ్చిన ఇంద్రపదవిని తిరిగి దేవేంద్రుడికే కట్టబెట్టి, నిజ నివాసానికి బయలుదేరాడు.రజి మహారాజు తన నివాసానికి చేరుకునేలోగానే, నారద మహర్షి అతడి ఐదువందల మంది కొడుకులను రెచ్చగొట్టాడు. ‘మీ తండ్రికి ఇంద్రపదవి ఇస్తామని మాట ఇచ్చి, మాయోపాయంతో దేవేంద్రుడు తిరిగి ఆ పదవిని దక్కించుకున్నాడు’ అని నూరిపోశాడు.నారదుడి మాటలతో రెచ్చిపోయిన రజి మహారాజు కొడుకులు మూకుమ్మడిగా స్వర్గంపైకి దండయాత్రకు వెళ్లారు. తమ తండ్రి సాధించిన ఇంద్రపదవి వారసత్వ పరంపరగా తమకే దక్కాలంటూ ఇంద్రుడితో వాదించారు. అతడు కాదనడంతో, అతడిని సింహాసనం పైనుంచి ఈడ్చి పడేసి, స్వర్గం నుంచి తరిమి కొట్టి, స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు.పురావిశేషం..ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ప్రదేశంలో 1844లో నేలను తవ్వుతుండగా, రాతి శివలింగం కనిపించింది. శివలింగాన్ని వెలికి తీసి, పూజలు జరిపిన స్థానికులు ఆలయాన్ని నిర్మించారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఈ ఆలయ ప్రాంగణం సిపాయిల రహస్య సమావేశాలకు వేదికగా ఉండేది. నాటి సిపాయిల దళాన్ని ‘బ్లాక్ ప్లటూన్’గా ‘కాలీ పల్టన్’గా పిలుచుకునేవారు. ఏటా శ్రావణ మాసంలో కావడి యాత్రికులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అప్పట్లో ఆలయం కొంత దెబ్బతింటే, 1968లో ఇప్పుడు ఉన్న విధంగా పునర్నిర్మంచారు.- సాంఖ్యాయనఇవి కూడా చదవండి: ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా? -
శివుడు శరభుడిగా ఎందుకు మారాడు?
శివపురాణం ప్రకారం పరమశివుని అత్యంత ఉగ్రశక్తిమంతమైన అరుదైన రూపాలలో శరభేశ్వర రూపం ఒకటి. హిరణ్యకశిపుని వధించిన తరువాత శ్రీమహావిష్ణువు నరసింహావతారంలోని ఉగ్రత, క్రోధం తగ్గక పోవడంతో ఆ శక్తి లోకాలకే ముప్పుగా మారుతుందేమోనని దేవతలు భయపడి పరమశివుడిని ప్రార్థించారు. నరసింహుడి ఉగ్రత తగ్గించడానికై శివుడు ముందుగా తన అంశమైన వీరభద్రుడిని పంపాడు. అయినా నరసింహుని ఉగ్రతను శాంతింపజేయడం సాధ్యం కాలేదు అప్పుడు శివుడే స్వయంగా శరభ రూపాన్ని ధరించాడు. ఈ రూపంలో సింహస్వభావం పక్షిశక్తి, మానవాకృతి లక్షణాలు కలిసిపోయినాయి. విశాలమైన రెక్కలు, పదునైన గోర్లు, బలమైన కాళ్లు కలిగిన మహాశక్తిగా శరభేశ్వరుడు ఆవిర్భవించి నరసింహుని ఉగ్రతను అదుపు చేసి లోకాలలో శాంతిని నెలకొల్పాడు.వైష్ణవం ప్రకారం నరసింహుడు శరభుని ఎదుర్కొనేందుకు రెండుతలల మహాబలశాలైన గండభేరుండ రూపాన్ని ధరించాడు. శరభుడు గండభేరుండ మధ్య జరిగిన భీకరపోరాటం తరువాత ఆదిపరాశక్తి జోక్యంతో ఉగ్రశక్తులు శాంతించాయి. ఈ గాథల అంతరార్థం శివుడు విష్ణువు మధ్య పోటీని చెప్పడం కాదు అపరిమితమైన ఉగ్రతకు శాంతి అవసరం. ఎంతటి శక్తికైనా నియంత్రణ అవసరమని, చివరికి సమానత్వమే లోకక్షేమానికి ఆధారమని తెలియజేయడమే ఈ గాధ లక్ష్యం. హరిహరతత్త్వం కూడా శివకేశవుల మధ్య భేదం లేదనే తత్త్వాన్ని బలపరుస్తుంది.శరభేశ్వరుని రూపం దక్షిణ భారత దేవాలయ శిల్పకళలో విశేష స్థానం పొందింది. ముఖ్యంగా తమిళనాడులోని త్రిభువనంలోని కంపహరేశ్వర ఆలయంలో చోళులకాలం నాటి శరభశిల్పం బాగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటకలోని హోయసలుల దేవాలయ శిల్పాలలో కూడా శరభుడు వంటి ఉగ్ర జీవరూపాలు అద్భుతమైన కళానైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు పురాణకథలను మహిమను మాత్రమే కాకుండా ఆనాటి శిల్పుల అపూర్వ ప్రతిభననూ తెలియజేస్తాయి.శరభేశ్వరుని గాథ భారతీయ సనాతన ధర్మంలోని శక్తి, ఉగ్రత, శాంతి, సమతుల్యత, హరిహర ఏకత్వం వంటి గొప్ప భావాలను తెలియజేసే అరుదైన పురాణ గాథగా నిలిచింది.– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ -
ధర్మవాక్కు..! అతడి మరణాన్ని ముందే చెప్పిన అయోధ్య రాజు!
పూర్వం అయోధ్యను అనరణ్యమహారాజు పాలించేవాడు. ఆ రోజులలో రావణుడు తనకు యక్ష కిన్నర కింపురుషాదులలో ఎవరి వలననూ మరణం కలగకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ బలంతో రాజులందరినీ పరాజితులను చేసి, అవమానపరచి ఆనందిస్తున్నాడు. అది తెలిసి, ముందుగానే లొంగిపోయి ప్రాణం రక్షించుకున్నారు కొందరు.అయోధ్యను పాలించిన అనరణ్యమహారాజు మాత్రం రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ‘పూటకొకమాటు ఆకలిదప్పులతో అల్లాడే నరుల సేనను నా సైన్యం వేసే శరసమూహజ్వాలల దాహాన్ని తీర్చడానికి తెచ్చావా?’ అని హాస్యమాడాడు రావణుడు. ఇరువురికీ ముఖాముఖి జరిగిన యుద్ధంలో చివరన సారథిని కూల్చి, అనరణ్యమహారాజును రథహీనుడిని చేసి నేలమీద పడేట్లు చేశాడు. ‘మృత్యువు కూడా నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అలాంటిది నువ్వెంత? ఓడిపోయానని ఒప్పుకో, వదిలేస్తాను!’ అన్నాడు. ఒప్పుకోకుండా రావణుడి చేతిలో వీరమణం పొందాడు. అయితే, మరణానికి ముందు, ‘ఎప్పటికైనా నా వంశంలో పుట్టిన వీరుడి చేతిలోనే నీవు మరణం పొందుతావు!’ అన్నాడు. ఆ మాటలకు నవ్విన రావణుడితో అనరణ్యమహారాజు ఇంకా ఇలా అన్నాడని కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ తృతీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం చెబుతోంది:చ. పురుషుడు కర్మసంగమున బొందు సుఖంబులు దుఃఖ మెవ్వరెవ్వరికి విరోధముల్ సలుపు వా రిది దైవవశంబు దీనగాతరతవహింప నే గనక దానమఖాధ్యయనాది కర్మముల్వొరసితి నేని బల్కు పొలివోవక నట్లగుగాక యంచనన్.‘మనిషి చేసే పనులను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. ఎవరూ ఎవరికీ విరోధులు కారు. దైవం జరిపించే విధంగా జరిగేవే అన్నీ. నేనే గనుక దానధర్మాధ్యయనాది పుణ్యకర్మలను నిష్ఠగా చేసినవాడనైతే నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది!’ అన్నట్లుగానే రావణుడి మరణం అయోధ్యను పాలించిన శ్రీరాముడి వలన జరిగింది. ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తికి కష్టం కలిగి మాట్లాడే మాట తప్పక జరుగుతుందని దీనివలన అర్థమౌతుంది.– భట్టు వెంకటరావు -
పండుగల పర్వానికి నాంది.. తొలి ఏకాదశి వైభవం!
సమస్త లోకాలను కంటికి రెప్పలా కాపాడే జగత్ప్రభువు, శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేందుకు మన సనాతన సంస్కృతిలో లభించిన అత్యంత దివ్యమైన పర్వదినం తొలి ఏకాదశి. అది ఈ రోజే(జూలై 25).. సంవత్సరంలో వచ్చే సమస్త ఏకాదశి వ్రతాలలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్ర దినం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భగవంతునికి భక్తునికి మధ్య ఉండే అచంచలమైన ప్రేమకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీక. ఈ శుభ సందర్భాన, తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఇది సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ఎందుకు అంతగా నచ్చింది? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..తొలి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి?హిందూ చంద్రమాన కేలండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ‘తొలి ఏకాదశి’ లేదా ‘ప్రథమ ఏకాదశి’ అంటారు. దీనిని ‘శయనీ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉండే ఈ కాలాన్ని చాతుర్మాసంగా భావించి, భక్తులు ప్రత్యేక దీక్షలు, పూజలు ఆచరిస్తారు. తొలి ఏకాదశితోనే పండుగల పరంపర ప్రారంభమవుతుంది. చాతుర్మాస దీక్షలతో మొదలయ్యే ఈ వేడుకలు, వరుస పర్వదినాలతో ఏడాది పొడవునా ఇళ్లలో సందడిని నింపుతాయి.విష్ణువుకు ఎందుకు ప్రీతిపాత్రమైనది? పద్మపురాణంలో తెలిపిన కథనం ప్రకారం పూర్వం మురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను నానావిధాలుగా ఇబ్బంది పెట్టాడు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆ రాక్షసుడి దాటికి తట్టుకోలేక శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. దేవతల రక్షణార్థం విష్ణువు ఆ రాక్షసుడితో సుదీర్ఘకాలం భీకరంగా యుద్ధం చేశాడు.దీంతో అలసిపోయిన మహావిష్ణువు బదరికావనంలోని ‘హేమవతి’ అనే గుహలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి (యోగానిద్రలోకి) ఉపక్రమించారు. అదే సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఆ రాక్షసుడు నిద్రలో ఉన్న విష్ణువును అంతం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ అపాయాన్ని గమనించిన భగవానుని శరీరం నుండి ఒక దివ్యమైన, తేజోవంతమైన శక్తి ఉద్భవించింది. ఆ మహాశక్తి క్షణకాలంలోనే ఆ రాక్షసుడిని భస్మం చేసి అంతం చేసింది. కనులు తెరిచి చూసిన మహావిష్ణువు జరిగిన సంఘటనను గ్రహించి, ఆ దివ్య స్త్రీ శక్తిపై ఎంతో సంతోషించాడు. ఆ రోజు పదకొండవ తిథి (ఏకాదశి) కావడంతో ఆ శక్తికి ‘ఏకాదశి’ అనే నామకరణం చేశాడు. అంతేకాకుండా, ‘ఎవరైతే ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో, వారి సమస్త పాపాలను హరించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను’ అని ఆ దేవతకు వరం ఇచ్చారు. నాటి నుండి ఈ తిథి సాక్షాత్తు శ్రీహరికి అత్యంత ఇష్టమైనదిగా మారింది.గొప్ప ఆధ్యాత్మిక శక్తి..ఏకాదశిని కేవలం ఒక మామూలు ఉపవాస దినంగానే కాకుండా, హిందూ సంస్కృతిలో మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. నెలలో రెండుసార్లు వచ్చే ఈ పర్వదినం వెనుక ఒక పౌరాణిక రహస్యం, గొప్ప ఆధ్యాత్మిక శక్తి దాగి ఉన్నాయి. హిందూ చంద్రమాన కేలండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే పదకొండవ తిథినే ఏకాదశిగా పిలుస్తారు. ఇది శుక్ల పక్షం, కృష్ణ పక్షం రెండింటిలోనూ వస్తుంది. ఈ పవిత్రమైన రోజును సమస్త లోకాలను రక్షించే మహావిష్ణువుకు ఇష్టమైన రోజుగా భావిస్తారు.ఆధునిక కాలంలో..ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అనేది కేవలం ఆహారం మానివేయడం మాత్రమే కాదు, అది మహావిష్ణువుకు తమను తాము పూర్తిగా సమర్పించుకోవడమే. ఇది మనసులోని కోరికలను అదుపులో ఉంచుకోవడానికి, ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. ఈ వ్రతం చేయడం వల్ల గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉదయమే తలస్నానం చేసి, విష్ణువు ప్రతిమను పూలతో అలంకరిస్తారు. విష్ణు సహస్రనామం పఠిస్తూ, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తారు. నేటి ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఏకాదశి ఉపవాసం మన శరీరానికి, మనసుకు ఒక చక్కటి విశ్రాంతిని ఇస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ప్రశాంతతను,క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. -
శ్రీకృష్ణ సృష్టి... సురభి
జనానాం క్షున్నివృత్యర్థం ప్రత్యూషే భజతి ప్రభుఃతథాహి శ్రీహరిసృష్టా కామధేనుః ప్రసూరభూత్లోకాలన్నిటికీసంతృప్తి కల్గటానికి శ్రీహరి తన ఆకలి తీర్చుకుంటాడు. అందుకే కామధేనువు సృష్టి జరిగింది. సర్వజీవకోటికీ ఆహారాన్ని అనుగ్రహించటమే శ్రీహరి సంకల్పం.నిజమాలోచిస్తే, శ్రీహరికి ఆకలి ఏమిటనిపిస్తుంది. గోలోకంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడు తనకు ఆకలి వేసింది అన్నాడు. రాధ ప్రక్కనే ఉంది. ఇదేదో విచిత్రమనుకొన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు తన దేహం ఎడమభాగం నుండి ‘సురభి’ని సృష్టించాడు. ఒక కుండలోకి పాలు పితికాడు. ఆయన కొన్ని ఆరగించి, ఎందుకనో ఆ కుండను నేలకేసి కొట్టాడు. ఆ కుండ తాకిడికి భూమి మీద ఒక పెద్ద కొలను ఏర్పడింది. ఆ కొలను చూడగానే రాధకు పట్టలేనంత సంతోషం కల్గింది. ఆ కొలనులో స్నానం చేస్తూ, ఈతలు కొడుతూ సంతోషంతో, కేరింతలు కొట్టడం ప్రారంభించింది.ఈ సురభి నుండి గోవులనేకం పుట్టు కొచ్చాయి. అవి అన్నీ, భూలోకానికి చేరు కున్నాయి. భూమి మీద ఉన్న ఆవులజాతిఅంతా ఈ సురభి సంతానమే. భూమి మీద మానవులంతా ఈ ఆవులను పోషిస్తూ, వాటి పాలు, పెరుగు, నెయ్యి మొదలగునవి ఆహా రంగా తీసుకొని, సుఖశాంతులతో ఉన్నారు. ఆవును తల్లిగా భావించి, రక్షించి, పూజించటం ప్రారంభించారు. అప్పటినుంచి అది ‘గోమాత’ అని పిలవబడింది.ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే!ఒకప్పుడు భూలోకంలో విపత్కరమైన కరవు వచ్చింది. అందువల్ల గోరక్షణా లేదు, గోపూజా లేదు. పంచ గవ్యములు లేక పోవటం చేత యజ్ఞయాగాదులు ఆగి పోయాయి. అందువల్ల దేవతలకు హవిర్భా గాలు అందటం లేదు. కనుక మానవులతో పాటు దేవతలకు కూడా ఇబ్బంది కల్గింది. ఇలా దేవతలు, మానవులు ఇక్కట్టుల పాలవటం బ్రహ్మ గమనించి దేవతలనువెంటబెట్టుకొని, గోలోకం వెళ్లాడు. అక్కడశ్రీకృష్ణునికి ఈ బాధలన్నీ చెప్పి మొర పెట్టుకున్నాడు. కృష్ణుడు వారి దైన్యాన్ని చూచి మొర ఆలకించి కనికరించాడు. వెంటనే సురభిధేనువు తోక నుండి ‘కామధేనువు’ను సృష్టించి దేవతలకు అనుగ్రహించాడు. దేవతల కోరిక మేరకు ఆ కామధేనువు వేలకొలది ఆవుల్ని భూలోకానికి ప్రసాదించింది.మళ్లీ ప్రజలందరికీ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యథావిధిగా గోపూజ, గోరక్షణ మునుపటి లాగానే కొనసాగుతున్నాయి. జయ గురు దత్త!చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
శంకరుని మాటల మర్మం ఇదీ.. సర్వజ్ఞుల మాటలు
అల్లుణ్ణీ, కూతుర్నీ చూసివద్దామని వెళ్ళినప్పుడు, ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించి, తగిన మర్యాదలు చేయలేదని శంకరుడిపై కోపగించిన దక్షుడు, ప్రతీకారంగా శంకరుడిని అవమానించాలనే ఆలోచనతో ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి శంకరుడిని తప్ప సకల దేవతలనూ, మునిగణాలనూ పిలిచాడు. అది తెలుసుకున్న నారదుడువెంటనే కైలాసానికి వెళ్ళి పార్వతితో, ‘అమ్మా, మీ తండ్రిగారికి ఏమైందో తెలి యడం లేదు. మీ ఇరువురనూ తప్ప మిగతా అందరినీ పిలిచి, అన్ని హంగు లతో యాగం చేస్తున్నాడు. వినడానికే నాకు బాగా అనిపించక, నీ చెవిన వేసి పోదామని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. ఇక వెళ్ళొస్తాను!’ అని చెప్పి, అగ్గి రాజేసి వెళ్ళిపోయాడు. తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని పార్వతికి మనసులో కోరిక కలిగింది. అయితే, పిలవని పేరంటానికి వెళ్ళడం ఎలాగ? కలత చెందిన మనస్సుతో, చెప్పాలా వద్దా అని సందేహిస్తూనే, విషయం శంకరుడి చెవిలో వేసింది. సతి మాటలలోని ఉద్దేశాన్ని గ్రహించిన శంకరుడు ఇలా సమాధానం చెప్పాడన్నాడు పోతన, తాను రచించిన ‘వీరభద్ర విజయం’ కావ్యం ప్రథమాశ్వాసంలో:మెచ్చని మామలిండ్లకును మేకొని శోభనవేళ బిల్వమిన్పొచ్చముగల్గుబో దగుట పోలదు నల్లుర కెజ్జగంబులంబొచ్చెము లేదు కన్యలకు బుట్టినయిండ్లకు బోవ లోకము న్మెచ్చును బొమ్ము పబ్బముకు మీతలిదండ్రుల జూడ బైదలీ!‘ తనను ఇష్టపడని మామల ఇండ్లలో జరిగే శుభ కార్యాలకు, ఆహ్వానం లేకుండా వెళ్ళడం ఏ లోకంలోని అల్లుళ్ళకైనా మర్యాద కాదు. అయితే, ఆహ్వానం లేనప్పటికీ కన్యలకు తమ పుట్టినిండ్లకు వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. లోకం మెచ్చుకుంటుంది కూడా! అందు వలన, మీ తల్లిదండ్రులను చూడటానికి నీవు వెళ్ళు!’ అలా పార్వతి పుట్టినింటికి వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. పుట్టినింట్లో జరిగిన అవమానాన్ని భరించలేక, శివుడిని మనసులో తలుచుకుని శివయోగవహ్నిని మేలుకొలిపి, ఆ ఘోరాగ్నిలో తనను తాను భస్మం చేసుకుంది. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. కనుకనే, జరగబోయేది తెలిసిన శంకరుడు పార్వతిని ‘పోయిరమ్మని’ అనకుండా, కేవలం ‘పొమ్ము పబ్బమునకు’ అని మాత్రమే అన్నాడు. సర్వజ్ఞుల మాటలు భవిష్యత్తుకు దర్పణములుగా భాసిల్లుతాయి.– భట్టు వెంకటరావు -
΄పౌరాణికంలో...
హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ (2018) ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మరో సినిమా ΄పౌరాణికం నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్ మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ మూవీ తాజా అప్డేట్స్ గురించి సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్‌గారు మా బ్యానర్లో తొలిసారి ΄పౌరాణికం నేపథ్యంలో తీయనున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం.నందమూరి తారక రామారావుగారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన నాకు ఎన్టీఆర్‌ని దేవుడిగా చూపించబోతున్నామనే ఆనందం ఉంది. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన ‘రామాయణ’(రణ్‌బీర్ కపూర్) చిత్రం గ్లింమ్స్ వచ్చాక దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది. దీంతో మేం చేయబోయే చిత్రం గురించి ‘రామాయణ’ కి మించి మాట్లాడుకోవాలనే ఆలోచనతో కాస్త సమయం తీసుకుని ప్రకటిద్దామని ఆగాం. ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్‌గార్ల చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. -
అశ్వినీ దేవతలు ఎవరు?
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఉంటాయని పురాణ వర్ణితం.వీరు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు. వీరిసోదరి ఉష. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది. ఆ రథాన్ని అధ్వరాశ్వాలనే మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరం గా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! ఈ క్షణమే సచ్చిదానందంనీవు ‘ఈ క్షణం’లో ఉన్నప్పుడు కాలం, ప్రదేశం అనేవే ఉండవు. అవి లేనప్పుడు దుఃఖం కూడా ఉండదు. ఈ క్షణంలో ఉన్నపుడు నీవే దైవం. అదే అత్మసాక్షాత్కార స్థితి. సచ్చిదానంద స్థితిలో ఉంటావు. నీవే దైవమైనప్పుడు నీ గురించి ఎవరేమి అనుకున్నా నీకు చెందదు కదా! అసలు వ్యక్తి అనేదే మనస్సు కల్పితం. ఈ క్షణంలో మనస్సు–శరీరం అనేవే ఉండవు. శరీరం–మనస్సు అనేవి కాలం–ప్రదేశము అనేవాటితో కలిసే ఉంటాయి. శరీరం ప్రదేశానికి సంబంధించినదైతే, మనస్సు కాలానికి సంబంధించినది. నీవు ఈ దేశకాలాలకు అతీతమైన స్థితిలో ఉండాలి ఎల్లప్పుడూ. అంటే అతి సూక్ష్మమైన ‘ఈ క్షణం’లో ఉండాలి. అంటే ఆత్మతో ఉండాలి. ఆ స్థితిలో నీవు అనంతుడివి. పుట్టుకలేదు, చావుకూడా లేదు. కేవలం ఒక శుద్ధ చైతన్యానివి. వ్యక్తివి కావు.ఈ స్థితిలో నీవు విశ్వచైతన్యంతో నేరుగా అనుసంధానమై ఉంటావు. పరమానందంలో ఉంటావు. ఈ క్షణంలో నీవు ఆత్మవు. ఈ క్షణం నుండి మళ్ళితే శరీరమే నేను, మనస్సు నేను అనే భ్రమలో ఉంటావు. అదే దుఃఖానికి మూలం. అందుకే దైవం ఆనందస్వరూపం అంటారు. నిర్గుణం, నిరాకారం, నశ్వరం, సర్వవ్యాపితం, ఆద్యంత రహితం అంటారే, దానికి కారణం ఇదే. మరి నీవు దైవం కావాలంటే ఈ క్షణంలో కదా ఉండాలి! ఆత్మస్థితిలో కదా ఉండాలి! నశించి΄ోయే భౌతిక ప్రపంచంలో దైవాన్ని వెదికితే దానికి అతీతమైన దైవత్వాన్ని ఎలా పొందగలవు? మనస్సుకు అతీతంగా ఎదుగు. దైవత్వాన్ని చేరకుండా అడ్డుపడుతున్నది ఈ మనస్సే. నీ శక్తులన్నింటినీ నీ మూలం వైపుకు మళ్ళించు.-స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘దేవుళ్లు’
ఒకప్పుడు మన పురాణాలు, ఇతీహాసాలపై టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.అయితే రాను రాను వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్ జానర్ సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో ఒకటి రెండు మైథాలజీ జానర్ సినిమాలు వచ్చినా..అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా.. మళ్లీ మన ప్రేక్షకులు ‘దేవుళ్ల’ కథలను ఆదరిస్తున్నారు. సోషియో పాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘కల్కి 2898 ఏడీ’ సినిమానే. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నింటిని వెండితెరపై చూపిస్తూ..ఓ కొత్త కథను చెప్పాడు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.అంతకు ముందు వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని కూడా ‘దేవుడే’ హిట్ చేశాడు. ఆ సినిమాలో కృష్ణుడుకి సంబంధించిన సన్నివేశాలకు నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విజయంలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో మైథాలజీ ఫిల్మ్ ‘హను-మాను’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టింది.‘అరి’తో పాటు మరిన్ని చిత్రాలు..టాలీవుడ్లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దీంతో పలువురు దర్శకనిర్మాతలు ఆ జోనర్ చిత్రాలనే తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆఖండ 2ను లైన్లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘కల్కి’ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అలాగే హను-మాన్‌కి సీక్వెల్‌గా ‘జై హను-మాన్’ రాబోతుంది. 2025లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్ ‘స్వయంభు’ కూడా సోషియో ఫాంటసీ చిత్రాలే.ఇక ఇదే జోనర్లో ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ‘అరి’అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృష్ణుడిది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు జయశంకర్. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో కృష్ణుడికి సంబంధించిన సీన్స్..గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అసలే ఇప్పుడు మైథాలజీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ‘అరి’లో కృష్ణుడి సీన్స్ పేలితే..బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Trivikram : అల్లు అర్జున్ తో అదిరిపోయే మూవీ పిక్స్..|
-
శివుడిని హడలెత్తించిన వృకాసురుడు.. చివరికి తలపై చేయిపెట్టి
పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నిష్కారణంగా అమాయకులను రకరకాలుగా వేధిస్తూ ఆనందించేవాడు. కొన్నాళ్లకు వాడికో దుర్బుద్ధి పుట్టింది. ‘బలహీనులైన మనుషులను, చిన్నా చితకా దేవతలను ఏడిపిస్తే ఏముంది? ఏడిపిస్తే మహాదేవుడని పిలిపించుకుంటున్న శివుణ్ణే ఏడిపించాలి. అప్పుడు కదా నా ఘనత ఏమిటో ముల్లోకాలకూ తెలిసి వస్తుంది’ అనుకున్నాడు. శివుణ్ణి ఏడిపించాలంటే, ముందు అతను తనకు ప్రత్యక్షమవ్వాలి కదా! వృకాసురుడు ఈ ఆలోచనలో ఉండగానే నారద మహర్షి అటువైపుగా వస్తూ కనిపించాడు.వృకాసురుడు ఎదురేగి నారదుడికి నమస్కరించాడు. ‘స్వామీ! పరమశివుడు ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాలి?’ అని అడిగాడు. ‘భగవంతుణ్ణి వశం చేసుకోవాలంటే ఒకటే మార్గం. అందుకు తపస్సు చెయ్యాలి. శుచివై, దీక్షతో తపస్సు చెయ్యి నీకు తప్పక పరమశివుడు కనిపిస్తాడు’ బదులిచ్చాడు నారదుడు. నారదుడి సలహాతో వృకాసురుడు శుచిగా నదీ స్నానం చేశాడు. ఒక చెట్టు కింద కూర్చుని శివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. ఎన్నాళ్లు గడిచినా శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కుమూసుకుని చేసే ఉత్తుత్తి తపస్సుకు శివుడు ప్రత్యక్షం కాడేమో! రాక్షసోచితంగా ఉగ్రతపస్సు చేస్తే ప్రత్యక్షమవుతాడేమోనని తలచి, ఎదుట హోమగుండం వెలిగించి ఉగ్రతపస్సు ప్రారంభించాడు. తన శరీరం నుంచి మాంసఖండాలను కోసి హోమగుండంలో వేయసాగాడు. శరీరంలోని మాంసమంతా కోసి హోమగుండంలో వేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడికి పట్టుదల పెరిగింది. ఏకంగా తన తలను తెగనరుక్కుని హోమగుండంలో వేసేందుకు సిద్ధపడ్డాడు. అంతా కనిపెడుతున్న పరమశివుడు ఇక క్షణమైనా ఆలస్యం చేయలేదు. వెంటనే వృకాసురుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వృకాసురా! నీ సాహసానికి మెచ్చాను. అయ్యో! శరీరంలోని మాంసమంతా కోసేసుకున్నావే! నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయినా ఇప్పుడు వచ్చాను కదా! నీకు ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు. ‘స్వామీ! నువ్వు నాకు దర్శనం ఇవ్వడమే పదివేలు. ఇక నాకు వరాలెందుకు? అయినా, నువ్వు కోరుకొమ్మని అంటున్నావు గనుక కోరుకుంటున్నాను. నా చెయ్యి ఎవరి నెత్తిన పెడితే వారి తల వెయ్యి వక్కలై చచ్చేటట్లు వరం ఇవ్వు చాలు’ అన్నాడు వృకాసురుడు. శివుడు అవాక్కయ్యాడు. ‘వీడు ఉత్త వెర్రివాడిలా ఉన్నాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడిగితే ఇలాంటి వరం కోరుకున్నాడేమిటి?’ అనుకున్నాడు. ‘ఇదేమిటి? ఇలాంటి వరం కోరుకున్నావు? నీకు ఉపయోగపడేది ఏదైనా కోరుకోరాదా?’ అన్నాడు శివుడు. ‘స్వామీ! నువ్వు కోరుకొమ్మంటేనే నేను కోరుకున్నాను. వరం ఇవ్వడం ఇష్టం లేకపోతే, ఆ ముక్క చెప్పి పోరాదా!’ అన్నాడు దెప్పిపొడుపుగా. శివుడికి అహం దెబ్బతింది. ‘నేను వరం ఇవ్వలేకపోవడం ఏమిటి? ఇచ్చాను. పుచ్చుకుని పో! నీ కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’ అని చెప్పి వెళ్లిపోబోయాడు. వృకాసురుడు వెకిలిగా నవ్వుతూ ‘మహాదేవా! ఆగాగు. నీ కర్మకాలే నాకీ వరం ఇచ్చావు. మొట్టమొదట నీ నెత్తి మీద చెయ్యిపెట్టి, వర ప్రభావాన్ని పరీక్షించుకుంటాను’ అంటూ చెయ్యి పైకెత్తి ముందుకొచ్చాడు. శివుడు హడలి పోయాడు. వృకాసురుడి చెయ్యి నెత్తిన పడకుండా చటుక్కున తప్పించుకుని, దిక్కు తోచక పరుగు లంకించుకున్నాడు. వృకాసురుడు కూడా శివుడిని వెంబడిస్తూ పరుగు తీయసాగాడు. ముందు శివుడు, వెనుక వృకాసురుడు– ఒకరి వెనుక ఒకరు పరుగు తీస్తున్న దృశ్యాన్ని ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు తిలకించాడు. దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. వెంటనే వైకుంఠానికి బయలుదేరి వెళ్లి, విష్ణువుకు వృకాసురుడు పరమశివుడిని తరుముతున్న సంగతి చెప్పాడు. పరమశివుడిని ఎలాగైనా రక్షించాలని కోరాడు. శివుడిని కాపాడటం కోసం విష్ణువు తక్షణమే బయలుదేరాడు. బాల బ్రహ్మచారి వేషం ధరించి వృకాసురుడు వస్తున్న దారిలో నిలిచాడు. పరుగుతో ఆయాసపడుతున్న వృకాసురుడు బాల బ్రహ్మచారిని ‘ఏమయ్యా! శివుడు ఇటుగా వెళ్లడం చూశావా?’ అని అడిగాడు. ‘పరుగున వెళుతుంటే చూశాను. ఆ కొండల మాటుగా పరుగు తీస్తూ పోయాడు. అప్పటికీ ఎందుకు పరుగు తీస్తున్నావని నేను అడిగాను కూడా’ అన్నాడు.‘ఏం చెప్పాడేమిటి?’ అడిగాడు వృకాసురుడు. ‘నా భక్తుడు వృకుడు నన్ను తాకుతానంటూ వెంబడిస్తున్నాడు. తాకితే ఇబ్బందేమీ లేదుగాని, ఒళ్లంతా కండలు కోసేసుకుని, దుర్గంధమోడుతున్న శరీరంతో ఉన్నాడు. కనీసం శుచిగా స్నానమైనా చేసి ఉంటే, తాకనివచ్చేవాణ్ణే అని చెప్పాడు’ అన్నాడు బాల బ్రహ్మచారి రూపంలోని విష్ణువు. ‘ఇదీ సమంజసంగానే ఉంది. పరమశివుడు ఎంతైనా దేవుడు. అతణ్ణి తాకేటప్పుడు శుచిగా ఉండటం ధర్మం’ అనుకుని పక్కనే ఉన్న నదిలో స్నానానికి దిగాడు. మెడ లోతు వరకు దిగాక, శిఖ ముడి విప్పుకోవడానికి నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. అంతే! తల వెయ్యి వక్కలై చచ్చాడు. -
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్‌కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్‌తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్‌లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్‌పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్‌లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్‌షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్‌లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్‌లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్‌లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్‌లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్‌ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్‌కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్‌తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్‌ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
ఆ రాయిలో తొమ్మిది తోకల గల నక్క... అందర్నీ చంపేస్తుందట!
ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన నమ్మకాలు ఉంటాయి. కొన్ని సైన్సు పరంగా చూస్తే ఒక రకంగా మంచిగానే ఉంటాయి. మరికొన్ని నమ్మకాలు మాత్రం మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఏం జరుగుతుందో ఏమో అని ఉన్న ధైర్యాన్ని కాస్త నీరు కార్చేస్తుంది. అచ్చం అలాంటి ఘటన ప్రస్తుతం జపాన్‌లో చోటు చేసుకుంది. వారికి ఎంతో సెంట్మెంట్ గల రాయి ఇప్పుడూ వారిని భయాందోళనలకు గురి చేస్తోంది. వివరాల్లోకెళ్తే...జపనీస్ పురాణాలలో, సెస్షో-సెకి అనేది ఒక శిలా రాయి. ఈ రాయిలో తొమ్మిది తోకల గల నక్క ఆత్మ ఉందని నమ్ముతారు జపాన్ వాసులు. అయితే ఆ నక్క టామామో-నో-మే అనే అందమైన స్త్రీ రూపాన్ని ధరించి, టోబా చక్రవర్తిని చంపడానికి పథకం వేసిందని చెబుతుంటారు. కానీ తమమో-నో-మే ఓడిపోయిన తర్వాత ఆమె ఆత్మ రాయి(సెస్షో-సెకిలో)లో చిక్కుకుందని నమ్ముతారు. నాసులోని అగ్నిపర్వత పర్వతాల సమీపంలో ఉన్న ఈ రాయి 1957లో చారిత్రక ప్రదేశంగా నమోదు చేశారు. ప్రసిద్ధ సందర్శనా ప్రదేశానికి వచ్చిన సందర్శకులు రాక్ సగానికి చీలిపోయి ఉండటాన్ని చూసి భయపడ్డారు. అయితే ఈ రాయి చుట్టు ఒక తాడుతో చుట్టబడి అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి ఉండేది. కానీ సందర్శకులు వచ్చి చూసేటప్పటికి తాడు విప్పబడి రాయి రెండుగా చీలుకుపోయి ఉంది. దీని అర్థం ఆ నక్క దుష్టాత్మ పారిపోవడానికి సూచన. దీంతో ఇప్పుడూ ఆ రాయి ఎవర్ని చంపుతుందో ఏంటో అని జపాన్ వాసుల్లే ఒకటే టెన్షన్ మొదలైంది. అయితే స్థానిక అధికారులు ఈ రాయికి పగుళ్లు ఉన్నాయని, అదీగాక చల్లని వాతావరణం కారణంగా విడిపోయి ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు చూడకూడని దాన్ని చూశాం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే) -
శివతత్త్వం: నిత్యం.. సత్యం.. అనంతం
పరమశివుడు అర్ధనారీశ్వరుడు. ఆదిభిక్షువు. భక్త వత్సలుడు. బోళాశంకరుడు. నిర్వికారుడు, నిరాకారుడు, నిరాడంబరుడు. ఇన్ని వేదాంత లక్షణాలున్న ఈశ్వరుడు ఏ శివక్షేత్రంలో చూసినా లింగాకారంలోనే కనపడతాడు కాని శరీరాకృతిలో దర్శనమివ్వడు. అదెలాగంటే ఒక వృత్తం తన ఆకారంలో చాలా గొప్పది. అది అనంతమైన మోతాదులో పెరుగుతూ వెళ్లినా దాని కేంద్రం ఒక్కటే. పరిపూర్ణ తత్త్వమనేది ఒక గోళానికి చెందింది. పరిపూర్ణమైన దానిలోని భాగాలన్నీ పరిపూర్ణాలే అని తెలుసుకోగలగడమే ఆధ్యాత్మిక సాధన! అందుకే పౌరాణికవేత్తలు సృష్టి యావత్తూ శివలింగమేనంటారు. అన్ని స్పందనలూ, చేతనలూ ఈశ్వరుడిలోనే, ఈశ్వరుడి వల్లనే అంటారు! అందుకే అటు అనంతం ఇటు అనంతం, òపైన అనంతం, కింద అనంతం చుట్టూ తిరిగి చూస్తే సర్వం లింగాకారమే... అదే శివతత్త్వం. మహేశ్వరుని వంటి నిరాడంబరుడు మనకెక్కడా దర్శనమివ్వడు. గజచర్మం కట్టుకుంటాడు. చేతిలో కపాలం పట్టుకుని బిచ్చమెత్తుకుంటాడు. కాష్టాలవాడలో కాపురముంటాడు. విషపు నాగులను మెడనిండా మాలలుగా ధరిస్తాడు. రుద్రాక్షపూసల్ని వంటినిండా అలంకరించుకుంటాడు. ఆయన సిగలో చంద్రుడున్నాడని గొప్పలు పోదామంటే అదీ కుదరదు. ఆ శిరస్సున ఉండే చంద్రుడు వెన్నెల సోనలు కురిపించే నిండు చందురుడేమీ కాదు. సన్నని చంద్రరేఖ. పోనీ, సరైన వాహనమైనా ఉందా అంటే లేదు. ముసలి ఎద్దునెక్కి ఊరేగుతాడు. ఆయనని సేవించే పరిజనం ఏమైనా పెద్దవాళ్లా అంటే ప్రమద గణాలు, భూతగణాలే. అయితేనేం, వారితోనే ఆయన జగత్ ప్రసిద్ధుడయ్యాడు. మహా విరాగి ఎంత పేదవారయినా సరే, పెళ్లికి పట్టుబట్టలు కట్టుకుంటారు, వంటికి చందనాలు అద్దుకుంటారు. సుగంధ పరిమళాలతో కూడిన పూదండలను అలంకరించుకుంటారు. వేగంగా సంచరించే పక్షినో, జంతువునో వాహనంగా చేసుకుంటారు. పెళ్లికి అందరూ రాగలిగేందుకు అనువైన ముహూర్తాన్ని చూసి పగలు లేదా సాయంత్రం పెళ్లి పెట్టుకుంటారు. కానీ, పరమ విరాగి అయిన శివుడేమో పెళ్లికి కూడా గజచర్మమే కట్టుకు తిరుగుతాడు. ముసలి ఎద్దునెక్కి వూరేగుతాడు. ఏ వాసనా లేని తుమ్మిపూలు చాలంటాడు. బూడిద పూసుకు తిరుగుతాడు. ఒక విందూ లేదూ, వినోదమూ లేదు. తన భక్తులు తనకు నవకాయ పిండివంటలు వండి నివేదించనక్కరలేదు. కటిక ఉపవాసముంటే చాలంటాడు. తనకోసం ఒక పూట మేలుకుని ఉంటే మంచిదంటాడు. ప్రతి చర్యలోనూ అంతులేనంతటి అంతరార్థం శివుణ్ణి దిగంబరుడంటారు. దిగంబరుడంటే దిక్కులే వస్త్రాలుగా కలిగినవాడని అర్థం. అందుకే ఆయన సర్వాంతర్యామి అయ్యాడు. లోకంలో ప్రతివారు కీడును పోగొట్టుకోవడానికి, సంపదలు పొందడానికి మంగళకర ద్రవ్యాలైన సుగంధ చందనాదులను ధరిస్తారు. ఇవి మళ్లీ కోరికలు పుట్టిస్తాయి. కోరికలు లేనివాడయిన శివునికి వీటితో పనిలేదు. అందుకే అన్నింటికీ దూరంగా ఉంటాడు. భాగ్యవంతుడు కాకున్నా కోరిన వారికి సకల సంపదలను ప్రసాదిస్తాడు. సంచరించేది శ్మశానంలోనే అయినా, లోకాన్నిటినీ శాసించగలడు. తనకే సంపదలూ లేకపోతేనేం, ఆయన అనుగ్రహమే గొప్ప సంపద. అంటే మనకు ఏమీ లేకపోయినా, అవతలి వారికి ఇవ్వాలన్న మనసు ఉంటే చాలనీ, పైపై ఆడంబరాలు లేకున్నా, గొప్ప కార్యాలు సాధించడానికి అదేమీ అడ్డం కాదన్నది ఆయన రూపంలోని, చర్యలలోని అంతరార్థంగా భావించాలి. అర్ధనారీశ్వరత్వం శివుడెలా ఉంటాడో, ఆయన భార్య పార్వతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆయన గజచర్మమే చుట్టుకున్నా, ఆవిడ మాత్రం పట్టుబట్టలు కట్టుకుంటుంది. ఒంటినిండా నగలు ధరిస్తుంది. çశరీరానికి చందనం అద్దుకుంటుంది. సింహాన్ని వాహనంగా చేసుకుని నవరత్న ఖచిత సింహాసనంపై ఆసీనురాలవుతుంది. తనకు లేవు కదా అని ఆయన తన దేవేరి అయిన పార్వతిని పట్టుబట్టలు కట్టుకోవద్దనలేదు. ఆభరణాలు ధరించవద్దని కానీ, అలంకారాలు చేసుకోవద్దని కానీ శాసించలేదు. ఆమెను ఆమెగా ప్రేమించాడు. తన శరీరంలో సగభాగాన్ని ఆమెకు ఇచ్చేశాడు. శివతత్త్వాన్ని అలవాటు చేసుకోవడమంటే నిరాడంబర జీవితాన్ని ఎంచుకోవడమేనని వేదాంతులు, పండితులు చెబుతారు. ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నవాడా? కాదు. సమస్త విశ్వమూ శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాదు. ఎందుకంటే సృష్టి అంతా శివుడే. ఆయన విశ్వరూపుడు. అదే సమయంలో ఆయన రూపం లేనివాడు, నిరాకారుడు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు బోళాశంకరుడు. సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతీ ఆయనే. అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా ఆయనదే. ఆనంద తాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగు నూ, అమాయకత్వాన్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్నీ.. అన్నింటినీ కలగలిపి ఒక్కటిగా పంచేదే శివతత్త్వం. ఇది ఒక లీల. విశ్వచైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యమూ, నాట్యకారుడూ విడివిడి గా ఉండలేరో.. అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజ స్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతాలు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనంద నర్తనమే ఈ విశ్వం. ఆ సత్యమే శివతత్త్వం. అది తెలుసుకుని ఆ ఆనందాన్ని అనుభవించగలిగే పర్వదినమే మహా శివరాత్రి. భక్తులు ఉపవాస జాగరణలు చేసేది ఆ అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించేందుకే! మృత్యుంజయం అత్యంత పవిత్రమైన మంత్రాలలో శివుని మృత్యుంజయ మంత్రం ఒకటి. మృత్యుంజయ అంటే చావుపై గెలుపు. ఆత్మకు చావు లేదు. అది ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది. మృత్యుంజయత్వం అంటే ఈ అశాశ్వతమైన జీవనంపై గెలిచి, మనసు శాశ్వతత్వానికి చేరుకోవడం. నేను శాశ్వతం, ఎన్నటికీ మార్పు చెందనిదేదో అది నాలో ఉన్నదని మనసు గ్రహిస్తుంది. అప్పుడు భయం ఉండదు. భయం అనేది మృత్యువుకు గల సంకేతాలలో ఒకటి. భయాన్ని జయించినపుడు ఈ అశాశ్వతమైన విషయాలను గుర్తుంచుకోవడం మానేసి, ఎన్నటికీ నాశనం కాని దానికోసం కదులుతాం. మనం ఈ రెండింటి కలయికగా ఉన్నాం. ఆత్మ... నాశనం లేనిది. శరీరం నశించిపోయేది. చాలాసార్లు మన మనసు శరీరానికి అంటిపెట్టుకుని తాను చనిపోతున్నానని భావిస్తూ ఉంటుంది. మనసును ఈ పరిమితమైన గుర్తింపు నుంచి అపరిమితమైన విశ్వవ్యాప్తమైన గుర్తింపు దిశగా మృత్యుంజయ మంత్రం తీసుకెళ్తుంది. ఈ మంత్రంలో ఒక ప్రార్థన ఉంది. ఆకాశమే కేశాలుగా గల అమిత బలవంతుడైన శివుడు మనల్ని బలవంతునిగా చేయుగాక. ఏ బంధాలూ లేని ఆ పరమ శివుడు మనల్ని అన్ని బంధాల నుంచి విముక్తుణ్ని చేయుగాక అని అంతరార్థం. మారేడుతో ఎందుకు పూజిస్తారు? మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ‘శివేష్ట’ అని అంటారు. మారేడు ను బిల్వం అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలాలను ఇచ్చేదనీ, సిరిని తెచ్చే ఫలం కలది అని అర్థం. మారేడు మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. బిల్వపత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు గాలి శరీరానికి సోకినా, ఈ గాలిని పీల్చినా జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలను శుద్ధి చేసి, శరీరాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్ఛతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరిÜ్తుంది. మారేడు వల్ల తన భక్తులకు ఇన్ని ప్రయోజనాలున్నాయి కనుకనే మారేడంటే శివుడికి మహా ఇష్టం కా కాబోలు. -
పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా?
బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని వివాహాన్ని ఎనిమిది విధాలుగా శాస్త్రాలు సూచిస్తున్నాయని గతవారంలోనే చెప్పుకున్నాం కదా... ఇప్పుడు ఆయా వివాహాల గురించి క్లుప్తంగా... ► బ్రాహ్మం: బ్రాహ్మమనగా ధర్మబద్ధమైనది. ఈ పద్ధతి, ఎనిమిది రకాల వివాహాలలో శ్రేష్ఠమైనదని శాస్త్రకారుల నిర్ణయం. ఈ పద్ధతిలో, వధువు తండ్రి, యోగ్యుడు, గుణవంతుడు మరియు విద్యావంతుడైన వరుణ్ణి వెతికి, అతడినుండి ఎటువంటి కన్యాశుల్కం తీసుకోకుండా, తన కూతుర్నిచ్చి అనగా ‘కన్యాదానం‘ చేసి వేదమంత్రాలతో విధిపూర్వకంగా, దేవతలసాక్షిగా, బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిపిస్తాడు. ► దైవం: ఈ పద్ధతిలో, తనకు యాగం నిర్వహించిన ఋత్విక్కుకు, వధువు తండ్రి, యాగ దక్షిణలో భాగంగా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. దీనిని కొందరు స్మతికారులు విమర్శించారు, మరికొందరు సమర్థించారు. ఈ విధానంలో వర్ణంతో నిమిత్తంలేకుండా వివాహాలు జరిగేవి. అంటే ఋత్విక్కులు యాగదక్షిణగా రాజులనుండి కూడా కన్యలను గ్రహించేవారు. ఈ విధానంలో జరిగే వివాహంలో పెండ్లికుమార్తెను ‘వధువు‘ అనేవారు. ప్రస్తుతం ఈ పద్ధతి పాటించుటలేదు. ► ఆర్షం: ఈ విధానంలో, కన్య తండ్రి, వరుడినుండి యజ‘ నిమిత్తమై రెండు గోవులను తీసుకుని తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈ గోవులను కట్నంగా భావించరాదు. ఇది కేవలం యాగధర్మంకోసమే. కానీ దీనినికూడా కొందరు స్మతికర్తలు విమర్శించారు. యాగార్థం తీసుకున్నా అది కట్నమే అని దీనిని తిరస్కరించారు. ► ప్రాజాపత్యం: ఈ పద్ధతిలో, కన్య తండ్రి గుణవంతుడైన ఒక వరుణ్ణి నిర్ణయించి, తన కుమార్తెను వివాహమాడవలసిందిగా అతణ్ణి ప్రార్థించి, అంగీకరించిన తర్వాత, తన కుమార్తెనిచ్చి వివాహంచేస్తాడు. ఈ వివాహం ఏకపత్నీవ్రతులకు మాత్రమే విహితం. ఎందుకంటే, ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే, మరో స్త్రీని వివాహం చేసుకోకూడదు. గృహస్థుగానే జీవించాలి. ► ఆసురం: ఈ పద్ధతిలో, తాను ఇష్టపడిన కన్యని వివాహమాడడానికిగాను, ఆ కన్య తండ్రికి కొంత ధనమిచ్చి ఆ తర్వాత ఆమెను వివాహమాడతాడు. ఇది అధమమైనదని దీనిని శాస్త్రకారులు తిరస్కరించారు. అలా ధనమిచ్చి కొనుక్కున్న కన్య దాసియే అవుతుందికానీ ధర్మపత్ని కాజాలదు. కనుక ధర్మకార్యాలలో తనకు ప్రవేశం నిషిద్ధం. ► గాంధర్వం: స్త్రీపురుషులిద్దరూ ప్రేమించుకున్నప్పుడు, లేదా మోహవశులై ఒకరిని విడిచి ఒకరు వుండలేని పరిస్థితులలో, ఎవ్వరి అనుమతులూ తీసుకోకుండా స్వతంత్రించి చేసుకునే వివాహమే గాంధర్వం. ► రాక్షసం: కన్యను బలవంతంగా అంటే, ఆ కన్యకు ఆ వరునిపై ఇష్టంలేకపొయినా, అవసరమైతే ఆ కన్య తండ్రినికానీ, బంధువులనుకానీ చంపి అయినాసరే వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. ► పైశాచం: కన్యను మోసగించి, లేక నిద్రించుచుండాగా, లేక స్పహలో లేకుండగా, తీసుకెళ్ళి లేక బలవంతంగా తీసుకెళ్ళి వివాహమాడడాన్ని పైశాచం అంటారు. ఇది భరతఖండంలో పశ్చిమోత్తరప్రాంతంలో (అనగా ప్రస్తుత పాకిస్తాన్) కొందరు పిశాచజాతులు వుండేవని, వారిలో ఈ ఆచారం వుండేదని అందుకే దీనికి పైశాచమని పేరువచ్చిందని చరిత్రకారుల నిర్ణయం. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
సూర్యుడు- ఆయన భార్యలు
త్వష్టప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి. ఈమెకే ఉష అని కూడా పేరు. ఈమె సూర్యభగవానుడి భార్య. సూర్యుడి చురుకుదనాన్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకుంది ఉష. కానీ పెళ్లి అయి కొంతకాలం గడిచాక భర్త నుంచి వెలువడే వెలుగు, వేడిని భరించలేకపోయింది. ఆయన తీక్షణత తగ్గించమని ఒకటి రెండుసార్లు అడిగి చూసింది. అది తన సహజ లక్షణ మనీ, తన తీక్షణతను తగ్గించుకోవడం కుదరదని చెప్పాడు సూర్యుడు. కొంతకాలం ఎలాగో భరించింది. వైవస్వతుడు, యముడు, యమి అనే సంతానం కలిగారు. ఆ తర్వాత ఆమెలో మరల మునుపటి మార్పు వచ్చింది. తన కోసం వెలుగునూ, వేడినీ తగ్గించుకోమని భర్తను అడిగిందామె. ఎప్పటిలాగే తనని సహిస్తూ, సహధర్మచారిణిగా సహజీవనం చేయాలని నచ్చచెప్పాడు సూర్యుడు. సరేనని తలాడించిందామె. అయితే, తనకు ప్రస్తుతం అమ్మానాన్నల మీద మనసు మళ్లిందనీ, కొంతకాలం అక్కడ గడిపి వస్తానని చెప్పి పుట్టింటికి పయనం కట్టిందామె. భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకూ ఆయనకూ మనస్పర్థలంటూ ఏమీ లేవు పైగా తానంటే సూర్యుడికి ఎనలేని ప్రేమ అని తెలుసామెకు. అందుకే కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలి కానీ, భర్త తనకు దూరంగా ఉండకూడదనుకుంది. దాంతో ఒక ఆలోచన వచ్చిందామెకు. ముమ్మూర్తులా తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అని పేరు పెట్టి, తనలాగే ప్రవర్తిస్తూ, తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది. అంతకాలం నీడగా ఆమెను అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది. సంజ్ఞాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్లింది. అక్కడొక అడవిలో అశ్వరూపంతో ఉండి యథేచ్ఛగా సంచరించసాగింది. అలా కొంతకాలం గడిచింది. తర్వాత నారద మహర్షి ప్రబోధ ప్రోద్బలాలతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకుంది. ఫలితంగా ఆమెకి శనైశ్చరుడు, సావర్ణి మనువు, తపతి పుట్టారు. మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది. దాంతో సొంత బిడ్డలకి ఎనలేని మమతానురాగాలు పంచుతూ సంజ్ఞా సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపసాగింది. వైవస్వతుడు, యముడు, యమున లకు తాము తమ తల్లికే సవతి బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను, చెల్లిని వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వెళ్లాడు. మునుపటిలా తమను ప్రేమగా చూడడటం లేదేమని అడిగాడు. ఛాయ కోపంతో ఈసడించుకుని యముణ్ణి తీవ్రంగా మందలించింది. యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ, యముణ్ణి భయంకరంగా శపించింది. చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు. కన్నతల్లి ఏమిటి, కన్నబిడ్డలను శపించడమేమిటనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సంజ్ఞను కాదనీ, ఆమె ప్రతిరూపమైన ఛాయననీ, సంజ్ఞాదేవి అజ్ఞలాంటి అభ్యర్థన వల్లే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయాననే విషయాన్ని వివరించింది ఛాయ. చిత్రంగా సూర్యభగవానుడికి ఇద్దరి మీదా కోపం రాలేదు. తన కాంతిని భరించలేకనే కదా, సంజ్ఞ తనను వీడి వెళ్లిపోయింది... వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్లింది... అనుకున్నాడు. సంజ్ఞపైన అమితమైన ప్రేమానురాగాలు జనించాయి. ఆమెను వెదుక్కుంటూ వెళ్లాడు. అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికి కుతూహలంగా చూశాడు. ఆ హయమే తన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగ గుర్రం రూపం ధరించాడు. భర్తను గుర్తించిన సంజ్ఞ ఆనందంగా ఆయనను చేరుకుంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలూ, మరొక కుమారుడూ కలిగారు. ఆ కవలలే అశ్వినీ దేవతలుగా... దేవవైద్యులుగా దేవలోకానికి చేరారు. వారి సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు. తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంజ్ఞకు పతిదేవుడిపై ప్రేమ పుట్టింది. సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్లింది. ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్లి, తన తేజస్సును తగ్గించమని కోరాడు. విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్నీ, శక్తి అనే ఆయుధాన్నీ తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శనాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడికి, శక్తిని పార్వతికీ ఇచ్చాడు. పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాబు తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది. తనకోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంజ్ఞ. ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది. భర్త ఉగ్రత తగ్గడం, దానికితోడు ఆయన తనకు తానుగా తన శరీరానికి శీతలత్వాన్ని అలదుకోవడంతో సంజ్ఞకు మరెన్నడూ ఇబ్బంది కలగలేదు. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయాసంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. ఈ కథలో మనం నేర్చుకోవలసిన నీతి చాలా ఉంది. అదేమిటంటే... కాపురమన్నాక కలతలు, కలహాలు, పొరపచ్ఛాలు సహజం. అయితే, వాటిని పరిష్కరించుకోవడంలోనే మన విజ్ఞత, సమయస్ఫూర్తి బయట పడతాయి. ప్రణయ కలహాలు లేని కాపురం ఉప్పులేని పప్పు వంటిదని పెద్దలు అందుకే అంటారు కాబోలు. –డి.వి.ఆర్. భాస్కర్ -
జ్ఞాన సంపదను పురాణాలకు అంటగట్టవద్దు
నల్లగొండ కల్చరల్: భారతీయ జ్ఞాన సంపదను బ్రాహ్మణ్య కేంద్రంగా పురాణాలకు అంటగట్టే ప్రయత్నాన్ని సహించమని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శి పాణి అన్నారు దీనిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన విరసం 21వ సాహిత్య పాఠశాల కార్యక్రమంలో ‘దేశీసాహిత్య సామాజిక చరిత్ర – మార్క్సిజం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దేశీయ సాహిత్యం, సామాజిక చరిత్రను మార్క్సిస్టు భావాలతో అర్థం చేసుకోవాలన్నారు. కాగా, మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ‘భీమా కోరేగావ్ – బ్రాహ్మణీయ వ్యతిరేక పోరాట ప్రతీక’అనే అంశంపై విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి ప్రసంగిస్తూ భీమా కోరేగావ్ చరిత్రను వివరించారు. బ్రాహ్మణీయ కేంద్రంగా చరిత్రను రాసుకోవడం సంఘ్ పరివార్‌కు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. చరిత్రను ఆధిపత్య వర్గాలు తమకు అనుగుణంగా రాసుకున్నాయని, దాన్ని తిరస్కరిస్తూ అట్టడుగు వర్గాలు ఉద్యమాలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంగానే భీమా కోరేగావ్ పోరాటాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భీమా కోరేగావ్ పోరాటాన్ని బడుగు వర్గాలు స్ఫూర్తిగా తీసుకోవడం ఇవాల్టి పాలకవర్గాలకు కంటగింపుగా మారిందన్నారు. దళితులు విజయోత్సవాలు చేసుకోవడం జీర్ణించుకోలేని సంఘ్ పరివార్ శక్తులు దాడులకు పాల్పడడంతో పాటు ఇద్దరు దళితుల హత్యకు కారణమయ్యాయని పేర్కొ న్నారు. కలెక్టివ్ వాయిస్ కన్వీనర్, కవి యాకూబ్ మాట్లాడుతూ దేశంలో హిందూ ఫాసిజం పెచ్చరిల్లుతుందని, గౌరీ లంకేశ్ లాంటి ప్రజా మేధావులను హత్య చేసిన హిందూ మతోన్మాద శక్తులను ప్రశ్నిస్తే.. అర్బన్ మావోయిస్టుల పేరుతో జైళ్లలో నిర్బంధిస్తున్నారన్నారు. -
హనుమంతుని తోక
ఈ మధ్య ‘హిందు త్వం’కు పట్టినంత దుర్గతి మరి దేనికీ పట్టలేదు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ దగ్గర్నుంచి, నవలా రచయిత్రి అరుం ధతీ రాయ్ దగ్గర్నుంచి, నేలబారు రాజకీయ నాయ కులు, కొందరు పాత్రి కేయుల దాకా అంతా ‘హిందుత్వా’న్ని వాడటం పేషన్. ఆ మధ్య దేవుడికి కనకాంబరం పువ్వులు ఎవరో అలంకరించారు. ఒకాయన అడిగాడు: ‘ఏం బాబూ.. మీరు హిందుత్వ ప్రచారకులా?’ అని. ఒక్క విషయం చెప్పుకోవాలి– మతానికీ, హిందు త్వానికీ ఎట్టి సంబంధమూ లేదు. అయితే ఎన్నిక లకు ‘హిందుత్వ’ ఓటరుని లొంగదీసుకోవడమే ఒడుపు. ఆ పని మన రాహుల్ గాంధీ గారికి తెలిసినట్టు, చేస్తున్నట్టు మోడీగారికి తెలియదని నా ఉద్దేశం. ఈసారి ఎన్నికలు హిందుత్వానికి మతాతీతమైన సిద్ధాంతాలకీ పోటీ. ఒకరు హిందుత్వానికి ప్రతినిధి. మరొకాయన ఇటలీ తల్లి సుపుత్రుడు. కానీ ఓటరుకి ఆయనా తాము ‘హిందుత్వా’నికి వ్యతిరేకి కాదని ఎలా నిరూపించాలి? (ఎందుకూ!) రాహుల్ గాంధీని కొట్టిపారేయడానికి వీలులేదు. వారు ఈ మధ్యనే హిందువులంతా కలలు గనే కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్లారు. (వాటికన్‌కి ఎందుకు వెళ్లి రాలేదు?) కర్ణాటక విమాన ప్రమాదం తప్పాక దేవునికి కృతజ్ఞతా సూచకంగా హిమాలయాలను ఎక్కారు. గుజరాత్లో ఎన్నో దేవాలయాలకు వెళ్లి, నెత్తినిండా విబూతి రాసుకుని దేవుళ్లకి మొక్కారు. మధ్య మధ్య భగవద్గీత పురాణాల గురించి తమ ప్రసంగాలలో గుప్పిస్తున్నారు. ఇప్పుడు వారికి తమమీద ‘హిందుత్వం’ఎంతో కొంత ఆవహించిం దని నమ్మకం కుదిరింది. మొన్న ఒకానొక సభలో మోదీ గారిని ఉద్దేశించి ‘ఆయన ఏం హిందూ’ అని ఎద్దేవా చేశారు. మోదీగారు వెనుకంజ వేసి ‘నిజమే నాకు హిందుత్వం గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. అయితే మహామహులైన మత గురువులకే హిందుత్వమంటే ఏమిటో ఈ దేశంలో అవగాహన కాలేదు. నేను కేవలం ‘కార్యకర్త’ని, రాహుల్ గాంధీ గారు కుటుంబ ‘వ్యవహర్త’ అన్నారు. తెలుగులో ఈ మాటకి ‘రుచి’ రాలేదు. నేను ‘కామ్దార్’ని ఆయన ‘నామ్‌దార్’ అన్నారు.అయ్యా మోదీగారూ! తరతరాల జాతి విశ్వా సాలకు కొత్త అర్థాలను వెతుకుతూ, మన పురాణా లకూ, దేవుళ్లకూ, పురాణ ఇతిహాసాలకూ కొత్త అన్వయాలను చెప్పగల మహానుభావులు తమ పార్టీలోనే ఉన్నారు. నమూనాకు రెండు నామధే యాలు. ఉత్తర ప్రదేశ్‌లో బైరిక్ పార్లమెంట్ సభ్యు రాలు సావిత్రిబాయి పూలే ఒకరు. మరొకరు ఈ జాతికి విజ్ఞానాన్ని పంచే రచయిత.లక్నోలో ఒకానొక సభలో లక్ష్మణ్ గైక్వాడ్ అనే మరాఠీ రచయిత ఒక భాషణ చేశారు. గైక్వాడ్ అన్నారు: ‘‘రామాయణంలో హనుమంతుడు దళి తుడు. ఆయనకి ఒక తోకపెట్టి, వ్యక్తిని నల్లగా తయారుచేసి దళితుల్ని వెనుకబడినవారిగా ఉంచా లని ఈ పురాణ కవుల కుట్ర.హనుమంతుడు తన ప్రభువైన రాముడికి తన భక్తిని, విశ్వాసాన్ని చూపడానికి రొమ్ము చీల్చి చూపవలసి వచ్చింది. ఇది దళితుల ‘పీడన’కి నిదర్శనం. ప్రతీసారి ఈ విధంగా తమ ఉనికి ‘దళితులు’ నిరూపించుకోవలసి వచ్చింది. దళితులని నిజంగా హిందువులు గౌరవిస్తున్నా రని నిరూపించదలచుకుంటే ఓ దళితుడిని– ఓ చర్మ కారుడిని– ‘శంకరాచార్య’ని చేయండి. లేదా బాలాజీ గుడిలో అర్చకుడిని చేయండి. చేయలేక పోతే ముందు దేవాలయాలను జాతీయం చెయ్యండి. ప్రపంచం ఒక పక్క అంతరిక్షంలోకి పోతుంటే సంస్కృతి, మతం పేరిట భారతదేశం వెనక్కి పోతోంది.ఈ హిందువులే దళితులను ‘వానర సేన’ అన్నారు. మేం ఎల్లకాలం ఈ వానర సేనగానే ఉండాలా? ఎప్పటికయినా ‘పాలకులం’ కావద్దా? రామాయణం కూడా ఈ మత విచక్షణనే ప్రచారం చేసింది. రాముడు– ఒక బ్రాహ్మణుడు నింద వేశా డని శూద్రుడయిన ‘శంభుకుడు’ని చంపాడు. హను మంతుడిని భక్తుడనకండి. రాముడిని దేవుడనకండి. అందరూ సమానంగా ఉండాలి’’.అయితే గైక్వాడ్ గారికి నాదొక విన్నపం. దళితుల్ని చిన్నచూపు చూసే మత పీఠాధిపతి ‘శంక రాచార్య’ పదవి మళ్లీ దళితునికి ఎందుకు? మతాన్ని దుర్వినియోగం చేసిన ఈ దిక్కుమాలిన దేవుళ్ల ఆల యాలలో మళ్లీ దళితులకి అర్చకత్వం ఎందుకు? ఈ రామాయణాన్ని రచించిన కవి కూడా ఒక దళితుడే నని వారు మరిచిపోయారా? గైక్వాడ్‌గారూ! హిందుత్వం అంటే గుడులూ, గోపురాలూ, దేవుళ్లూ కాదు. ఒక జీవన విధానం. వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, పురా ణాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా– మానవుని జీవన విధానాన్ని గురించే వేదం చదువుకున్న ఒక మేధావి అన్నాడు. Vedas are highly secular. Because they propound a way of life. చిత్రం బాగులేకపోతే రంగు తప్పుకాదు. గొల్లపూడి మారుతీరావు -
వినాయకిని మరచిపోతున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ: కాల గమనంలో స్త్రీ శక్తి స్వరూపిణి వినాయకిని పూర్తిగా మరచిపోతున్నారు. వినాయకుడికి స్త్రీ రూపం ఉందన్న విషయాన్ని కూడా తెలియనివారు ఎంతో మంది ఉన్నారంటే నేడు ఆశ్చర్యపోనక్కర్లేదు. హిందూ పురాణాల్లోనే వినాయకి ప్రస్థావన తక్కువగా ఉన్నప్పటికీ వినాయక స్త్రీ రూపానికి అనేక పేర్లు ఉన్నాయి. ప్రముఖ పరిశోధకుడు బాలాజ్ ముండుకుర్ రాసిన ‘ది ఎనిగ్మా ఆఫ్ వైనాయకీ’ పుస్తకం ప్రకారం వినాయకికి వైనాయకి, గణేషిని, గజానిని, విఘ్నేషిని, శ్రీ ఐనింగిని, గజరూప అని పేర్లున్నాయి. హిందూ కాలెండర్ ప్రకారం భాద్రపద నెలలో వినాయకుడి పుట్టిన రోజు వస్తుంది. సహజంగా ఆగస్టు నెల చివరలో వచ్చే వినాయకుడి పుట్టిన రోజునాడు ఆయనకు ఘనంగా పూజలు నిర్వహించడం వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయన్నది హిందువుల విశ్వాసం. విఘ్నాలు తొలగిపోవడానికి స్త్రీ రూపాన్ని పూజించినట్లు పురాణాధారాలు ఏమీ లేవుగానీ ప్రతి నెలలో వచ్చే నెలవంక నాలుగో రోజున ‘వినాయకి చతుర్థి’ పేరిట మహిళలు ప్రత్యేక పూజలు చేసేవారనడానికి ఆధారాలు ఉన్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తనుమాలయన్ ఆలయంలో వినాయకి విగ్రహాలు ఇప్పటికీ స్పష్టంగానే ఉన్నాయి. ఇందులో ఓ విగ్రహం సుకాసనంలో కూర్చొని ఉన్నది. నాలుగు చేతులుండే ఈ విగ్రహంలో పై ఎడమ చేతిలో గొడ్డలి, కింది ఎడమ చేతిలో శంఖం పట్టుకొని ఉంది. అలాగే కుడివైపున పై చేతిలో కలశం, మరో చేతిలో దండం ఉంది. ఆ పక్కనే మరో విగ్రహంలో వినాయకి నిలబడి ఉంది. దానికి రెండు చేతులే ఉన్నప్పటికీ విరిగిపోయి ఉన్నాయి. 1300 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయంలో వినాయకి విగ్రహాలకు ప్రత్యేకతలు ఉన్నాయని రిటైర్డ్ పురాతత్వ శాస్త్రవేత్త సి. శాంతలింగమ్ చెప్పారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈశాన్యంలో ఈ వినాయకి విగ్రహాలు కనిపిస్తాయని, మరే ఆలయంలో ఈశాన్య దిశన ఇలా విగ్రహాలు ఉండవని ఆయన వివరించారు. క్రీస్తుశకం 550లో రాసిన మత్స్యపురాణంలో కూడా వినాయకి ప్రస్తావన ఉంది. శివుడి అవతారంగా పేర్కొన్న 200 మంది దేవతల పేర్లలో వినాయకి పేరును పేర్కొన్నారు. హిందూ పురాణాలపై పలు పుస్తకాలు రాసిన దేవ్‌దత్ పట్నాయక్ కూడా వినాయకి ప్రస్థావన తీసుకొచ్చారు. ఆయన కథనం ప్రకారం అంధక అనే రాక్షసుడు పార్వతిని మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయాన్ని పార్వతి శంకరుడికి ఫిర్యాదు చేయడంతో ఆ రాక్షసుడిని శివుడు చంపాలనుకుంటాడు. అయితే ఆ రాక్షుసుడి ఒక్క రక్తం చుక్క కూడా నేల రాలకూడదు. అలా రాలిన చుక్కల నుంచి మళ్లీ ప్రాణం పోసుకునే వరం ఆ రాక్షసుడికి ఉంది. అందుకని పార్వతి విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవి, బ్రహ్మ శక్తయిన బ్రాహ్మణి, ఇంద్రుడి శక్తయినా ఇంద్రానితోపాటు వినాయకిని సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తుంది. అప్పుడు వీరందరు ఆ రాక్షసుడి రక్తాన్ని నేల రాలకుండానే గాల్లో ఉండగానే తాగేస్తారు. రాజస్థాన్‌లోని రైరా, ఒడిశాలోని హిరాపూర్, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ దగ్గర భారాఘాట్ వద్ద ఇప్పటికీ వినాయకి విగ్రహాలు ఉన్నాయి. ముందుగా జానకి శ్రీనివాసన్ వినాయకి విగ్రహాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వాటిని అనేక మంది షేర్ చేసుకోవడంతోపాటు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇప్పటికీ ఉన్న వినాయకి విగ్రహాలను వెతికిపట్టుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త శోధనలో మరెన్ని వినాయకి విగ్రహాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. -
గిల్గమెష్: ప్రపంచ ప్రాచీన పురాణం
‘సిధ్యురి’ మరొక స్త్రీ పాత్ర. ‘ఉట్‌నపిస్తిమ్’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో గిల్‌గమెష్‌కు తెలియజేస్తుంది. అయితే అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో! ఏ పురాణాన్నైనా పుక్కిటి పురాణమని పూర్తిగా తీసిపారవెయ్యకూడదు. రామ రావణ యుద్ధం పురాణం; రావణుడి పొట్టలో అమృతభాండం ఉండటం పుక్కిటి పురాణం. పురాణాన్ని నమ్మటం విజ్ఞత; పుక్కిటి పురాణాన్ని నమ్మటం మూర్ఖత్వం. ఒక జాతి అనుభవసారాన్ని మతవిశ్వాస రూపంలో తెలియజేసేది పురాణం. ఒక పురాణగాథలో అనేక అభూత కల్పనలు ఉండవచ్చు; వాటి వెనకాల అంతర్లీనంగా ఒక సత్యం దాగి ఉంటుంది. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవటం వల్ల చరిత్ర పూర్వకాలానికి చెందిన మనుషుల భౌతిక జీవితాన్నీ, విశ్వాసాలనూ, సామాజిక వ్యవస్థలనూ అంచనా వెయ్యవచ్చు. ప్రపంచ పురాణాలన్నింటిలో అత్యంత ప్రాచీనమైనదీ, మొట్టమొదట లిపిబద్ధం చేయబడినదీ సుమేరియన్ నాగరికతకు చెందిన ‘గిల్గమెష్ పురాణం’. సుమేరియన్ల అతి ప్రాచీన నగరాలలో ‘ఉరుక్’ఒకటి. క్రీ.పూ. 2800 కాలంలో ఉరుక్ నగరాన్ని ‘గిల్గమెష్’ పాలించాడు. అతను చేసిన వీరోచిత సాహస కృత్యాలకు గాను మరణానంతరం అతనికి దైవత్వం ఆపాదించబడింది. అతని వీరగాథలు పద్య రూపంలో మౌఖికంగా వాడుకలోకి వచ్చాయి. క్రీ.పూ. 2000 నాటికి లిఖిత రూపంలోకి వచ్చాయి. సుమేరియన్లను అకేడియన్లు ఓడించి సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్గమెష్ గాథలు అకేడియన్ భాషలోకి మారాయి. ఆ తరువాత బాబిలోనియన్లు సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్గమెష్ గాథలు బాబిలోనియన్ భాషలోనికీ వెళ్ళాయి. భాషలు వేరయినా సుమేరియన్లకూ, అకేడియన్లకూ, బాబిలోనియన్లకూ లిపి ఒక్కటే. అది సుమేరియన్ల ‘క్యూని ఫారం’ లిపి. గిల్గమెష్ గాథలన్నింటినీ క్రమబద్ధీకరించి ఒక సాధికార ప్రతిని తయారుచేసినవాడు సిన్– లిక్–యునిన్ని (క్రీ.పూ. 1200). సుమేరియన్ భాషలో గిల్‌గమెష్‌కు సంబంధించిన గా«థలు ఐదున్నాయి. బాబిలోనియన్ కాలానికి ఇవి (సాధికార ప్రతిలో) పన్నెండు భాగాలుగా వ్రాయబడ్డాయి. ఒక్కొక్కభాగం ఒక్కొక్క పెద్ద మట్టి ఫలకం (ఖ్చీbl్ఛ్ట) మీద వ్రాయబడి ఉంటుంది. అటువంటి ఫలకాలు సుమేరియన్ భాషలో, అకేడియన్ భాషలో వందల కొద్దీ దొరికాయి. వాటిలో ఏ ఒక్కటీ పూర్తిగా చెక్కు చెదరకుండా లభించలేదు. పురాణాలకు ఉండవలసిన ముఖ్యలక్షణాలన్నీ గిల్గమెష్ పురాణానికి ఉన్నాయి. చెడు మీద మంచి విజయం సాధించటమనేది దాదాపు అన్ని పురాణాల్లో కనిపించే ముఖ్య విషయం. కానీ ‘గిల్గమెష్ పురాణం’లో అటువంటిదేమీ ఉండదు. గిల్గమెష్ చేసిన సాహసకృత్యాలు, స్నేహానికి అతనిచ్చిన ప్రాముఖ్యత, అమరత్వం పొందటానికి చేసిన విఫల ప్రయత్నం ఇందులో కనిపిస్తాయి. దీన్ని ప్రపంచపు మొట్టమొదటి ఆటౌఝ్చnఛ్ఛి (అన్నదమ్ములు లేక స్నేహితులు కలసి చేసే సాహసకృత్యాలు) అనవచ్చు. (రామాయణాన్ని కూడా ఆటౌఝ్చnఛ్ఛి అనవచ్చు.) ఇందులో మొత్తం పది పాత్రలు ఉన్నాయి. నేప«థ్యంలో కొన్ని పాత్రల ప్రస్తా్తవన ఉంటుంది కానీ వాటికి కథతో సూటిగా సంబంధం ఉండదు. గిల్గమెష్ ఈ పురాణానికి కేంద్ర బిందువు. ‘ఉరుక్’నగరంలో ‘ఇష్తార్’ దేవతకూ, ఆమె తండ్రి ‘అను’కూ ఆలయాన్ని నిర్మించినవాడు. ‘ఉరుక్’ నగర రక్షణ కోసం యువకుల చేత గోడల నిర్మాణం చేయిస్తుంటాడు. యువకులు నిరంతరం పనిచేస్తుండటంతో యువతులకు వివాహం కావట్లేదని నగర పెద్దలు ‘అను’ దేవుడికి గిల్గమెష్ గురించి ఫిర్యాదు చేస్తారు. రెండవ ముఖ్య పాత్ర పేరు ‘ఎంకిడు’. సుమేరియన్ల గాథల్లో ఇతను గిల్గమెష్ సేవకుడిగా పేర్కొనబడ్డాడు. అకేడియన్, బాబిలోనియన్ గాథల్లో ఇతను ప్రత్యేకంగా సృష్టించబడినట్లు చెప్పబడింది. బల పరాక్రమాలలో ఇతను గిల్‌గమెష్‌కు సమవుజ్జీ. వీరిద్దరూ మంచి స్నేహితులవుతారు. కలసి రెండు గొప్ప సాహసకృత్యాలు చేస్తారు. అయితే ఎంకిడు మరణం గిల్గమెష్ను కృంగదీస్తుంది. ఎంకిడు లాగా తను మరణించ కూడదనీ, మరణాన్ని జయించాలనీ నిర్ణయించుకొంటాడు. అమరత్వాన్ని సాధించటానికి అతను చేసిన ప్రయత్నం అతన్ని ‘ఉట్‌నపిస్తిమ్’ వద్దకు తీసుకువెళ్తుంది. బైబిల్లోని ‘నోవా’లాగా, హిందువుల పురాణాలలోని ‘మను’ లాగా ఇతను ప్రాణి కోటిని జలప్రళయం నుండి రక్షించినవాడు. అందువల్ల అమరత్వం పొందినవాడు. అమరత్వ రహస్యం తెలుసుకోవటానికి గిల్గమెష్ ఇతని లోకానికి వెళతాడు. ఈ పురాణంలోని స్త్రీ పాత్రలు పైకి కనిపించేది చాలా కొద్దిసేపయినా ఆ కాలంలో చోటు చేసుకొంటున్న మార్పులను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి. స్త్రీ పాత్రలలో ముఖ్యమైనది ‘ఇష్తార్’ దేవత. ‘ఉరుక్’ నగర ప్రధానదేవత (్క్చ్టటౌn జౌఛీఛ్ఛీటట). ‘హుంబబ’ అనే భయంకర మృగంతో యుద్ధం చెయ్యటానికి వెళ్ళేటప్పుడు సహాయం కోసం గిల్గమెష్ ఈమెను ప్రార్ధించడు. సూర్యదేవుడైన ‘షమాష్’ సహాయం కోరతాడు. విజయం సాధిస్తే ‘షమాష్’ మహిమల్ని కీర్తిస్తాననీ, సింహాసనమెక్కిస్తాననీ అంటాడు. ‘హుంబబ’ మృగాన్ని గిల్గమెష్ వధించాక తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది ‘ఇష్తార్’. అతను నిరాకరిస్తాడు. ఆమె ఆగ్రహించి ‘ఉరుక్’ నగరాన్ని ధ్వంసం చెయ్యటానికి దైవ వృషభాన్ని పంపిస్తుంది. ఎంకిడు, గిల్గమెష్ కలసి దాన్ని వధిస్తారు. ‘ఇష్తార్’ దేవతను ‘ఎంకిడు’ అవమానిస్తాడు. ఆమె అతణ్ని శపిస్తుంది. ఆ తరువాత కొద్దికాలానికి ఎంకిడు వ్యాధిగ్రస్తుడై మరణిస్తాడు. తన నగరానికి ప్రధాన దేవత ఐన ‘ఇష్తార్’ను గిల్గమెష్ నిరాకరించటం ‘ఇష్తార్’ దేవతపైన ‘షమాష్’ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంగా భావించాలి. అయితే ఆ ప్రయత్నం ఆ కాలంలో విఫలమైంది. ‘ఇష్తార్’ దేవతను నిరాకరించినప్పటి నుండి గిల్గమెష్ చేసిన పనులేవీ సఫలం కావు. ‘ఇష్తార్’ దేవత ఆలయ పూజారిణి లేక వేశ్య పేరు ‘షమ్హత్’. సుమేరియన్ భాషలో ఈమె పేరు ‘హరిమ్’. అడవిలో ఉంటూ జంతువులలో జంతువుగా సంచరించే అనాగరికుడైన ‘ఎంకిడు’ను నాగరికుడిగా తీర్చిదిద్ది ‘ఉరుక్’ నగరానికి తీసుకువచ్చిన యువతి ఈమె. మానవజాతిని అనాగరిక దశ నుండి నాగరిక దశకు తీసుకు వచ్చింది మాతృస్వామ్యమని దీనివల్ల అర్థమౌతుంది. వ్యవసాయం వల్ల, పశుపోషణ వల్ల ఆహారాన్ని నిలువ చేయటం నేర్పిన తరువాతనే పితృస్వామ్యం ప్రారంభమయింది. ఇతరుల సంపదను (ధాన్యం, పశువులు) దోచుకొనే దోపిడి వ్యవస్థ ప్రారంభమైంది. ‘సిధ్యురి’ మరొక ముఖ్య స్త్రీ పాత్ర. ‘ఉట్‌నపిస్తిమ్’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో ఈమె గిల్‌గమెష్‌కు తెలియజేస్తుంది. అయితే దారి తెలియచేసే ముందు అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో! వివాహం చేసుకోవటం, సంతానాన్ని పొందటం మగవాడికి ముఖ్యమని గిల్గమెష్ తల్లి ‘నిన్సున్’ కూడా చెబుతుంది. కాని గిల్గమెష్ మాత్రం మరణించే వరకు వివాహం చేసుకోడు. గిల్గమెష్ కాలం నాటికి (క్రీ.పూ. 2800) పితృస్వామ్యం ప్రారంభమై బలపడుతున్నది. రాజకీయ, సామాజిక వ్యవహారాలలో పురుషులు పెత్తనం దొరకబుచ్చుకొన్నారు. కాని పితృస్వామ్యాన్ని బలపరిచే తాత్విక చింతన, దాని చుట్టూ అల్లబడే మతసిద్ధాంతాలు ఏర్పడలేదు. స్త్రీ తన సంతానంలో తన పునర్జన్మని చూసుకుంటుంది. అమరత్వం సాధించిన తృప్తి పొందుతుంది. పురుషుడికి అటువంటి అవకాశం లేదు. కనుక అతను అమరత్వం పొందటానికి వేరే మార్గాలు అన్వేషిస్తాడు. పరమాత్మ, జీవాత్మ, పునర్జ్జన్మ, పరలోకం, మోక్షం మొదలైనవన్నీ ఆ అన్వేషణలో అతను ఏర్పరచుకున్న భ్రమలు. ఈ భ్రమలు గిల్గమెష్ పురాణంలో మచ్చుకి కూడా కనపడవు. అంటే పితృస్వామ్యం ప్రారంభ దశలో ఉందని అర్థం. క్రైస్తవం, ఇస్లాం, హిందూ మతం, బౌద్ధం మొదలైనవన్నీ అసలు సిసలు పితృస్వామ్య మతాలు. ఇవన్నీ ఇహలోకానికి కాకుండా పరలోకానికి పెద్ద పీట వేస్తాయి (బౌద్ధం కాస్త మినహాయింపు). ఐదువేల సంవత్సరాలకు పూర్వం మాతృస్వామ్యం చెప్పిన సత్యాలు నిజమని ఇప్పుడు సైన్సు చెబుతున్నది. దైవసృష్టి సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, పరలోకం మొదలైనవన్నీ భ్రమలని ఆధారాలతో అది నిరూపిస్తున్నది. అయినా మనం ఇంకా పితృస్వామ్య ప్రవచిత తప్పుడు భ్రమలనే పట్టుకు వ్రేళ్ళాడుతున్నాం. పురాణాలను కాకుండా పుక్కిటి పురాణాలను నమ్మే మేధావులం కదా మనం! ది ఫెమినిస్ట్ ప్రసాద్ 9849828797 -
నటప్రావీణ్యానికి ప్రతీకలు.. పౌరాణిక నాటకాలు
పౌరాణిక నాటకాలు- కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బుధవారం రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు రంగస్థల నటుల నటప్రావీణ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. శ్రీ జ్ఞాన సరస్వతీ నాట్యకళామండలి వారు ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, శ్రీబాలసరస్వతి కళానాట్యమండలి (రంగారెడ్డి జిల్లా) వారు ప్రదర్శించిన ‘సత్య హరిశ్చంద్ర’, నటకులం సాంస్కృతిక సంస్థ (మణికొండ, హైదరబాదు) వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం’ నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. అలనాటి పురాణాలలోని శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు, సత్యహరిశ్చంద్రుడు, శ్రీకృష్ణుడు తదితర పాత్రలలోని ఔన్నత్యాన్ని ఈ నాటకాలు చాటి చెప్పాయి. శక్తి కంటే భక్తి గొప్పదని చాటిన రామాంజనేయ యుద్ధం శ్రీజ్ఞాన సరస్వతి నాట్యకళామండలి (పరిగి) కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ పద్య నాటకం శక్తి కంటే భక్తియే గొప్పదని చాటిచెప్పింది. యయాతి రాజు వేటకై బయలుదేరి అరణ్యంలో తపస్సు చేస్తున్న వశిష్ట, విశ్వామిత్ర మునులను దర్శిస్తాడు. వశిష్ట మునికి యయాతి నమస్కరించగా, విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై యయాతిని శపిస్తాడు. నారదుడు యయాతి చెంత చేరి ఆంజనేయుని వేడుకుని శాపవిముక్తిని పొందమని సలహా ఇస్తాడు. రాముని చేత సంహరింపబడాలనే శాపం నుంచి ఆంజనేయుడు మాత్రమే కాపాడగలడని యయాతి ఆంజనేయుడిని శరణు వేడతాడు. తనను శరణు వేడిన యయాతి ప్రాణరక్షణ కోసం ఆంజనేయుడు రామునితో యయాతిని సంహరించవద్దని అభ్యర్థిస్తాడు. కానీ రాముడు ఆంజనేయుని అభ్యర్థనను తిరస్కరించి ఆంజనేయుడితో యుద్ధానికి సన్నద్ధమవుతాడు. సత్యమును కాపాడుటకై రామాంజనేయులు యుద్ధమునకు సిద్ధమైనారని నారదుడు ప్రవేశించి యుద్ధము వారించమని శంకురుడిని కోరతాడు. ప్రత్యక్షమైన శంకరుడు శక్తి కంటే భక్తి గొప్పదని రామాంజనేయులు నిరూపించారని తెలియజేస్తారు. రామభక్తి, ఆంజనేయుని శక్తి రెండింటినీ అద్వితీయంగా ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. తాండ్ర సుబ్రహ్మణ్యం రచించిన ఈ నాటకానికి వి.జగన్నాథరాజు దర్శకత్వం వహించారు. సత్యనిష్టకు అద్దం పట్టిన ‘సత్యహరిశ్చంద్ర’... టీజీవి కళాక్షేత్రంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ బాలసరస్వతి కళానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ‘సత్య హరిశ్చంద్ర’ నాటకం హరిశ్చంద్రుని సత్యనిష్టకు అద్దం పట్టింది. ఆడిన మాట తప్పడని, వాగ్దానం నెరవేర్చుట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటాడనే హరిశ్చంద్రుని సాధు స్వభావాన్ని ఈ నాటకం చాటి చెప్పింది. దేవేంద్ర సభలో సత్యం తప్పక పలికే వారెవరూ అనే ప్రశ్న వచ్చినప్పుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని వశిష్టుడు తెలుపుతాడు. హరిశ్చంద్రుడిని సైతం బొంకించేదనని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞ చేసి వశిష్టునితో పందెం కాస్తాడు. అయోధ్యకేగి పరమేశ్వర ప్రీతిగా యాగము చేయదలిచానని, అందుకు ధనము కావలెనని హరిశ్చందుడిని కోరతాడు. హరిశ్చంద్రుడు కోరిన ధనాన్ని ఇస్తానని తెలుపుతాడు. అయితే విశ్వామిత్రుడు సింహాన్ని, మాతంగ కన్యను సృష్టించడం, హరిశ్చంద్రునికి అనేక కష్టాలు కల్గించడం వల్ల ఆ ధనమును ఇవ్వలేకపోతాడు. హరిశ్చంద్రుడు రాజ్యం విడచి అడవులకు తరలివెళ్తాడు. తనకు ఇస్తానన్న ధనమును వసూలు చేయడానికి విశ్వామిత్రుడు నక్షత్రకుడిని పంపి నానా ఇబ్బందులు పెడతాడు. చివరకు హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని, కొడుకును అమ్ముకుంటాడు. కొడుకు లోహితుడిని మాయా పాము కరచి చంపగా, భార్యనే సుంకము తెమ్మని కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు కట్టడి చేస్తాడు. ఆమె తన మంగళసూత్రాన్ని ఇవ్వడంతో వారి సత్యనిష్టను చాటుకున్నారు. తుదకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడు ఆడిన నాటకం మాయా నాటకమని, హరిశ్చంద్రుని సత్యనిష్ట ముల్లోకాలకు ఆదర్శవంతమని ప్రకటిస్తాడు. నాటక ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ నాటకానికి వరకవుల జగన్నాథరాజు దర్శకత్వం వహించారు. కృష్ణుడి మేథస్సుకు దర్పణం పట్టిన శ్రీకృష్ణ రాయబారం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు నటకులం సాంస్కృతిక సంస్థ కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం’ నాటకం శ్రీకృష్ణుడి మేథస్సుకు దర్పణం పట్టింది. కురుక్షేత్ర యుద్ధం సందర్భంగా శ్రీకృష్ణుడిని సహాయం అర్థించడానికి కౌరవుల తరపున దుర్యోధనుడు, పాండవుల తరపున అర్జునుడు ద్వారకకు వెళ్తారు. శ్రీకృష్ణుడు తానొక్కడినే ఒకవైపు.. తన సైన్యం ఒకవైపు ఉంటామని చెప్పగా అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుకుంటాడు. ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు కౌరవుల సభకు వెళ్లి ఐదు ఊళ్లు ఇచ్చినట్లయితే కురుక్షేత్ర యుద్ధాన్ని నివారిస్తానని రాయబారం చేస్తాడు. అందుకు దుర్యోధనుడు అంగీకరించకపోగా, రాయబారిగా వచ్చిన శ్రీకృçష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో నాటకం ముగుస్తుంది. తిరుపతి వెంకటకవులు రచించిన ఈ నాటకానికి దాసరి శివాజీరావు దర్శకత్వం వహించారు. నేటితో ముగియనున్న నంది నాటకోత్సవాలు... కర్నూలు నగరంలో టీజీవి కళాక్షేత్రంలో జనవరి 18న ప్రారంభమైన నంది నాటకోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 15 రోజులుగా సాగిన ఈ నాటకోత్సవాల్లో పలువురు ప్రముఖ రంగస్థల నటులు, టీవీ, సినిమా కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. సాంఘిక నాటికలు, బాలల, కళాశాలల విద్యార్థుల నాటికలు, అనంతరం పౌరాణిక పద్య నాటకాలు ఈ నాటకోత్సవాలలో ప్రదర్శితమయ్యాయి. నేడు కర్నూలు లలిత కళాసమితి వారి ప్రమీలార్జున పరిణయం ప్రదర్శన... నంది నాటకోత్సవాల ముగింపు రోజున గురువారం ఉదయం 10.30 గంటలకు కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రమీలార్జున పరిణయం పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారని లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వల్లెలాంబ నాటక సమితి (కోడుమూరు) కళాకారులు ‘దేవుడు’ పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు సావేరి కల్చరల్ అసోసియేషన్ వారు ‘గంగాంబిక’ పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటక ప్రదర్శనతో నంది నాటకోత్సవాలు ముగుస్తాయి. -
నటనా కౌశలం
- అలరించిన పద్యనాటకాలు - ఆసక్తికరంగా సాగిన నందినాటకోత్సవాలు కర్నూలు (కల్చరల్): నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం వివిధ నాటక సమాజాల కళాకారులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. రైతు కళా నిలయం పత్తికొండ కళాకారులు ప్రదర్శించిన సీతారామ కల్యాణం అలరించింది. కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులు ప్రదర్శించిన కృష్ణభీమ సేన, సాయి కళాస్రవంతి రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణసత్య పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాముని పరాక్రమ విశిష్టత.. సీతారామ కల్యాణం నాటకం.. రామాయణ ప్రాధాన్యతను, రాముని పరాక్రమ విశిష్టతను చాటి చెప్పింది. సీతా స్వయం వరానికి వెళ్లి శివధనస్సును ఎత్తలేక రావణుడు గర్వభంగానికి గురై వెనుదిరుగుతాడు. రాముడు శివధనుస్సును ఎత్తి సీతను పరిణయమాడటమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. వేదాల వెంకటప్పలాచార్య రచించిన ఈ నాటకానికి పీవీ జనార్దనరెడ్డి దర్శకత్వం వహించారు. భారత గాథలోని ఇతివృత్తం.. కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణభీమసేనం పద్య నాటకం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ నాటకంలో శ్రీకృష్ణునికి, భీమసేనునికి మధ్య ఉన్న ఆత్మీయ అనుబం«ధాన్ని చాటిచెప్పారు. పల్లేటి లక్ష్మి కులశేఖర్ రచించిన ఈ నాటకానికి పీవీ రెడ్డి దర్శకత్వం వహించారు. దృశ్యకావ్యం శ్రీకృష్ణసత్య శ్రీసాయి కళా స్రవంతి రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణసత్య నాటకం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపింది. యుద్ధరంగంలో సత్యభామ పతిప్రాణ సంరక్షణకు విల్లంబులు చేతబూని విజృంభిస్తుంది. తన తల్లి చేతిలో తప్ప అన్యుల చేతిలో తనకు మరణం లేదని గ్రహించిన నరకాసురుడు సత్యభామనే తల్లిగా గుర్తించి తన తప్పులు క్షమింపమని ఆమె పాదముల చెంత మరణిస్తాడు. ఈ ఇతివృత్తాన్ని అత్యంత హృద్యంగా చిత్రించిన శ్రీకృష్ణ సత్య నాటకం ప్రేక్షకులను అలరించింది. సీవీ రామారావు రచించిన ఈ నాటకానికి ఏ.నాగభూషణం దర్శకత్వం వహించారు. -
నటనా సౌరభం
- దేవలోక ఔన్నత్యాన్ని చాటిన పౌరాణిక నాటకాలు - పద్యాలతో ప్రేక్షకులను అలరించిన కళాకారులు నందినాటకోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక పద్యనాటకాలు దేవలోక ఔనత్యాన్ని చాటి చెప్పాయి. పురాణేతిహాసాలలోని ఉత్తమ విలువలకు అద్దం పట్టాయి. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన సీతారామకల్యాణం, కళావాహిని సాంస్కృతిక సంస్థ కర్నూలు వారు ప్రదర్శించిన కాళహస్తీశ్వర మహత్యం, సవేరా ఆర్ట్స్ కడప వారు ప్రదర్శించిన శ్రీరామ పాదుకలు అనే పద్యనాటకాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపాయి. - కర్నూలు (కల్చరల్) రాముడి పరాక్రమం చాటిన సీతారామకళ్యాణం: నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ కళాకారులు స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు సీతారామ కల్యాణం నాటకాన్ని ప్రదర్శించారు. లంకాధిపతిౖయెన రావణుడు శివున్ని మెప్పించి అనేక వరాలు పొంది తాను ఆచరిస్తున్నదే అసలైన ధర్మమని విశ్వసిస్తుంటాడు. దశకంఠుడు కైలాసనాథున్ని కఠోర భక్తితో పూజించి తనకు మరణం లేకుండునట్లు వరం పొంది రావణా అనే బిరుదును సాధిస్తాడు. లోక కల్యాణార్థం విశ్వామిత్రుడు తలపెట్టిన యాగాన్ని రాక్షసులు నిరోధిస్తారు. రామలక్ష్మణులు రాక్షసులను ఎదుర్కొని యాగ పరిసమాప్తం గావిస్తారు. రాక్షస సంహారంతో రావణాసుడు ప్రతీకార వాంఛతో రగిలిపోతాడు. నార«ధుని ప్రమేయంతో రావణుడు సీతా స్వయం వరానికి మిథిలానగరానికి వెళ్తాడు. అక్కడ శివధనస్సును ఎత్తలేక పరాభవం పాలవుతాడు. శ్రీరామ చంద్రుడు విశ్వామిత్రుని ఆశీస్సులతో శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడుతాడు. సీతారామకల్యాణం లోక కల్యాణానికి నాంది పలుకుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ నాటకానికి ఎం.అర్జున్‌రావు దర్శకత్వం వహించారు. కాళహస్తి విశిష్టతకు దర్పణం పట్టిన కాళహస్తీశ్వర మహత్యం: కళావాహిని సాంస్కృతిక సంస్థ కర్నూలు కళాకారులు ప్రదర్శించిన కాళహస్తీశ్వర మహత్యం కాళహస్తి విశిష్టతకు దర్పణం పట్టింది. కరువు కాటకాలతో దుర్భర స్థితిలోనున్న మధురాపురి రాజైన హరద్విజుడు నారధుని సలహా మేరకు శివుని గురించి తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుడు అతడిని ఒక పద్యమును పాండ్యరాజుకు వరముగా ఇస్తే అతని రాజ్యం సుఖఃశాంతులతో విలసిల్లుతుందని చెప్పారు. రుద్రరచితమైన పద్యమును తీసుకొని హరద్విజుడు పాండ్యరాజు ఆస్థానానికి వెళ్లి అక్కడ నక్కరకవిచే అవమానం పొందుతాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై నక్కర కవిని కుష్టువ్యాధి గ్రస్తుడవు కమ్మని శపిస్తాడు. కైలాసాద్రిని దర్శిస్తే శాపవిమోచనం కలుగుతుందని ఆదేశిస్తాడు. నత్కర కవి అప్పటి నుంచి కైలాస గిరికై అరణ్యములు దాటి వెళుతూ రాక్షసుడైన రక్తాక్షుని చెరలో చిక్కుతాడు. కుమారస్వామి నత్కర కవిని రక్తాక్షుని నుంచి రక్షిస్తాడు. కాళహస్తీశ్వరున్ని దర్శిస్తే శాపవిముక్తి కలుగుతుందని కుమార స్వామి సెలవిస్తాడు. కుమారస్వామి ఆదేశం మేరకు నత్కర కవి శివసాయుజ్యం పొంది కుష్టువ్యాధి నుంచి విముక్తుడు అవుతాడు. అప్పటి నుంచి కాళహస్తి మహత్యం కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది.ఈ నాటకానికి మనోహర్‌బాబు దర్శకత్వం వహించారు. రామపాదుకల విశిష్టత చాటిన శ్రీరామపాదుకలు : సవేరా ఆర్ట్స్ కడప కళాకారులు ప్రదర్శించిన శ్రీరామపాదుకలు నాటకం రామాయణంలోని ఘట్టాలను చక్కగా ప్రదర్శించింది. సీతా స్వయంవరంలో జరిగిన పరాభవంతో భంగపడిన రావణుడు రాముడిని సంహరించడానికి బయలుదేరుతాడు. శివుని మాయ కారణంగా కైకేయి దుర్మతిగా మారి దశరథుని రెండు వరాలు కోరుకుంటుంది. కైక వరాలను గౌరవిస్తూ శ్రీరాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేయడానికి తరలివెళ్తాడు. మరొక వరం ప్రకారం భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కానీ రాముడిపై అపారమైన భక్తి కలిగిన భరతుడు సోదరుడు తిరిగి వచ్చే వరకు రామపాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేస్తాడు. అలనాటి రామాయణ గాధలోని సత్యవాక్పరిపాలనలోని ఔనత్యాన్ని చాటి చెప్పే ఈ సన్నివేశాలను నాటకంలోని కళాకారులు అత్యంత ఆసక్తికరంగా ప్రదర్శించారు. ప్రముఖ నాటక రచయిత పల్లేటి లక్ష్మీకులశేఖర్ రచించిన ఈ నాటకానికి ఆళ్లూరి వెంకటయ్య దర్శకత్వం వహించారు. -
ఆ జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!
సింగీతం శ్రీనివాసరావు... మైండ్‌లోనే టైమ్ మెషీన్ ఉన్న సూపర్ జీనియస్! క్లాసూ... మాసూ... ఫ్యాంటసీ... సైన్స్ ఫిక్షనూ... జానపదం... పౌరాణికం... రియల్ లైఫ్ స్టోరీలూ, రీల్ లైఫ్ ఎక్స్పరిమెంట్లూ... యానిమేషన్లూ... ఇలా ఏ జానర్‌కైనా ఆయన ఆనర్ తీసుకొస్తారు. సెల్యులాయిడ్ సైంటిస్ట్... సింగీతం! నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! నా కెరీర్లో టాప్ 5 సినిమాల గురించి చెప్పమంటే... కొద్దిగా కష్టమే. కానీ, ఇష్టమైన కొన్ని మైలురాళ్ళను ప్రస్తావిస్తా... సింగిల్ కాలమ్ న్యూస్ నుంచి పుట్టిన ‘మయూరి’... ఓ చిన్న వార్త నుంచి సినిమా పుడుతుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ‘మయూరి’ (1984)ని చూస్తే మీరు నమ్మాల్సిందే. నిర్మాత రామోజీరావు, సుధాచంద్రన్ గురించి సింగిల్ కాలమ్ వార్త చదివి ఇన్స్పైర్ అయ్యి, నా దర్శకత్వంలో సినిమా చేద్దామనుకున్నారు. సుధాచంద్రన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కొంత ఫిక్షన్ జత చేసి ‘మయూరి’ కథ అల్లుకున్నాం. ఎవరైనా హీరోయిన్‌తో ఈ సినిమా చేసి, ఆఖర్లో సుధాచంద్రన్ క్లోజప్ చూపిద్దామని మొదట అనుకున్నాం. సుధాచంద్రన్ దగ్గర మరిన్ని సంఘటనలు తెలుసుకుందామని కలిసినప్పుడు, ఆమె కళ్లల్లోని ఇంటెన్సిటీ నన్ను ఆకట్టుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. మొదట ఆమె చేయనంటే, ఒప్పించాం. ఇలాంటి సినిమాలో డ్యూయట్లు పెట్టాలా? వద్దా? అనే విషయంలో డైలమా. అప్పుడు నేను ‘కన్నడ’ రాజ్‌కుమార్ షూటింగ్లో ఉన్నా. ఆయన్ను అడిగితే అద్భుతమైన సలహా చెప్పారు. అదేమిటంటే -‘‘సినిమాలో 10 రీళ్లు అద్భుతంగా ఉండి, ఆఖరి 2 రీళ్లు యావరేజ్‌గా ఉంటే, అది యావరేజ్ సినిమా అయిపోతుంది. అలాగే 10 రీళ్లు యావరేజ్‌గా ఉండి, ఆఖరి 2 రీళ్లు అద్భుతంగా ఉంటే ఆ సినిమా హిట్ కింద లెక్క. మీ సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు కాబట్టి, ముందు డ్యూయెట్లు పెట్టినా ఫరవాలేదు’’. అవార్డులు, అన్ని భాషల్లో జయకేతనాలు... ఇవన్నీ కాదు. అంగవైకల్యం ఉన్నా అందలమెక్కవచ్చని ఈ సినిమా ఎంతోమందికి ఇచ్చిన స్ఫూర్తి చాలు దర్శకునిగా నేను పూర్తిస్థాయి సంతృప్తిని ఆస్వాదించడానికి. రాజ్కపూర్కైతే విపరీతంగా నచ్చేసింది! సినిమా అంటేనే డైలాగులు పేలాలి అనుకునే కాలంలో - మూకీ సినిమా చేయడమంటే చాలామందికి సాహసం, కొంతమందికి చాదస్తం కింద లెక్క. కేవీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పటి నాటి కోరిక అది. ఆ తర్వాత సినిమాల హడావిడిలో పడి మర్చిపోయా. కానీ ఓ రోజు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా సడన్‌గా మూకీ తీద్దామని ఆలోచనొచ్చింది. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ. కమల్‌కి చెబితే ఎక్స్లెంట్ అన్నాడు. కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దాంతో కథని మనసు లాకర్లో పెట్టేశా. దేనికైనా కాలం, ఖర్మం కలిసి రావాలి కదా. కొన్నేళ్లకు అదే జరిగింది. బెంగళూరులో ఓ హోటల్లో ఉన్నా. ‘కన్నడ’ రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ చేసొచ్చి, రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతుంటే, ‘శృంగార్ ఫిలింస్’ నాగరాజ్ వచ్చారు. ఆయన నటుడు. దానికన్నా ప్రధానంగా సినిమా షూటింగ్స్‌కి ఫారిన్ కో ఆర్డినేటర్. ఏదో కబుర్లు చెప్పుకుంటూ యథాలాపంగా ఆ కథ చెప్పా. ఆయన ఫ్లాట్ అయిపోయాడు. మనం తీద్దామన్నాడు. కమల్ కూడా ఓకే అన్నాడు. అలా ‘పుష్పక విమానం’(1984) యాత్ర మొదలైంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వారి అవార్డు ఫంక్షన్లో వ్యాఖ్యానం చేసిన ఓ అమ్మాయి నవ్వు, కళ్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఆమెను చూస్తుంటే. ‘రోమన్ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమాలో చేసిన ఆర్డ్రే హెప్బర్న్ గుర్తొచ్చింది. వెంటనే కథానాయికగా తీసేసుకున్నాం. ఆమె ఎవరో కాదు? అమల. హోటల్ ప్రొప్రయిటర్ పాత్రకు గుమ్మడి గారిని అనుకున్నాం. అప్పుడే ఆయన భార్యకు వంట్లో బాగోకపోవడంతో, చేయడం కుదర్లేదు. వేరే కన్నడ ఆర్టిస్టుతో చేయించేశాం. ఇక ముష్టివాడి పాత్రను పీఎల్ నారాయణతోనే చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ముంబైలో షో వేస్తే, రాజేంద్ర కుమార్, రాజ్‌కపూర్, ఆర్డీ బర్మన్ లాంటి హేమాహేమీలు మెచ్చుకున్నారు. రాజ్కపూర్కైతే ‘డెడ్‌బాడీ రొమాన్స్’ సీన్ విపరీతంగా నచ్చేసింది. నేనెన్ని ప్రయోగాలు చేసినా, ‘పుష్పక విమానం’ మోసుకొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంకేదీ ఇవ్వలేదు. మొదట మరుగుజ్జు ప్రేమకథ అనుకున్నాం... ‘‘కమల్‌హాసన్ లాంటి గ్లామర్ హీరో ఓ మరుగుజ్జుగా కనిపిస్తే ఏం బాగుంటుంది? అందుకే అందరూ వద్దన్నారు. ఇది కమల్‌కి పుట్టిన ఆలోచనే. నాకు చెప్పగానే, నేను వెంటనే ఉద్వేగానికి గురయ్యా. నేను, కమల్, రచయిత క్రేజీ మోహన్ కలిసి ఓ కథ తయారు చేశాం. మరుగుజ్జు ప్రేమకథ అన్నమాట. ఐదారు రోజులు షూటింగ్ చేశాక, మాకే కథపై సందేహాలు మొదలయ్యాయి. నిర్మాత పంజు అరుణాచలం కథలు బాగా జడ్జ్ చేయగలరు. ఆయన్ను పిలిచి కథ వినిపిస్తే, పగ నేపథ్యంలో డ్యూయల్ రోల్‌తో చేయమని సలహా ఇచ్చారు. అలా స్క్రీన్‌ప్లే మార్చితే ‘విచిత్ర సోదరులు’(1989) కథ తయారైంది. ఇందులో తండ్రి పాత్రకు మొదట ప్రేమ్‌నజీర్ అనుకున్నాం. అస్వస్థతగా ఉండటంతో ఆయన చేయలేనన్నారు. ఎలాగో కవలలుగా చేస్తున్నారు కాబట్టి, తండ్రి వేషం కూడా మీరే చేయండని నేను కమల్‌తో చెబితే, ఆయన సరేనన్నారు. విలన్‌గా అమ్రీష్పురిలాంటి వాళ్లను తీసుకోవచ్చు కానీ, ఎవ్వరూ ఊహించని వ్యక్తితో చేయిస్తే, ప్రేక్షకులు థ్రిల్ అవుతారనిపించింది. అందుకే హాస్యనటుడు నాగేశ్‌ని విలన్‌గా తీసుకున్నాం. ఇక మేకింగ్ విషయానికొస్తే - మరుగుజ్జు కమల్ సీన్లు తీయడానికి చాలా శ్రమించాం. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. మానిటర్లు లేవు. మిఛెల్ కెమెరాతోనే అద్భుతాలు చేయాలి. అసలు కమల్ని పొట్టివాడిగా ఎలా చూపించారన్నది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కమల్ మోకాళ్లకు స్పెషల్లీ డిజైన్డ్ షూస్ తొడిగాం. 18 అంగుళాల గొయ్యిలు రెండు తవ్వించి, ఒక దాంట్లో కమల్ని, మరొక దాంట్లో కెమెరాను పెట్టి ఒకే లెవెల్లో ఉండేలా చిత్రీకరణ జరిపేవాళ్లం. గోతిలో దిగిన కమల్ మోకాళ్లకి షూస్ తొడిగి నడిపిస్తూ ఉంటే, మరుగుజ్జు కమల్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ఓ సీన్లో మరుగుజ్జు కమల్ కూర్చుని కాళ్లు కదుపుతారు కదా. అదెలా తీశామో తెలుసా? అవి కమల్ కాళ్లు కావు. ఆర్టిఫీషియల్ లెగ్స్. కమల్ కాళ్లను మడిచి కూర్చుంటే, రైల్వే సిగ్నల్స్ టెక్నిక్‌లో ఆర్టిఫీషియల్ కాళ్లతో సీన్ షూట్ చేశాం. ఆడియో క్యాసెట్లు తయారు చేసే పారిశ్రామికవేత్త సహదేవన్ ఈ విషయంలో మాకు బాగా సహకరించారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. జపాన్ అనే సెట్‌బాయ్ ఈ గోతుల్ని కరెక్ట్‌గా తవ్వి, మాకు బోలెడంత టైమ్ కలిసొచ్చేలా చేశాడు. కమల్ నిర్మాత కాబట్టే ఈ సినిమాను 90 రోజుల్లో తీయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే బడ్జెట్ పెరిగిపోయేది. షూటింగ్ డేసూ పెరిగేవి. అసలు ఈ సినిమా మేకింగ్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేనూ, కమల్ ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాం. కుదరడం లేదు. ఎప్పటికైనా చేయాలి. నా ఇతర సినిమాల్ని మళ్లీ రీమేక్ చేయొచ్చేమో కానీ, దీన్ని మళ్లీ తీయడం మాత్రం అసాధ్యమే. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే! నాగేశ్లాంటి ఆర్టిస్టులు... ఇలాంటి బలమైన స్క్రిప్టు మళ్లీ దొరకవు. నా లైఫ్‌లో ఎప్పటికీ ఓ మెమరీ ఇది. విమానంలో కథ చెబితే థ్రిల్ అయిపోయారు! టైమ్ మెషీన్ ఎక్కి మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎంత బాగుంటుంది? అది గతమైనా కావచ్చు. భవిష్యత్తు అయినా కావచ్చు. 18వ శతాబ్దంలోనే హెచ్‌జి వెల్స్ రాసిన ‘టైమ్ మెషీన్’ కథను కాలేజీ రోజుల్లో చదివి నేను తెగ థ్రిల్ ఫీలయ్యా. అప్పుడు అనుకోలేదు... ఆ నేపథ్యంలో సినిమా తీస్తానని. ఓ రోజు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విమానంలో కలిసి వెళ్తున్నాం. సరదాగా తనకు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ గురించి చెప్పా. ‘అద్భుతం’ అన్నాడాయన. అక్కడితో ఊరుకోలేదు. తనకు తెలిసిన వాళ్లందరికీ గొప్పగా చెప్పేశాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. శివలెంక కృష్ణప్రసాద్ అనే కొత్త నిర్మాత మాత్రం రెడీ అన్నాడు. టైమ్ మెషీన్ ఎపిసోడ్లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం ఉంటుంది. ఆ పాత్రను చేయగల ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అందుకే ఆయనకు ఈ కథ చెబితే, వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రాహకులు పనిచేశారు. మొదట పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు. ఆయనకు కడుపులో సమస్య రావడంతో, శ్రీకృష్ణ దేవరాయల ఘట్టాలను వీఎస్సార్ స్వామి తీశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రిక్ ఫొటోగ్రఫీని కబీర్‌లాల్ తీసి పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్కే ఈ సినిమాకు ప్రాణం. ‘ఆదిత్య 369’ (1991) సినిమా చూస్తుంటే - నాక్కూడా టైమ్‌మెషీన్ ఎక్కి ఆ రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనా పుడుతుంది. ‘మాయాబజార్’లో వదిలేసిన బాణీని వాడా! కేవీ రెడ్డిగారు తీసిన కళాఖండం ‘మాయాబజార్’కి పనిచేసినవాణ్ణి. ఆ సినిమా అంటే ప్రాణం నాకు. యానిమేషన్ సినిమా చేద్దామని నిర్మాత వినోద్ ప్రపోజల్ తెచ్చినపుడు, నాకు ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి పాత్ర మెదిలింది. ఆ పాత్రను బాల్యం నుంచి మొదలుపెట్టి తీద్దామనిపించింది. అప్పటికి తెలుగులో పూర్తి స్థాయిలో ఎవరూ యానిమేషన్ సినిమా చేయలేదు. నాకంతకు ముందు ఇంగ్లీషులో ‘సన్ ఆఫ్ అల్లాడిన్’ చేసిన అనుభవం ఉంది. ‘ఘటోత్కచుడు’ (2008) ఏడు భాషల్లో తీశాం. సంగీత దర్శకత్వమూ నేనే చేశా. ‘వివాహ భోజనంబు’ పాటను మాత్రం అలాగే ఉంచాం. ఆ పాటను అన్ని భాషల్లోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాం. కేవీరెడ్డిగారి ‘మాయాబజార్’ కోసం సాలూరు రాజేశ్వరరావుగారు నాలుగు బాణీలిచ్చారు. ‘కుశలమా ప్రియతమా’ అనే బాణీని ఆ సినిమాలో వాడలేదు. దాన్నే తీసుకుని ‘ఘటోత్కచుడు’లో ఉపయోగించా. కైరో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైందీ సినిమా. నేను తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఇదొక్కటీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లాణ్ణయిపోయి, తీసిన చిన్నపిల్లల సినిమా కదా! నా కెరీర్లో మరపురాని ఈ ఐదు సినిమాల జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి! - పులగం చిన్నారాయణ


