శివుడి రహస్యాలు విన్న చిలుక.. మహాజ్ఞానిగా ఎలా మారింది? | Shuka Maharshi Birth Secret Bhagavatam | Sakshi
Sakshi News home page

శివుడి రహస్యాలు విన్న చిలుక.. మహాజ్ఞానిగా ఎలా మారింది?

Oct 22 2026 9:27 AM | Updated on Oct 22 2026 9:27 AM

Shuka Maharshi Birth Secret Bhagavatam

సన్నిధి

అది వేద వ్యాస మహర్షుల వారి ఆశ్రమం. ఒకనాటి ప్రభాత సమయంలో హోమ గుండం ముందు కూర్చుని అరణిని మర్దిస్తున్నాడు మహర్షి. రెండు మోదుగ కర్రల  రాపిడితో ఉత్పన్నయ్యే అగ్నితో హోమ గుండంలో వున్న సమిధలను వెలిగించాల్సి ఉంది. ఈ హోమం చేయడానికి ఒక సంకల్పం వుంది.

వ్యాస మహర్షి బ్రహ్మచారి. తపస్సులతో... యోగ రహస్యాలనూ వేద వేదాంగాలను అభ్యసించడంలో చాలా జీవితం గడిచిపోయింది. ఏనాడూ ఆయనకు పెళ్ళి  చేసుకోవాలన్న కోరిక కలగ లేదు గాని చివరికి ఒకనాడు చిత్రంగా తనకు ఒక కొడుకు కావాలన్న కోరిక కలిగింది. శివుడి గురించి కఠిన తపస్సు చేసి తనకు పంచ భూతాల కలయికతో ఒక కొడుకు కావాలని  కోరాడు తన ముందు ప్రత్యక్షమైన మహాదేవుడిని. తథాస్తు్త అన్నాడు మహాదేవుడు. కొడుకు కావాలన్న  కోరికను సాకారం చేసుకోవాలనే హోమం తలపెట్టాడు రుషి.

అరణిని మర్దిస్తున్న సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది. భూలోక విహారానికి వచ్చిన ఘృతాచి అనే అప్సరస ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధురాలై అక్కడ తిరుగాడుతుండగా వ్యాసుల వారి కంట పడింది. ఆమె అతిలోక సౌందర్యం చూసి మోహ పీడితుడయ్యాడు మహర్షి. అదే సమయంలో ఆమెకు చిత్రమైన కోరిక కలిగి చిలుక రూపం ధరించి ఆశ్రమం లో ఒక చెట్టు మీదినుంచి మరొక చెట్టు మీదికి తిరుగుతూ దోరగా మగ్గిన పండ్లను తన ముక్కుతో కొట్టసాగింది. అప్పటికే కామ పీడితుడై ఉన్న వేదవ్యాసుడు వీర్యాన్ని స్కలించగా అది అరణిలో పడింది. హోమ గుండం నుండి ఒక పిల్లవాడు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన అప్సరస మీది కోరికతో రగిలిపోతూన్న సమయంలో ఘృతాచి చిలక రూపం దాల్చడం వల్ల పిల్లవాడు మనిషి శరీరంతో పుట్టినా తల మాత్రం చిలక రూపం వచ్చింది. అతడు పక్షిలా ఎగిరి పోగలడు.

అతడు చిలక తలతో పుట్టడానికి మరొక కారణం కూడా ఉంది. ఒకసారి పార్వతి సృష్టి రహస్యాలు  చెప్పమని మహదేవుడిని అడిగిందట! అది అందరూ తెలుసుకోవలసింది కాదని అది చెప్పడానికి ఏకాంత ప్రదేశం కావాలని పార్వతిని వెంట బెట్టుకుని హిమాలయాలకు బయల్దేరాడు శివుడు. దారిలోనే తన వాహనమైన నందినీ, మెడలో హారంగా వన్న వాసుకినీ, శిఖలో వున్న చంద్రవంకనీ వరుసగా వదిలేస్తూ చివరికి పార్వతితో అమరనాథ గుహకు చేరుకున్న శివుడు ఆమె కోరిన విధంగా జీవుల జనన మరణాల గురించీ, సృష్టి రహస్యాలను  గురించీ ఆమెకు తెలిపాడు .ఆ సమయంలో గుహ పై భాగంలో  వున్న గూడులో గుడ్డు లోంచి అప్పుడే బయటికి  వచ్చిన చిన్న  చిలుక పిల్ల ఆ దేవ రహస్యాలను  విన్నది.

ఆ  సంగతి తెలిసిన శివుడు  కోపంతో  రగిలి పోయాడు. అయితే అందులో ఆ చిలుక పిల్ల తప్పేమీ లేదని గ్రహించి మరుజన్మలో మహాజ్ఞానిగా పుట్టే విధంగా వరం ఇచ్చాడు. అందుకే అతడు చిలుక తలతో పుట్టినా, పుట్టుకతో యోగీశ్వరుడుగా పుట్టాడు. వేద వేదాంగాల్లో నిష్ణాతుడు. మహా జ్ఞాని. అతడు పుడుతూనే గంగాదేవి స్నానం చేయించింది. మహదేవుడు పార్వతి సమేతంగా వచ్చి ఉపనయనం చేసి యజ్నోపవీతం వేశాడు. దేవేంద్రుడు కమండలం ప్రసాదించాడు. దేవతలు ఎప్పటికీ మాసిపోని వస్త్రాలను ఇచ్చారు. ఆశ్రమంలో వున్న శిష్యులతో పాటు నేర్చే విద్యలే కాకుండా తండ్రి ఆదేశంతో దేవగురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి యోగ విద్యలెన్నో నేర్చుకున్నాడు శుకుడు. అలాగే జనకుడి దగ్గరికి వెళ్ళి మోక్ష మార్గం గురించి తెలుసుకున్నాడు.

సంపూర్ణ  జ్ఞాని అయిన శుకుడు ఒకసారి భూమండలాన్ని చుట్టి రావడానికి బయల్దేరాడు. ఒక సరస్సు పక్క నుండి వెడుతున్నాడు. ఆ సమయంలో కొందరు అప్సరసలు సరస్సులో జలకాలాడుతున్నారు. అటుగా వెడుతున్న శుకుడిని చూసి కూడా పట్టించు కోకుండా వాళ్ళ క్రీడల్లో వాళ్ళు మునిగి వున్నారు. వ్యాసుడు అటుగా వచ్చినప్పుడు మాత్రం సిగ్గుపడి గబగబా బట్టలు కట్టుకున్నారు. తన కొడుకును చూసి సిగ్గు పడక పోవడానికి, తనను చూసి సిగ్గు పడడానికి కారణం అడిగాడు వ్యాసుడు. ఘృతాచిని చూసి అంతటి తపస్సంపన్నుడూ కామ ప్రేరితుడు కావడం గుర్తుచేసి శుకుడు గొప్ప ఆత్మజ్ఞాని మాత్రమే కాదు, శరీరం మీద స్పహ లేని, విషయవాంఛలకు అతీతుడైన అవధూత అని, అందుకే అతడిని చూసి సిగ్గు పడాల్సింది కనిపించలేదని చెప్పారు అప్సరసలు. 

ఆత్మజ్ఞానంలో కొడుకు తనను మించి పోయినందుకు ఎంతో ఆనందించాడు మహర్షి. భాగవతాన్ని వ్యాసుల వారు రచిస్తే దానిని జనబాహుళ్యానికి అందించిన వాడు శుకుడు. అర్జునుడి మనుమడూ అభిమన్యు కొడుకూ అయిన  పరీక్షిత్తు తెలియక చేసిన ఒక తప్పుకి ముని కుమారుడి శాపానికి గురి కావలసి వచ్చింది. తక్షకుడి కాటుతో ఏడురోజుల్లో మరణిస్తావని ఆ శాపం! ఈ ఏడురోజుల సమయం వృథా కాకుండా ఆత్మకు సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలకున్న పరీక్షిత్తు తనకు ఆత్మజ్ఞానాన్ని బోధించే వ్యక్తి కోసం వెదుకుతున్న సమయంలో శుకుడు తానుగా వచ్చి భాగవత కథలు చెబుతాడు. అవి ఏడురోజులు సాగుతాయి. దాన్ని భాగవత స΄్తాహం అనీ, శుక సప్తతి అనీ అంటారు.

శాపం ప్రకారం తక్షకుడి కాటుతో ఆ ఏడవ రోజు చావాలి మహారాజు. శాపం నుండి తప్పించుకోవడానికి రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. ఏ చిన్న పాము పిల్లా కూడా రాకుండా కట్టుదిట్టాలు చేయించాడు. విషానికి విరుగుడుగా మందివ్వగల వైద్యులను రప్పించి పెట్టుకున్నాడు. తక్షకుడి నుండి తప్పించుకోవడానికి రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. పండులో చిన్న కీటకంగా దాగి వచ్చాడు తక్షకుడు. ఏడవ రోజు భాగవత శ్రవణం పూర్తి కాగానే తినడానికి పళ్ళెంలో ఉన్న పండును చేతిలోకి తీసుకుని తినబోయాడు మహారాజు. లోపల చిన్న కీటక రూపంలో దాగున్న తక్షకుడు వెంటనే తన స్వ స్వరూపం దాల్చి పరీక్షిత్తును కాటు వేసి వెళ్ళి పోతాడు. పరీక్షిత్తు మరణించినా అమూల్యమైన భాగవత కథలు మనకు శుకబోధలుగా అజరామరమయ్యాయి.
– పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి
చిత్రం: అనన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement