ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే విదేశీ ఏజెంట్లుగా ముద్ర వేస్తారా? పోలీసుల చర్యలపై సమాధానం చెప్పకుండా విమర్శకులపై ఎదురుదాడి చేస్తారా? అంటూ తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలపై పోలీసులు తీసుకున్న చర్యలు, ముందస్తు నిర్బంధ ప్రక్రియల చట్టబద్ధతపై ఆయన ప్రశ్నలు సంధించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.
సీజేపీ నేతలపై ఢిల్లీ పోలీసుల చర్యలను అన్నామలై గతంలోనే తప్పుబట్టారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చట్టబద్ధమైన ప్రక్రియను ఉల్లంఘించారని ప్రశ్నిస్తే వివిధ రకాలుగా దాడులు చేస్తారని, చివరకు విదేశీ ఏజెంట్లుగా ముద్ర వేస్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన ఎవరినీ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించకూడదని పరోక్షంగా హితవు పలికారు.
ఇదే సమయంలో తాను బీజేపీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. జూన్ 5, 2026న పార్టీని వీడినట్లు అన్నామలై స్పష్టం చేశారు. సీజేపీ నిరసన పద్ధతులతో తాను ఏకీభవించడం లేదని, ఆ సంస్థ అనుసరిస్తున్న కొన్ని విధానాలు తప్పుదారి పట్టించేవిగా భావిస్తున్నానని తెలిపారు. అయితే, ఒక అంశంపై నిరసన తెలిపేందుకు, ప్రశ్నించేందుకు, తమ వాదన వినిపించేందుకు ఆ సంస్థకు హక్కు ఉందా అని అడిగితే కచ్చితంగా ఉందనే చెబుతానని పేర్కొన్నారు. ఇదే సమయంలో సీజేపీ నేతలపై పోలీసుల చర్యలకు సంబంధించి అన్నామలై కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు అంశాలపై వివరణ కోరారు.
కేంద్రానికి ఐదు ప్రశ్నలు
👉జంతర్ మంతర్ నిరసనలకు అనుమతి: సీజేపీ నిరసనకు అనుమతి కోరిన తర్వాత జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు.
👉ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల అధికారాలు: పోలీసు అధికారులు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా వ్యవహరిస్తున్నప్పుడు వారికి ఉన్న అధికారాల పరిధి ఏమిటని అడిగారు.
👉బెయిల్ విచారణ: అక్టోబర్ 13న అరెస్టయిన సీజేపీ సభ్యులకు సంబంధించిన బెయిల్ విచారణలో అనుసరించిన విధానంపై వివరణ కోరారు.
👉ష్యూరిటీల తిరస్కరణ: ఎనిమిది మంది ష్యూరిటీలను తిరస్కరించడానికి కారణాలేమిటని ప్రశ్నించారు.
👉పోలీసుల చర్యలు: నీట్ నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగం, ప్రామాణిక నిర్వహణ విధానాల ఉల్లంఘన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, హైకోర్టు దృష్టికి వ్యవహారం వెళ్లిన తర్వాత ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిర్బంధంలో ఉన్న సీజేపీ కార్యకర్తలను విడుదల చేసిన విషయాన్ని కూడా అన్నామలై ప్రస్తావించారు.
బీజేపీ ఉచిత ప్రచారం చేస్తోందా?
ఈ వ్యవహారంపై అన్నామలై మరో ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు. సీజేపీని బీజేపీ నిజంగా వ్యతిరేకిస్తోందా? లేక ఆ పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పిస్తోందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చేందుకు సీజేపీని పెద్ద రాజకీయ శక్తిగా చూపించాలనే ఉద్దేశం ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. సీజేపీకి ఇంతకంటే మెరుగైన ప్రచార బృందం దొరకదన్న రీతిలో బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అన్నామలైపై బీజేపీ ఎదురుదాడి
అన్నామలై విమర్శలకు తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఘాటుగా స్పందించారు. పార్టీని వీడిన తర్వాత అన్నామలై తన వైఖరిని మార్చుకున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ విషయంలో గతంలో ఆయన అనుకూలంగా మాట్లాడారని గుర్తుచేశారు. తమిళనాడులో పెద్ద సంఖ్యలో నకిలీ ఓటర్లు ఉన్నారని, వారిని తొలగించాల్సిన అవసరం ఉందని గతంలో అన్నామలై పేర్కొన్నారని అన్నారు. అప్పుడు ఈ ప్రక్రియను సమర్థించిన అన్నామలై.. ఇప్పుడు బీజేపీని వీడిన తర్వాత సీజేపీ, కాంగ్రెస్ లేవనెత్తుతున్న అభ్యంతరాలకు మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైకి శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యతలు తెలుసని, అలాంటప్పుడు వారి చర్యలను ప్రశ్నించడం గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతలకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. మొత్తంగా.. సీజేపీ నేతల నిరసనలు, ఢిల్లీ పోలీసుల చర్యలతో మొదలైన వివాదం ఇప్పుడు అన్నామలై వర్సెస్ బీజేపీగా మారింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో కొత్త రూల్స్!


