breaking news
Vedavyasudu
-
శ్వేతమాధవుడు: పూర్వం కృతయుగంలో శ్వేతుడు..
పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా సాగుతుండగా, ఒకసారి అనుకోని విపత్తు సంభవించింది.శ్వేతుడి రాజ్యంలో కపాలగౌతముడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. అతడికి కొడుకు పుట్టాడు. ఆ బాలుడు ఇంకా నోట్లో దంతాలు రాకముందే అకాల మృత్యువు చెందాడు. దుఃఖితుడైన కపాలగౌతముడు తన పుత్రుని మృతదేహంతో రాజాస్థానానికి వచ్చాడు.పసిబాలుడి మృతదేహాన్ని చూసిన శ్వేతుడు చలించిపోయాడు. ‘ఈ బాలుడిని పునర్జీవితుడిని చేయలేకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను’ అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.అప్పటికప్పుడు పరమశివుడి కోసం శ్వేతుడు తపస్సు ప్రారంభించాడు. నీలపద్మాలతో పరమశివుడిని అర్చిస్తూ, ప్రార్థించాడు. శ్వేతుడి భక్తికి సంతసించిన పరమశివుడు పార్వతీ సమేతంగా అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ భక్తికి సంతుష్టి చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అన్నాడు.శ్వేతుడు పార్వతీ పరమేశ్వరులకు భక్తిగా నమస్కరించి, ‘పరమేశ్వరా! అభం శుభం తెలియని ఈ పసిబాలుడు అకాలమరణం చెందాడు. ఇతడిని పునర్జీవితుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ మేరకు ఈ బాలుడిని తిరిగి బతికించు. నా రాజ్యంలో అకాల మరణాలు లేకుండా అనుగ్రహించు’ అని కోరాడు. పరమశివుడు ‘తథాస్తు’ అని పలికాడు. మరుక్షణమే యమకింకరులు ఆ బాలుడి ప్రాణాలను తీసుకువచ్చారు. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. పుత్రుడు పునర్జీవితుడు కావడంతో కపాలగౌతముడు పరమానందం పొందాడు.శ్వేతుడు ఎలాంటి చీకుచింతలు లేకుండా పదివేల ఏళ్లు రాజ్యపాలన చేశాడు. లౌకిక ధర్మాలన్నీ నెరవేర్చాక ఐహిక సుఖాలపై విరక్తి చెందాడు. పురుషోత్తమ క్షేత్రంలో శేషజీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, జగన్నాథుడి సన్నిధానానికి సమీపంలో శ్వేతపర్వతంపై సువిశాలమైన ప్రాసాదాన్ని నిర్మింపజేశాడు. ఆ ప్రాసాద మధ్యభాగంలో మాధవమూర్తిని ప్రతిష్ఠించాడు. మాధవ ప్రతిష్ఠాపన సందర్భంగా వేలాది విప్రులకు, సాధువులకు, తపస్వులకు భూరి దానాలు చేశాడు.శ్వేతుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని, ఒక తటాకం ఒడ్డున తపోనిష్ఠతో ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ, మాధవుడిని ఆరాధించసాగాడు. కొన్నాళ్లకు పూర్తిగా నిరాహారుడై శ్రీమహావిష్ణువును ధ్యానించసాగాడు. ధ్యాన స్థితిలో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. శ్వేతుడి భక్తికి శ్రీమహావిష్ణువు పరవశుడయ్యాడు. సకల దేవతా పరివారం వెంట రాగా, శ్రీమహాలక్ష్మీ సమేతంగా శ్వేతుడి ఎదుట సాక్షాత్కరించాడు. ‘వత్సా! నీ భక్తికి పరమానందం చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అని పలికాడు.‘భక్తవత్సలా! పుండరీకాక్షా! జగన్నాథా! పాహిమాం... పాహిమాం... నన్ను నీ భక్తులలో ఒకరిగా పరిగణించి, వైకుంఠవాస యోగ్యత కల్పించు. అంతకు మించి నాకంటూ నేను కోరేదేమీ లేదు’ అన్నాడు శ్వేతుడు.‘రాజా! నువ్వు మరికొన్నాళ్లు రాజ్యభోగాలను అనుభవించిన తర్వాత నా లోకానికి చేరుకోగలవు. నీ తపోమహిమతో ఈ ప్రదేశం పునీతమైంది. నీకు సన్నిహితంగా నేను ఇక్కడే సమస్త దేవతా పరివారంతో కలసి శ్వేతమాధవుడిగా కొలువుంటాను. ఈ తటాకం శ్వేతమాధవ తీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది. శ్వేతమాధవ తీర్థంలోని జలబిందువులు కుశాగ్ర పరిమాణంలో తాకినా భక్తులను పునీతులను చేస్తాయి.’ అని శ్రీమహావిష్ణువు వరమిచ్చాడు. శ్వేతుడికి ఇచ్చిన వరం ప్రకారం అక్కడే శ్వేతమాధవుడిగా వెలిశాడు.కొంతకాలం రాజ్యపాలన సాగించిన తర్వాత శ్వేతుడు ఒకనాడు అనాయాసంగా కాలధర్మం చెందాడు. వైకుంఠం నుంచి విష్ణుభక్తులు వచ్చి, అతడిని తమతో పాటు దివ్యవిమానంలో వైకుంఠంలోని విష్ణు సన్నిధానానికి తీసుకుపోయారు.పురావిశేషం..ఇది వేదవ్యాసుడి గుహ. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వినాయకుడి సాయంతో ఇదేచోట మహాభారత రచన చేశాడని భక్తుల నమ్మకం. ఇది బదరీనాథ్ క్షేత్రానికి చేరువలోని మాణా గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని భారతదేశంలోని చిట్టచివరి గ్రామంగా చెబుతారు. సముద్ర మట్టానికి 10,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహను సందర్శించడం అంత తేలికకాదు. ఇక్కడ గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
ఏ పురాణంలో ఏముంది..?
మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటిపేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వె ల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు. 18 పురాణాల పేర్లు ... 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం 15. బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. మత్స్యపురాణం: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. కూర్మపురాణం: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలోఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. వామన పురాణం: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. వరాహపురాణం: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. గరుడ పురాణం: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలుంటాయి. వాయుపురాణం: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి. అగ్నిపురాణం: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు. స్కాందపురాణం: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి. లింగపురాణం: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది. నారద పురాణం: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. పద్మపురాణం: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. విష్ణుపురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది. మార్కండేయ పురాణం: శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి. బ్రహ్మపురాణం: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు. భాగవత పురాణం: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. బ్రహ్మాండ పురాణం: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. భవిష్యపురాణం: సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. - దోర్బల వి. ఆర్


