శ్వేతమాధవుడు: పూర్వం కృతయుగంలో శ్వేతుడు.. | A Devotional Story About Vedavyasa Written By Sankhyayana | Sakshi
Sakshi News home page

శ్వేతమాధవుడు: పూర్వం కృతయుగంలో శ్వేతుడు..

Jul 26 2026 10:57 AM | Updated on Jul 26 2026 11:28 AM

A Devotional Story About Vedavyasa Written By Sankhyayana

భక్త విజయం

పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా సాగుతుండగా, ఒకసారి అనుకోని విపత్తు సంభవించింది.

శ్వేతుడి రాజ్యంలో కపాలగౌతముడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. అతడికి కొడుకు పుట్టాడు. ఆ బాలుడు ఇంకా నోట్లో దంతాలు రాకముందే అకాల మృత్యువు చెందాడు. దుఃఖితుడైన కపాలగౌతముడు తన పుత్రుని మృతదేహంతో రాజాస్థానానికి వచ్చాడు.
పసిబాలుడి మృతదేహాన్ని చూసిన శ్వేతుడు చలించిపోయాడు. 
‘ఈ బాలుడిని పునర్జీవితుడిని చేయలేకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను’ అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.
అప్పటికప్పుడు పరమశివుడి కోసం శ్వేతుడు తపస్సు ప్రారంభించాడు. నీలపద్మాలతో పరమశివుడిని అర్చిస్తూ, ప్రార్థించాడు. 
శ్వేతుడి భక్తికి సంతసించిన పరమశివుడు పార్వతీ సమేతంగా అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. 
‘వత్సా! నీ భక్తికి సంతుష్టి చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అన్నాడు.

శ్వేతుడు పార్వతీ పరమేశ్వరులకు భక్తిగా నమస్కరించి, ‘పరమేశ్వరా! అభం శుభం తెలియని ఈ పసిబాలుడు అకాలమరణం చెందాడు. ఇతడిని పునర్జీవితుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ మేరకు ఈ బాలుడిని తిరిగి బతికించు. నా రాజ్యంలో అకాల మరణాలు లేకుండా అనుగ్రహించు’ అని కోరాడు. పరమశివుడు ‘తథాస్తు’ అని పలికాడు. మరుక్షణమే యమకింకరులు ఆ బాలుడి ప్రాణాలను తీసుకువచ్చారు. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. పుత్రుడు పునర్జీవితుడు కావడంతో కపాలగౌతముడు పరమానందం పొందాడు.

శ్వేతుడు ఎలాంటి చీకుచింతలు లేకుండా పదివేల ఏళ్లు రాజ్యపాలన చేశాడు. లౌకిక ధర్మాలన్నీ నెరవేర్చాక ఐహిక సుఖాలపై విరక్తి చెందాడు. పురుషోత్తమ క్షేత్రంలో శేషజీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, జగన్నాథుడి సన్నిధానానికి సమీపంలో శ్వేతపర్వతంపై సువిశాలమైన ప్రాసాదాన్ని నిర్మింపజేశాడు. ఆ ప్రాసాద మధ్యభాగంలో మాధవమూర్తిని ప్రతిష్ఠించాడు. మాధవ ప్రతిష్ఠాపన సందర్భంగా వేలాది విప్రులకు, సాధువులకు, తపస్వులకు భూరి దానాలు చేశాడు.

శ్వేతుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని, ఒక తటాకం ఒడ్డున తపోనిష్ఠతో ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ, మాధవుడిని ఆరాధించసాగాడు. కొన్నాళ్లకు పూర్తిగా నిరాహారుడై శ్రీమహావిష్ణువును ధ్యానించసాగాడు. ధ్యాన స్థితిలో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. శ్వేతుడి భక్తికి శ్రీమహావిష్ణువు పరవశుడయ్యాడు. సకల దేవతా పరివారం వెంట రాగా, శ్రీమహాలక్ష్మీ సమేతంగా శ్వేతుడి ఎదుట సాక్షాత్కరించాడు. 
‘వత్సా! నీ భక్తికి పరమానందం చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అని పలికాడు.
‘భక్తవత్సలా! పుండరీకాక్షా! జగన్నాథా! పాహిమాం... పాహిమాం... నన్ను నీ భక్తులలో ఒకరిగా పరిగణించి, వైకుంఠవాస యోగ్యత కల్పించు. అంతకు మించి నాకంటూ నేను కోరేదేమీ లేదు’ అన్నాడు శ్వేతుడు.

‘రాజా! నువ్వు మరికొన్నాళ్లు రాజ్యభోగాలను అనుభవించిన తర్వాత నా లోకానికి చేరుకోగలవు. నీ తపోమహిమతో ఈ ప్రదేశం పునీతమైంది. నీకు సన్నిహితంగా నేను ఇక్కడే సమస్త దేవతా పరివారంతో కలసి శ్వేతమాధవుడిగా కొలువుంటాను. ఈ తటాకం శ్వేతమాధవ తీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది. శ్వేతమాధవ తీర్థంలోని జలబిందువులు కుశాగ్ర పరిమాణంలో తాకినా భక్తులను పునీతులను చేస్తాయి.’ అని శ్రీమహావిష్ణువు వరమిచ్చాడు. శ్వేతుడికి ఇచ్చిన వరం ప్రకారం అక్కడే శ్వేతమాధవుడిగా వెలిశాడు.
కొంతకాలం రాజ్యపాలన సాగించిన తర్వాత శ్వేతుడు ఒకనాడు అనాయాసంగా కాలధర్మం చెందాడు. వైకుంఠం నుంచి విష్ణుభక్తులు వచ్చి, అతడిని తమతో పాటు దివ్యవిమానంలో వైకుంఠంలోని విష్ణు సన్నిధానానికి తీసుకుపోయారు.
- సాంఖ్యాయన

పురావిశేషం..
ఇది వేదవ్యాసుడి గుహ. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వినాయకుడి సాయంతో  ఇదేచోట మహాభారత రచన చేశాడని భక్తుల నమ్మకం. ఇది బదరీనాథ్‌ క్షేత్రానికి చేరువలోని మాణా గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని భారతదేశంలోని చిట్టచివరి గ్రామంగా చెబుతారు. సముద్ర మట్టానికి 10,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహను సందర్శించడం అంత తేలికకాదు. ఇక్కడ గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement