వాయిదా వెనుక అసలు కారణం
కెరీర్‌ను కాపాడే చిన్న మార్పులు
సమయం దొరికితే చాలు పనులను రేపటికి వాయిదా వేస్తున్నారా? అయితే మీరు ఏ రకమైన ‘ప్రొక్రాస్టినేటర్’ (వాయిదా వేసే వ్యక్తి) అయి వుండవచ్చో కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం బద్ధకం వల్లే కాకుండా భయం, ఒత్తిడి, ఆలోచనా తీరు మొదలైన వాటి వల్ల పనులను వాయిదా వేసే 9 రకాల మనుషులను పరిశోధకులు గుర్తించారు.
అయినా, సమయం దొరికితే చాలు పనులు చక్కబెట్టుకోవాలి కానీ, వాయిదా వేసుకోవటం ఏంటి?! ఈ అలవాటు మీ సమయాన్ని దొంగిలించకుండా, మీ కెరీర్‌ను దెబ్బతీయకుండా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలంటే, వాయిదా వేయకుండా ఈ రెండు ముక్కలూ చదివేయండి.
టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడాన్ని వాయిదా వేయటం, ముఖ్యమైన పనులను చివరి నిమిషం వరకు చేయకుండా వదిలేయడం లేదా అత్యవసరమైన ఈమెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం.. ఇలా మనమందరం అప్పుడప్పుడు పనులను తాత్కాలికంగా ‘తప్పించుకుంటూనే’ ఉంటాం. అయితే, పనులను తాత్సారం చేయటం అనేది కేవలం ఉత్సాహం లేకపోవడం లేదా సమయం విలువ సరిగ్గా తెలియకపోవడం వల్ల మాత్రమే జరగదు.
‘‘పనులను వాయిదా వేయడం అనేది – పని చేయవలసిన అవసరానికీ, చేయొచ్చులే అనే అలసత్వానికి మధ్య జరిగే ఒక రకమైన ‘తాడు లాగే ఆట’ (టగ్ ఆఫ్ వార్) లాంటిదిట’’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ ఇటామర్ షాట్జ్ అంటున్నారు. ఆయన తన కొత్త పుస్తకం ‘సాల్వింగ్ ప్రొక్రాస్టినేషన్: ది సైన్స్ ఆఫ్ వై వి పుట్ థింగ్స్ ఆఫ్ అండ్ హౌ టు (ఫైనల్లీ!) స్టాప్’లో.. వాయిదా మనస్తత్వాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వందలాది పరిశోధనా ఫలితాలను పరిశీలించిన మీదట, ఆయన.. ఈ వాయిదా వేసే వ్యక్తులను 9 భిన్నమైన రకాలుగా వర్గీకరించారు. (ఈ పుస్తకం ఆగస్టు 25న విడుదల అవుతోంది).
వాయిదా తత్త్వాలు– పరిష్కారాలు
వాయిదా వేసే అలవాటును వదిలించుకోవడం అంటే రోజంతా పడీ పడీ చేస్తూనే ఉండటం కాదు, ఎలాంటి అపరాధ భావం లేదా ఒత్తిడి లేకుండా అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయటం. అయితే మీరు ఏ రకమైన స్వభావం గల వ్యక్తి అనే దానిని బట్టి మీ వాయిదా తత్వానికి పరిష్కారాలు మారుతుంటాయి. ఈ తొమ్మిది తత్వాలలో మీది ఏ తత్వమో చెక్ చేసుకోండి.
1. వర్రీయర్లు (ఆందోళన చెందేవారు)
లక్షణం: తాము ఏదైనా పని చేస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో అని ఎప్పుడూ భయపడుతుంటారు. సమస్యల్లో పడకుండా ఉండటం కోసం అసలు చేయాల్సిన పనినే వదిలేస్తుంటారు.
పరిష్కారం..
మీ భయాలను స్పష్టంగా గుర్తించాలి. పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలనే పట్టుదలను వదిలిపెట్టి, మీపై మీకు నమ్మకాన్ని పెంచుకోవాలి.
2. పెసిమిస్ట్‌లు (నిరాశావాదులు)
లక్షణం: తాము విజయం సాధించే అవకాశం చాలా తక్కువ అని ముందే ఊహించుకుంటారు. దీనివల్ల అసలు ప్రయత్నించడంలో కూడా ఎలాంటి అర్థం లేదని భావిస్తారు.
పరిష్కారం..
మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. భయాలను స్పష్టంగా గుర్తించి, మీకు మద్దతుగా నిలిచే సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి.
3. పర్ఫెఫెక్షనిస్టులు (అన్నీ కచ్చితంగా ఉండాలనుకునేవారు)
లక్షణం: ప్రతిదీ అక్షరాలా పర్ఫెఫెక్ట్‌గా చేయాలని అనుకుంటారు. కానీ, తప్పులు చేస్తామనే భయం వల్ల లేదా అందుకోలేని ప్రమాణాలను నిర్దేశించుకోవడం వల్ల ఏ పనీ చేయలేక అక్కడికక్కడే ఆగిపోతారు.
పరిష్కారం..
‘ఇది చాలు’ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల ప్రమాణాల కంటే మీ సొంత లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం మాని, మిమ్మల్ని మీరే సమర్థించుకోవాలి.
4. డ్రీమర్లు (ఊహాలోకంలో విహరించేవారు)
లక్షణం: ప్రస్తుతం చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి, భవిష్యత్తు గురించి ఊహల్లో తేలిపోతూ సమయాన్ని గడుపుతుంటారు.
పరిష్కారం..
పగటి కలలు మీ ఉత్పాదకతను ఎప్పుడు దెబ్బతీస్తున్నాయో గుర్తించాలి. లక్ష్యాలను సాధించడానికి అనుసరించాల్సిన కచ్చితమైన అంశాలను విడమర్చి రాసుకోవాలి. అసలు ఊహాలోకంలో ఎందుకు చిక్కుకుపోతున్నారో (ఉదాహరణకు పర్‌ఫెక్షనిజం భయం) గుర్తించి సరిచేసుకోవాలి.
5. జిగ్‌జాగర్స్ (ధ్యాస మళ్లేవారు)
లక్షణం: తమ దృష్టిని ఆకర్షించే వేర్వేరు పనుల వైపు చాలా త్వరత్వరగా మారిపోతుంటారు. దీనివల్ల వారు నిజంగా చేయాల్సిన పనిపై ఎక్కువ సేపు నిమగ్నం కాలేరు.
పరిష్కారం..
కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి అవసరమైన పనులను కాగితంపై రాసి పెట్టుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.
6. థ్రిల్ సీకర్లు (సాహసాలు కోరుకునేవారు)
లక్షణం: డెడ్‌లైన్ కంటే కాస్త ముందు మాత్రమే, ఎంతో ఒత్తిడి మధ్య చాలా వేగంగా పని చేయడాన్ని ఇష్టపడతారు. ఆ హడావిడి వీరికి ఒక థ్రిల్‌ను ఇస్తుంది.
పరిష్కారం..
కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.
7. రెబెల్స్ (తిరుగుబాటు స్వభావం గలవారు)
లక్షణం: తమ జీవితంపై తమకు తగినంత నియంత్రణ లేదని భావిస్తారు. అందుకే తమ స్వేచ్ఛను చాటుకోవడానికి, పైఅధికారులపై లేదా వ్యవస్థపై నిరసన చూపించడానికి పనులను వాయిదా వేస్తారు.
పరిష్కారం..
ఒక పనిని వెంటనే చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఆలోచించాలి. ఇతరుల కఠినమైన నిబంధనలను పక్కన పెట్టి, మీ సొంత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీపై ఇతరుల నియంత్రణ తక్కువగా ఉండే వాతావరణాన్ని ఎంచుకోవాలి.
8. హెడోనిస్టులు (సౌఖ్య వాదులు)
లక్షణం: ఆ క్షణంలో లభించే ఆనందానికి, తక్షణ సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు.
పరిష్కారం..
మిమ్మల్ని ముందుకు నడిపించే బాహ్య/అంతర్గత ప్రేరణలను కనుగొనాలి. మీ ధ్యాసను మళ్లించే ఆకర్షణలను మీ చుట్టుపక్కల నుండి పూర్తిగా తొలగించాలి.
9. బర్న్‌అవుట్లు (తీవ్రంగా అలసిపోయినవారు)
లక్షణం: చాలా ఎక్కువగా కష్టపడి ఉండటం వల్ల లేదా ఒత్తిడితో కూడిన, అర్థం లేని పనులు చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఉంటారు. అందుకే చేయాల్సిన పనిని చేయడానికి ఓపిక లేక వాయిదా వేస్తారు.
పరిష్కారం..
మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నిద్ర, విశ్రాంతి లభించేలా చూసుకోవాలి. పని భారాన్ని తగ్గించుకోవాలి. ఈ ఏఐ యుగంలో వ్యక్తిగత ఉత్పాదకతకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వాయిదా వేసే అలవాటు వినడానికి సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే జీవితాలను, కెరీర్‌లను తీవ్రంగా దెబ్బతీస్తుందని డాక్టర్ షాట్జ్ హెచ్చరిస్తున్నారు.
గుణాల దశావతారాలు..
పనులను వాయిదా వేసే స్వభావాలపై పరిశోధన వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల ముందే, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్, సోషల్ థియరిస్ట్ డాక్టర్ మారియస్ ఓస్ట్రోవ్‌స్కీ మనుషుల ఆలోచనా సరళిపై మరో ఆసక్తికరమైన పరిశోధన చేశారు. సైకాలజీ, సోషియాలజీ ఆధారంగా ఆయన 10 రకాల ఆలోచనా విధానాలను (సిగ్నేచర్ థింకింగ్ స్టయిల్స్) వర్గీకరించారు. అవి..
1. హ్యాపీ క్యాంపర్ : ఏ పరిస్థితినైనా సానుకూలంగా, మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించే స్వభావం కలవారు.
2. జోక్‌స్టర్ : క్లిష్టమైన విషయాలను కూడా హాస్యస్ఫూర్తితో, తేలికగా తీసుకుంటూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరదాగా మార్చేవారు.
3. హాట్‌హెడ్ : పరిస్థితులకు చాలా త్వరగా, తీవ్రంగా స్పందిస్తూ ఆవేశంతో లేదా కోపంతో నిర్ణయాలు తీసుకునే ఆలోచనా సరళి గలవారు.
4. కీన్ బీన్ : ఏ పనిలోనైనా విపరీతమైన ఉత్సాహాన్ని, ఆసక్తిని చూపిస్తూ ఎల్లప్పుడూ చురుగ్గా పాలుపంచుకునేవారు.
5. క్విబ్లర్ : ప్రతి చిన్న విషయానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, లోపాలను ఎత్తిచూపుతూ వాదించే స్వభావం గలవారు.
6. గ్లూమ్‌స్టర్ : ఎప్పుడూ నిరాశావాదంతో ఉంటూ, ఏ పని చేసినా ఫలితం ప్రతికూలంగానే వస్తుందని ముందుగానే ఊహించేవారు.
7. ఎగోనైజర్ : చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా తీవ్రంగా సతమతమవుతూ, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యే ఆలోచనా విధానం కలిగినవారు.
8. కూల్ క్యాట్ : ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అస్సలు కంగారు పడకుండా ఎంతో స్థిరంగా, హుందాగా ఆలోచించేవారు.
9. వర్రీవార్ట్ : జరగబోయే పనుల గురించి, లేనిపోని సమస్యల గురించి అనవసరంగా ముందే ఆందోళన చెందే స్వభావం కలవారు.
10. రెవెలర్: జీవితాన్ని, ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటూ ఉల్లాసంగా, సంబరంగా ఆలోచించే వారు.
అయితే ప్రతి ఒక్కరూ వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఆలోచనా విధానాల మిశ్రమంగా కూడా ఉండే అవకాశం ఉందని మారియస్ ఓస్ట్రోవ్‌స్కీ వివరించారు. మనుషుల పెంపకం, వారి అనుభవాలు, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఈ ఆలోచనా సరళిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
ఇందులో మీరు స్వాభావికంగా ఏ రకానికి చెందిన వారో గుర్తించి, నేడే మార్పు వైపు అడుగులు వేయండి! వాయిదా వేసే అలవాటును వదులుకుని, మీ సమయాన్ని ఎలా గడపాలో మీరే నిర్ణయించుకునేలా మారటమూ గొప్ప విజయమే.
- సాక్షి స్పెషల్ డెస్క్


