శత్రుత్వం వద్దు.. | An Inspiring Story For Children Written By Kanchanapalli Venkata Krishna Rao | Sakshi
Sakshi News home page

శత్రుత్వం వద్దు..

Jul 26 2026 10:33 AM | Updated on Jul 26 2026 11:17 AM

An Inspiring Story For Children Written By Kanchanapalli Venkata Krishna Rao

పిల్లల కథ

పైడి పర్వతం పక్కన ఉన్న కందర్ప రాజ్యం రాజు వివేక వర్మ సుపరిపాలన సాగిస్తూ, ప్రజలకు ఎంతో మేలుచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. పైడి పర్వతంలో పుట్టిన ధారావళి నది కందర్ప రాజ్యంలోని పొలాలను సస్యశ్యామలం చేస్తూ రాజ్యాన్ని పచ్చగా ఉంచుతోంది.

ఆ సుభిక్షం వలన మంత్రి సుహస్తుడి ప్రణాళికల వలన పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. ధారావళి నది కందర్ప రాజ్యం నుంచి పక్కనే ఉన్న ప్లవంగ రాజ్యంలోనూ ప్రవహిస్తూ ఆ రాజ్యంలోని పొలాలను కూడా సస్యశ్యామలం చేస్తోంది.
ప్లవంగ రాజ్యాన్ని విజయ వర్మ పాలిస్తున్నాడు. ఆయన కూడా ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్లవంగ రాజ్యంలోనే ఉన్న రసోపర్వతంలో అనేక రసాయన రాళ్ళు ఉన్నాయి. వాటితో మనుషులకు, జంతువులకు ఉపయోగపడే ఎన్నో మందులు ప్లవంగ రాజ్యంలో శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఆ రాళ్ళను కందర్ప రాజ్య శాస్త్రవేత్తలు కూడా ఉపయోగిస్తున్నారు.

విజయవర్మ ప్రధానమంత్రి దురోత్తుడికి కొంత వక్రబుద్ధి ఉంది. ఒకరోజు ఆయన రాజు గారితో, ‘మహారాజా ఆ రసోపర్వతం వలన మనరాజ్యం సుభిక్షంగా ఉంది కాని, మనం కందర్పరాజ్యం నుండి వచ్చే ధారావళి నది నీటిని ప్రజల అవసరాలకు ఉపయోగిస్తూ మన రాజ్యంలోని పొలాలు పండించుకుంటున్నాం. భవిష్యత్తులో వారు ధారావళి నది మీద ఆనకట్టలు కడితే మనకు నీటి కొరత రావచ్చు. అందువలన మనం కందర్ప రాజ్యాన్ని ఆక్రమిస్తే అటు నీటి లభ్యత, ఇటు మనరాజ్యం పరిశ్రమలతో ఒకే రాజ్యంగా శోభిల్లుతుంది’ అని మంత్రి తన దురాలోచనను రాజు విజయవర్మకు చెప్పాడు.

మంత్రి చెప్పిన దానిమీద రాజు విజయవర్మ ఒకింత ఆలోచించి మూడు నెలలలో కందర్ప రాజ్యం మీద దండయాత్ర చేయాలని నిశ్చయించి, కందర్ప రాజ్యం రాజుగారు వివేకవర్మకి దూతద్వారా ఒక సందేశం ఈ విధంగా పంపాడు:
‘మీరాజ్యాన్ని మాకు శాంతియుతంగా  అప్పగించండి లేకపోతే ఉభయ రాజ్యాలకు యుద్ధం తప్పదు, రక్తపాతం తప్పదు’
ఇట్లు,
విజయవర్మ,
ప్లవంగ రాజ్య రాజు

ఆ సందేశం చూసి వివేక వర్మ ఆశ్చర్య పోయాడు. ఇన్నేళ్లు శాంతియుతంగా ఉన్న ప్లవంగ రాజుకు ఈ బుద్ధి ఎలా పుట్టిందో వివేక వర్మకు అర్థం కాలేదు. వెంటనే మంత్రి సుహస్తుడిని ఈ విషయం మీద సలహా అడిగాడు.
‘మహారాజా ఈ బుద్ధి విజయ వర్మకు పుట్టినది కాదు. ఎవరో ఆయన మెదడులో విషబీజం నాటారు. నేనే వెళ్ళి విజయవర్మతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పాడు సుహస్తుడు.

రెండో రోజే సుహస్తుడు ప్లవంగ రాజ్యానికి వెళ్ళి రాజు విజయవర్మను కలిసి ఈ విధంగా చెప్పాడు: ‘మహారాజా ఇన్ని సంవత్సరాలు మన రెండు రాజ్యాలు పాడి పంటలతో సుఖశాంతులతో ఉన్నాయి. ఇటువంటి సమయంలో మన మధ్య యద్ధాలు రక్తపాతాలు ఎందుకు? దానివలన ఇరు దేశాల ప్రజల జీవితాలు దెబ్బతింటాయి. మా వలన మీకు మీ రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా రాజు వివేకవర్మ సంగతి మీకుతెలుసు కదా! ఎవరికీ హాని చేయడు. ఎవరికైనా అవసరం ఉంటే సహాయమందించే మంచి మనస్తత్వం కల మంచి మనిషి. ఆలోచించండి మహరాజా!’ వివరించాడు సుహస్తుడు.

సుహస్తుడి మాటలతో విజయవర్మను ఆలోచనలో పడ్డాడు.
తన రాజగురువుతో మాట్లాడాక యుద్ధాన్ని ఉపసంహరించుకున్నట్లు రాజు వివేక వర్మకు సందేశం పంపించాడు. తరువాత తన మంత్రి దురోత్తుడితో, ‘మంత్రిగా తమరు అన్ని పరిస్థితులూ గమనించి లాభనష్టాలు బేరీజు వేసి నాకు సలహాలు ఇవ్వాలి. మీరు ఆలోచించకుండా సలహాలు ఇవ్వకండి’ అని మందలించాడు.

విజయ వర్మ సందేశం చూసి వివేకవర్మ ఆనందించాడు. విజయవర్మను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పి, మంచి బహుమతులు ఇచ్చాడు. వివేకవర్మ మంచి మనసుకు విజయవర్మ సంతోషించాడు.  వివేకవర్మ తన మంత్రి సుహస్తుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించినందుకు ఆయనకు కూడా మంచి బహుమతులు ఇచ్చాడు. ఆవిధంగా ఇరు రాజ్యాల ప్రజలు సంతోషాలను ప్రకటించారు.
- కంచనపల్లి వేంకట కృష్ణారావు

హితవచనం..
అనిన్ద్యమపి నిన్దన్తి స్తువన్యస్తుత్యముచ్చకైః
స్వాపతేయకృతే మర్త్యాః కిం కిం నామ న కుర్వతే
- మనుషులు డబ్బు కోసం చెయ్యరాని పనులన్నీ చేస్తారు. నిందిచరాని వాళ్లను నిందిస్తారు. పొగడతగని వాళ్లను పొగుడుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement