వెస్ట్ బ్యాంక్: ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి కేంద్రంగా ఉన్న వెస్ట్ బ్యాంక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ సెటిలర్లు దాడికి పాల్పడటంతో చెలరేగిన ఘర్షణల్లో నలుగురు పాలస్తీనియన్లు మృతి చెందారు. టెల్ గ్రామంలో జరిగిన ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, శుక్రవారం నాడు నలుగురు పాలస్తీనియన్ల అంత్యక్రియలను నిర్వహించారు. ఇజ్రాయెల్ సైనిక ఆంక్షల నడుమ ఈ అంత్యక్రియలు జరిగాయి.
గాజా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో హింసాత్మక ఘటనలు గణనీయంగా పెరిగాయి. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, సుమారు 20 మంది ఇజ్రాయెల్ సెటిలర్లు గ్రామంలోకి చొరబడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కాల్పులు జరిగాయి. ఒక పాలస్తీనియన్ నివాసి ఇజ్రాయెల్ ఆయుధాన్ని లాక్కొని ఒక సెటిలర్‌ను కాల్చిచంపాడని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఆ వెంటనే సమీప స్థావరం నుంచి వచ్చిన అత్యవసర ప్రతిస్పందన బృందం జరిపిన కాల్పుల్లో నలుగురు పాలస్తీనియన్లతో పాటు మరో ఇజ్రాయెల్ వ్యక్తి కూడా మృతి చెందాడు.
ఈ ఘటన తర్వాత వెస్ట్‌బ్యాంక్ వ్యాప్తంగా సైన్యం చెక్‌పోస్టులు, రోడ్లను మూసివేసింది. అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్ల ఏరివేత చర్యలను ముమ్మరం చేయడంతో పాటు ఫామ్ అవుట్‌పోస్టులను చట్టబద్ధం చేస్తామని అన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థిరావాసాలు చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తారు. 1967 యుద్ధంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయెల్, తూర్పు జెరూసలేం మినహా మిగిలిన ప్రాంతాల్లో 5 లక్షలకు పైగా ఇజ్రాయెల్ ప్రజలకు ఆవాసం కల్పించింది. ఈ తాజా హింస ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణపై అంతర్జాతీయంగా ఆందోళనలను మరింత పెంచింది.
ఇది కూడా చదవండి: జనాలపైకి దూసుకెళ్లిన వ్యాన్.. ఒకరు మృతి, 16 మందికి గాయాలు


