ఇన్‌స్టంట్‌ జనరేషన్‌ డిలీట్‌.. సొల్యూషన్‌! | Rising violent tendencies among girls | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టంట్‌ జనరేషన్‌ డిలీట్‌.. సొల్యూషన్‌!

Jun 27 2026 6:09 AM | Updated on Jun 27 2026 6:09 AM

Rising violent tendencies among girls

సందర్భం

ఈ కథనం రాయాలని లేదు. కానీ రాయక తప్పడం లేదు. రెండు రోజుల్లో రెండు వార్తలు. ఇద్దరు ఆడపిల్లల చేతులకు అంటిన నెత్తురు. ఒకమ్మాయి కాబోయే భర్తను కోట అంచు నుంచి తోసేస్తే... ఇంకో అమ్మాయి కుటుంబాన్నే కడతేర్చింది. కారణం ఒక్కటే...  ‘నాకు కావాలి’... ‘అడ్డొస్తే అంతే’. ఈ ఘటనలు విన్న వెంటనే గుండె లోపల ఏదో తెగిపోయింది. ఆ తెగిపోయిన చోటు నుంచే  ఈ అక్షరాలు... ఇది నింద కోసం రాస్తున్న కథనం కాదు. ‘అయ్యో అయ్యో’ అంటూ ఆందోళన చెందుతున్న కుటుంబాలతో పాటు చేస్తున్న హెచ్చరిక. వేస్తున్న వెర్రికేక.

ఒకప్పుడు ఆడపిల్ల ఏడిస్తే ఇల్లంతా కదిలిపోయేది. ‘ఎందుకు ఏడుస్తున్నావ్‌ తల్లీ?’ అని పదిమంది పరుగెత్తుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు ఆడపిల్ల ఏడుపు అందరినీ ఏడిపిస్తోంది. ఎన్నో దశాబ్దాల పాటు పోరాడి ప్రేమకు సమాజంలో అర్హత పొందిన అమ్మాయి నేడు ఇంకా దానిని పూర్తిగా పొందలేక మరుగుజ్జు ఆలోచనలు చేస్తోంది. మరింత చీకటిదారిలో నడుస్తోంది.

ఏమిటా ఘటనలు... వింటుంటే గుండెలు అవిసిపోతున్నాయి. లోహగఢ్‌ కోట మీద ఆ కుర్రాడు కేతన్‌ చివరి క్షణంలో ‘సియా’ అని ఆర్తనాదం చేసి ఉంటాడా?  బెంగళూరు ఫ్లాట్‌లో శ్వేత పొడిచిన కత్తిపోట్లకు తల్లి ‘అమ్మా’ అని షాక్‌లో గుడ్లు తేలేసి ఉంటుందా?
దీనిని బట్టి అర్థమవుతున్నది ఒక్కటే. మన ఇళ్లల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న  మౌనం. పిల్లల కోరికలకు, పెద్దల భయాలకు మధ్య ఉన్న అగాధం. ఆ అగాధాన్ని హింసతో పూడ్చుకోవాలని పిల్లలు అనుకుంటే ప్రతి ఇల్లూ శ్మశానమే. ఈ ఉత్పాతం మన ఇంటి గుమ్మం దాకా రాకముందే ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం.

రెండు ఘటనలు, ఒకే గాయం
మన ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోతాం. ఆ పాప పెరిగి పెద్దదై, తన కలలు తాను ఎంచుకునే వయసుకు వచ్చేసరికి మాత్రం ఏదో తెలియని భయం. ‘ఏం చేస్తుందో, ఎవరిని చేసుకుంటుందో’ అని. కానీ ఇప్పుడు భయం మరో మలుపు తిరిగింది. ఆడపిల్ల తమకు కావలసినది దక్కించుకోవడానికి ప్రాణం తీసే స్థాయికి వెళ్లిపోతోంది. ఆ చేతులు నెత్తురుకు భయపడటం లేదు.

అటు చూడండి... పుణె లోహగఢ్‌ కోట అంచున నిలబడి ఉన్నాడు కేతన్‌. 26 ఏళ్ల వ్యాపారవేత్త. తన కాబోయే భార్య సియా పుట్టినరోజు వేడుక సంబరంలో ఉన్నాడు. ఆమెతో పెళ్లి కోసం రూ.17 కోట్ల ప్యాలెస్‌ బుక్‌ చేశాడు. కానీ ఆ అంచు నుంచి అతన్ని తోసేసింది ఆ సియా. తన ప్రియుడు చేతన్ తో కలిసి మరీ. ఆమెకు చేతన్‌ కావాలి. చేతన్‌ ప్రేమ కావాలి. అంత ప్రేమ ఉన్న అమ్మాయి అతన్ని పొందడానికి ఎంచుకున్న దారి నేరం. చేసింది ప్రేమ పేరుతో కుట్ర. మొదటిసారి విఫలమై, రెండోసారి మళ్లీ కోటకు రప్పించి 400 అడుగుల లోయలోకి తోసేశారు కేతన్‌ని. శవాన్ని చూసినా సియా కళ్లలో కన్నీరు లేదు, బాధ లేదు.

ఇక బెంగళూరు. 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్వేత. తల్లిదండ్రులను, చెల్లి సుప్రియను సొంత చేతులతో పొడిచి చంపింది. కారణం? ప్రియుడు కెన్నెత్‌తో సహజీవనానికి ఒప్పుకోలేదని, రూ.30 లక్షల అప్పు తాలూకా నోటీసులు ఇంటికి వచ్చాయని. ‘మా అమ్మ మాకు కావలసిన స్వేచ్ఛ ఇవ్వలేదు. నేను ఖైదీలా బతికాను. అందుకే ద్వేషం పెంచుకున్నా’ అని ఆమె పోలీసులకు చెప్పింది. ఒక్క రాత్రిలో ముగ్గురి ప్రాణాలు, 50కి పైగా కత్తిపోట్లు.

ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ కావలసింది ‘తను కోరుకున్న అబ్బాయి’. కాని అందుకు నేరమార్గమే పరిష్కారం అనుకున్నారు.

మనం పెంచిన ఆడపిల్ల ఇలా ఎందుకు?
1. ‘నాకు కావాలి అంటే ఇప్పుడే కావాలి’ తత్వం: పెంపకంలో ఓపిక నేర్పలేదు. ఎదురుచూపు ఈ తరం పిల్లలకు చేతకాదు. ఇన్ స్టంట్‌ నూడుల్స్‌ యుగంలో బంధాలూ ఇన్ స్టంట్‌ అయిపోయాయి. అడ్డు వస్తే ‘డిలీట్‌’ కొట్టేయడం అలవాటై పోయింది.

2. ప్రేమా, మోహానికి లేదు తేడా: సియాకు చేతన్‌తో ఏడు నెలల ప్రేమ. శ్వేతకు కెన్నెత్‌తో రెండు నెలల సహజీవనం. రెండూ షార్ట్‌టైమ్‌ ప్రేమలే. మోహదశలే. ప్రేమ అంటే సహనం. మోహం అంటే స్వార్థం. ‘నా మాట వినకపోతే నువ్వు బతకకూడదు’ అనే అహం పుట్టిందంటే అది ప్రేమ కాదు. హంతక లక్షణం. మోహంతో కళ్లు మూసుకుపోయిన మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు. 
3. ఇంట్లో మాట కరువు: శ్వేత ‘ఇంట్లో ఖైదీలా ఫీలయ్యా’ అంది. సియా పెళ్లి ఇష్టం లేదని గట్టిగా చెప్పలేకపోయింది. ఇంట్లో మాట వినే దిక్కు లేకపోతే బయట తారసపడినవాడే దేవుడు అయిపోతాడు. వాడు చెప్పేది, వాడితో చెప్పేది వేదం అయిపోతుంది. ఇద్దరి మాటలూ కలిసి మెల్లగా ఎదుటివారికి ఉరితాడవుతాయి.
4. సోషల్‌ మీడియా మెహర్బానీ: నేరం చేసిన తర్వాత కూడా సియా రీల్స్‌ పెట్టింది, పోస్టులు వేసింది. చంపి కూడా ‘నేనే బాధితురాలిని’ అని ప్రపంచానికి చూపించాలనే తాపత్రయపడింది. లైకులు, కామెంట్లు వస్తే చాలు. పాపం అనే స్పృహ చచ్చిపోతుంది. ‘నా ఫీలింగ్స్‌ ఎవరూ అర్థం చేసుకోలేదు’ అనే సాకుతో హత్యను జస్టిఫై చేసుకుంటున్నారు. ఫోన్‌ స్క్రీన్‌ మీద సింపతీ కోసం నిజ జీవితంలో ప్రాణాలు తీస్తున్నారు.

సమాజం ఇలా ఎందుకు మారింది?
వేలు ఒక్కరివైపు చూపించలేం. ఇది ముక్కోణపు వైఫల్యం. 
ఒకటి: ఇల్లు. ‘ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలి’ అని పెద్ద తరం. ‘నా ఇష్టం నా హక్కు’ అని యువతరం. ఈ రెండింటి మధ్య నలిగి ‘ఎవరూ నన్ను అర్థం చేసుకోరు’ అనే అగాధం. శ్వేత తల్లి కఠినంగా ప్రవర్తించింది నిజమే. కానీ ఆ కఠినత్వానికి కూతురు చేజారిపోతుందనే భయం. ఆ భయాన్ని ప్రేమగా చెప్పడం ఆమెకు చేతకాలేదు.
రెండు: బయటి ప్రపంచం. ‘నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే వదిలేయ్‌’ అని చెప్పే వెబ్‌ సిరీస్‌లు. ‘పేరెంట్స్‌ టాక్సిక్‌’ అని ముద్ర వేసే రీల్స్‌. 
సంబంధం కంటే స్వేచ్ఛ గొప్పది అని నూరి పోసే కంటెంట్‌. దాని ఫలితమే సియా ‘కూల్‌’గా హత్యకు ΄్లాన్‌ చేసే దశకు చేరగలగడం.
మూడు: ‘ఆడది అంటే సహనం, త్యాగం’ అని శతాబ్దాలుగా విన్నాం. దానిని ఇంకా పట్టుకుని రుద్దుతూ ఆమె న్యాయమైన కోరిక తీర్చకపోతూ ఉండటం వల్ల రియాక్షన్ గా ‘ఇక నేను భరించను, నరికేస్తా’ అనే అంచుకు వెళ్లిపోయారు.

దీన్ని సరిదిద్దడం ఎలా? 
1. ఇల్లు తీర్పు చెప్పే కోర్టు కాకూడదు: కూతురు ‘నాకు ఇతను నచ్చాడు’ అంటే, ‘ఛీ’ అని మొహం తిప్పుకోకుండా ‘ఎందుకు నచ్చాడో చెప్పు తల్లీ’ అని కూర్చోబెట్టుకోవాలి. నచ్చకపోతే కారణం వివరించాలి. శ్వేత తల్లిదండ్రులు సహజీవనాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకత తప్పు కాదు. కానీ ఆ వ్యతిరేకతను ‘నువ్వు చెడిపోయావ్‌’ అనే నిందగా కాకుండా ‘మాకు భయంగా ఉంది, మాట్లాడు
కుందాం’ అనే వంతెనగా మార్చాలి.
2. ‘కాదు’ అనే మాట నేర్పాలి: కోరికలన్నీ తీరవు. ప్రేమించిన ప్రతి ఒక్కరూ దక్కరు. దక్కలేదని ప్రపంచం ముగిసిపోదు. ఈ పాఠం 
ఇంట్లోనే మొదలవ్వాలి. సియాకు కేతన్‌ వద్దు అనుకుంటే ‘వద్దు’ అని తెగేసి చెప్పే ధైర్యం ఇవ్వలేదు. అందుకే ‘చంపేద్దాం’ అనే 
పిరికిపంద పని చేసింది.
3. ఆడపిల్లలకు ‘ఎమోషనల్‌ లిటరసీ’ నేర్పాలి: కోపం వచ్చినప్పుడు చంపడం కాదు, నిరసన తెలపడం పరిష్కారం అని చె΄్పాలి. బాధను, అహాన్ని, వ్యామోహాన్ని విడదీసి చూపించాలి. కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాలి. 
4. మగపిల్లలకు ‘నో’ అంటే ‘నో’ అనే గౌరవం నేర్పాలి: చేతన్, కెన్నెత్‌ లాంటి వాళ్లు ‘ఆమె కోసం ఎవరినైనా చంపుతా’ అనుకునే ధోరణి మగవాళ్లది. అది వీరత్వంగా అనుకుంటున్నారు. వారికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ఘటన మన ఇంటి అబ్బాయిలకు మేల్‌కొలుపు కావాలి.

ప్రాణాలు కాపాడే పది నిమిషాలు
సియా, శ్వేత... వీళ్లు రాక్షసులు కాదు. మన ఇళ్లల్లో పెరిగిన ఆడపిల్లలే. వాళ్ల చేతులకు రక్తం అంటింది అంటే ఆ రక్తపు మరక మన సమాజపు అద్దం మీద కూడా పడినట్టే. ప్రేమ పేరుతో ప్రాణం తీయడం తెగింపు కాదు అది ఓటమి అనే ఎరుక ఇల్లు, విద్యాసంస్థలు, సంఘం నేటి యువతరానికి పదేపదే చె΄్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆడపిల్లతో రోజూ పది నిమిషాలు మాట్లాడాలి. ‘ఏం కావాలి?’ అని కాదు, ‘ఏం ఫీల్‌ అవుతున్నావ్‌?’ అని అడగాలి. ఆ పది నిమిషాలు ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు.

కోరిక తప్పు కాదు. దాన్ని తీర్చుకునే దారి తప్పు కాకూడదు. అహింసతో సాధించలేనిది, హింసతో అసలే సాధించలేం. 
ఇది శ్వేతలకు, సియాలకు మాత్రమే చెప్పే మాట కాదు. రేపటి మన బిడ్డలకు చేర్చాల్సిన జీవనసందేశం.

‘నా మాట వినకపోతే నువ్వు బతకకూడదు’ అనే అహం పుట్టిందంటే అది ప్రేమ కాదు. హంతక లక్షణం

విరుద్ధ భావనల సంఘర్షణ
ఈ జెనరేషన్‌ తమకు ఏం కావాలో ముందే డిసైడ్‌ చేసుకుంటోంది. మంచి చెడులు చెప్పి, కౌన్సెలర్స్‌ సాయంతో వాస్తవాలను తెలియజేసి, వారికి నచ్చినట్టుగా జీవించే వెసులుబాటు కల్పించడమే మేలు. డబ్బు, అందం, హోదా.. ఇవేవీ జీవించడానికి పనికిరావనే నైజం ఒకవైపు, ఇవే సమాజంలో అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయని మరోవైపు .. ఈ విరుద్ధభావనల సంఘర్షణలతో ఇలాంటివి పుట్టుకువస్తున్నాయి. ఏదైనా దారుణం జరిగాక గానీ తాము చేస్తున్నట్టు తప్పేమిటో తెలిసి రావడం లేదు. 

– డాక్టర్‌ కుమార్, సంజీవని రిలేషన్‌షిప్‌ అండ్‌ మ్యారేజీ కౌన్సెలర్‌

ఏది మంచిదో తెలిసేలా చేయాలి
అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లికి ముందు సంబంధాన్ని కుదిర్చేటప్పుడు తమ వ్యక్తిగత జీవితంలో ఎవరు ఉన్నారో.. తల్లిదండ్రులకు చెబుతారు. తల్లిదండ్రులు డబ్బు, పరువు, సామాజిక హోదా.. గురించి ఆలోచించి ‘ఏ వ్యక్తి తమ పిల్లల జీవితానికి మంచిదో’ నిర్ణయిస్తారు. అప్పుడు పిల్లలను కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో పెద్దలను కాదనలేకనో, వారు చెప్పినది సబబుగానే అనిపించి చెప్పింది వినడానికి సిద్ధపడతారు. కానీ, ప్రేమించానని చెబుతున్న అబ్బాయి ఆ అమ్మాయిని బెదిరించడమో, లేకపోతే మరిన్ని ప్రేమ కబుర్లు చెప్పడమో, తన మాటలతో రకరకాలుగా ప్రేరేపించడమో చేస్తారు. ఇలాంటప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్‌ అయ్యే మైండ్స్‌ క్షణికావేశంలోనో లేదా ఎవరికీ దొరకకుండా తప్పులు చేయడం ఎలా.. అనే విషయాల మీద దృష్టి పెడుతున్నాయి. చాలా కేసుల్లో పరోక్షంగా ఒక అబ్బాయిని చంపడానికి మరొక అబ్బాయే కారణం అవుతున్నాడు. 

– డాక్టర్‌ జ్యోతిరాజ, సైకాలజిస్ట్‌

– కె.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement