ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్ ప్రయాణిస్తున్న కారు.. సోమవారం వేకువజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే అమీన్ స్వల్వ గాయాలతో బయటపడటంతో రెహమాన్ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ఒక క్యాబ్‌ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల టైంలో అమీన్ తన స్నేహితుడితో కలిసి జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు వెళ్తున్నారు. వారి వాహనం ఒలింపియా టెక్ పార్క్ దగ్గరకు రాగానే, పక్కనే ఉన్న రోడ్డు నుంచి క్యాబ్ ఒక్కసారిగా మెయిన్ రోడ్ మీదకు వచ్చింది. దీంతో అమీన్ ప్రయాణిస్తున్న కారు, క్యాబ్ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో అమీన్, అతని స్నేహితుడితో పాటు క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స అందించి, అందరినీ డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. కానీ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.


