సాహిత్యంలో నవలలు, నాన్-ఫిక్షన్, వ్యాసాలు, పీహెచ్‌డీ థీసిస్‌ల విషయంలో ‘ప్లాగరిజం’ (సాహిత్య చోరీ లేదా భావజాల దొంగతనం) అనే పదం సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నాటకాలు, లలిత కళలు, సినిమా వంటి ఇతర సాంస్కృతిక, సృజనాత్మక రంగాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ‘ప్లాగరిజం’ నిబంధనలను అత్యధికంగా ఉల్లంఘిస్తున్న రంగం బహుశా సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 1970లలో లేదా మరెప్పుడో ప్రపంచంలో ఎక్కడో తీసిన ఒక సినిమాను కాపీ కొట్టడం లేదా దాదాపుగా దానినే పోలిన చిత్రాన్ని రూపొందిండం, దానికి ఆధునిక పాత్రలను అద్దడం, కథలో చిన్న మార్పులు చేయడం, కథనంలో మాత్రం స్వల్ప పోలికలను ఉంచుకుని దానిని తమ సొంత సృష్టిగా ప్రచారం చేసుకోవడం చిత్రనిర్మాతలకు సులభం కావడంతో ఇది అత్యంత సాధారణంగా జరుగుతుంటుంది.
‘ప్లాగరిజం’ అంటే..
ఒకరి ఆలోచనలు, సమాచారం, భాష లేదా రచనను అసలు మూలాన్ని తగిన విధంగా గుర్తించకుండా (క్రెడిట్స్ ఇవ్వకుండా) ఉపయోగించడాన్ని ‘ప్లాగరిజం’ అంటారు. అసలైనదిగా నమ్మించే ప్రయత్నంలో ఒక రకమైన అనైతికత ఉండటం దీనిలోని ప్రధానాంశం. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు జరిగే కాపీరైట్ ఉల్లంఘనకు, ‘ప్లాగరిజం’నకు ఎప్పుడూ ఒకే అర్థం ఉండదు. బౌద్ధిక ఆస్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) రంగానికి చెందిన చాలా పదాల మాదిరిగానే, ‘ప్లాగరిజం’ కూడా ఆధునిక యుగానికి చెందిన భావనగా పరిణమించింది. భారతీయ లేదా అంతర్జాతీయ చలనచిత్రాల నుంచి కథలు, పాత్రలు, థీమ్‌లు, కథనాలను ‘అరువు తెచ్చుకోవడం’, ‘స్ఫూర్తి పొందడం’, ‘ప్రేరణ పొందడం’ లేదా ‘అడాప్ట్ చేసుకోవడం’ వంటివి హిందీ చలనచిత్ర పరిశ్రమలో కోకొల్లలుగా ఉన్నాయి.
చార్లీ చాప్లిన్ సినిమా సినిమాతో..
ఈ కోవలో ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం రాజ్ కపూర్ నిర్మించిన ‘శ్రీ 420’. చార్లీ చాప్లిన్ సినిమా ‘ట్రాంప్’ (అవసరాల కోసం తిరిగే వ్యక్తి) ఇమేజ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారనే విమర్శలను ఈ చిత్రం ఎదుర్కొంది. రాజ్ కపూర్, నర్గిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చోరీ చోరీ’ (1956) చిత్రం, క్లార్క్ గేబుల్, క్లాడియా కోల్బర్ట్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఇట్ హ్యాపెండ్ వన్ నైట్’ (1934)కి కాపీయే. ‘ఫిర్ సుభా హోగి’ (1958) చిత్రంలో రాజ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది దోస్తోవ్‌స్కీ రాసిన సామాజిక దృక్పథం కలిగిన ‘క్రైమ్ అండ్ పనిష్‌మెంట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. క్వెంటిన్ టరాంటినో చిత్రం ‘రిజర్వాయర్ డాగ్స్’కి రీమేక్‌గా వచ్చిన ‘కాంటే’ చిత్రంలో బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో బాలీవుడ్ పాటలు, నృత్యాలను జోడించారు.
నైతికపరమైన ఉల్లంఘన
1991లో మహేష్ భట్ దర్శకత్వంలో, ఆయన కూతురు పూజా భట్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో అదే (కాంటే) సినిమాకు ఆధునికత, గ్లామరస్ జోడించి ‘దిల్ హై కి మాన్తా నహీ’ వచ్చింది. కాపీకి మూలమైన చిత్రం లేదా దర్శకుడి పేరును టైటిల్స్‌లో పేర్కొంటే ‘ప్లాగరిజం’ చేసినట్లు కాదు. కానీ చాలా సందర్భాలలో ఇది జరగదు. అయినా వారు నైతికపరమైన నిజాయితీని ఉల్లంఘించినవారవుతారు (చట్టపరంగా కాకపోయినా). జాన్ అబ్రహాం, నానా పటేకర్ నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) చిత్రం, బెన్ అఫ్లెక్, శామ్యూల్ జాక్సన్ నటించిన ‘చేంజింగ్ లేన్స్’ (2002) ఆధారంగా తెరకెక్కిందని చెబుతారు.
మోహన్‌లాల్.. ‘నేరు’
పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ సినిమాలు ‘ప్లాగరిజం’ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటాయి. స్క్రిప్ట్‌లు, సన్నివేశాలు లేదా పాటలను కాపీ చేశారనే ఆరోపణలపై అనేక చిత్రాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయితే విదేశీ నిర్మాతలు, బ్యానర్లు వీటిని పట్టించుకోరు. దక్షిణాది రాష్ట్రాల సినిమాలు దీనికి మినహాయింపు కాదు. మలయాళ చిత్రం ‘నేరు’ (2023) విషయంలో, పిటిషనర్ దీపక్ ఉన్ని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. జీతూ జోసఫ్, మోహన్‌లాల్ తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో తాను ఇదివరకే వారికి చెప్పిన స్క్రిప్ట్ లోని ఆలోచనలను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన ‘నేరు’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించింది. ఇక్కడ చిత్రంలో మోహన్‌లాల్ పెద్ద స్టార్‌గా ఉండటమే కారణం కావచ్చని అంటారు.
కమల్ హాసన్.. ‘పాపనాశం’
కమల్ హాసన్ కూడా తన కొన్ని సినిమాల్లో ‘ప్లాగరిజం’ ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణ ‘పాపనాశం’. ‘ఒరు మజక్కాలతు’ నవల కాపీరైట్‌లను ఉల్లంఘించారంటూ సతీష్ పాల్ నిర్మాతలు, దర్శకుడు జీతూ జోసఫ్‌పై దావా వేశారు. అయితే చిత్ర నిర్మాతలు, కమల్ హాసన్ మద్దతుతో దర్శకుడు జీతూ జోసఫ్ ఆ కేసును విజయవంతంగా ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సిన్హా నటించిన తమిళ చిత్రం ‘లింగా’పై మధురైకి చెందిన చిత్రనిర్మాత కె.వి. రవి రత్నం ఇది తన అసలు కథ అని ఆరోపించారు. అయితే ‘లింగా’ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, రజనీకాంత్ స్వయంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ‘లింగా’ పొన్‌కుమరన్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు.
ముంబై ఫిలింమేకర్స్ మాట ఇదే..
జాతీయ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం ‘బ్యారి’ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కొంది. చివరకు రచయిత్రి సారా అబూబక్కర్ నవలను అనధికారికంగా అడాప్ట్ చేసుకున్నందుకు ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అలాగే మ్యూజికల్ సిమిలారిటీకి సంబంధించి కాపీరైట్ క్లెయిమ్‌ల కారణంగా ‘కాంతారా’ చిత్రం హిట్ ట్రాక్ ‘వరాహ రూపం’ చట్టపరమైన ఆంక్షలు ఎదుర్కొంది. లక్ష్మణ్ దర్శకత్వం వహించి జయం రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ చిత్రం 2017లో ‘ప్లాగరిజం’ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ భారతీయ చలనచిత్ర విశ్లేషకుడు ఎంకే రాఘవేంద్ర రాసిన ‘ప్లాగిరిజంగ్ ఫర్ బాలీవుడ్’ అనే పత్రం ప్రకారం ‘పాపులర్ ఇండియన్ సినిమా హాలీవుడ్‌ను అనుకరిస్తుందని భావిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పశ్చిమ దేశాల సినిమాలతో పోలిస్తే తమ చిత్రాల కంటెంట్, ఫార్మాట్ భిన్నంగా ఉంటాయని ముంబై ఫిలింమేకర్స్ చెబుతున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంలో నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే హాలీవుడ్ ‘కాపీ’ చిత్రాలు విజయవంతం కావాలంటే ఆ చిత్రాల్లో భారతీయుల తీరు తెన్నులను, ఇక్కడి సంస్కృతిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. అయితే ఇతరుల భావాలు, కాన్సెప్ట్‌ల ద్వారా ‘స్ఫూర్తి’ పొందడాన్ని, వాటికి భాష, సాంస్కృతిక కోణాలు, భారతీయతను జోడించి సినిమాలు తీయడాన్ని రాఘవేంద్ర సైద్ధాంతికంగా వ్యతిరేకించ లేదు.
ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్?


