యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, శ్రీలీల కలసి హిందీలో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు ఉమేష్ బిష్ట్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో కూడిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేశారట. ఏక్తా కపూర్, గునీత్ మోంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ఈ చిత్రంలోనే జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఒకే అబ్బాయిపై ఇద్దరు అమ్మాయిలు విపరీతమైన ప్రేమ పెంచుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బీ టౌన్ టాక్.
అలాగే ఈ చిత్రంలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. కాగా, ఈ సినిమాలో హీరోగా నటించే యాక్టర్ కోసం దర్శక–నిర్మాతలు పలువురి యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఓ హీరోను ఫైనలైజ్ చేసి, సినిమాను అధికారికంగా ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారని భోగట్టా. మరి... ఇద్దరు అమ్మాయిల ప్రేమను పొందగలిగే ఆ హీరో ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... హిందీలో శ్రీలీల ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ సరసన ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఫిక్స్ అయితే... బాలీవుడ్‌లో మరో ప్రేమకథా చిత్రం శ్రీలీల డైరీలో ఉంటుంది.


