ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా! | Tollywood Directors and Producers Busy Hunting for Heroines | Sakshi
Sakshi News home page

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!

Aug 9 2026 12:34 AM | Updated on Aug 9 2026 12:34 AM

Tollywood Directors and Producers Busy Hunting for Heroines

సెట్స్‌కు వెళ్లడానికి హీరో రెడీ. స్టార్ట్‌... కెమెరా... యాక్షన్‌ చెప్పడానికి దర్శకుడు రెడీ. బడ్జెట్‌ కేటాయించేందుకు ప్రోడ్యూసర్‌ రెడీ. కానీ హీరోయిన్‌ మాత్రం నాట్‌ రెడీ. అవును... ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల పరిస్థితి ఆల్మోస్ట్‌ ఇదే. తమ హీరోకు సరిగ్గా సెట్‌ అయ్యే హీరోయిన్‌ వెతుకులాటలో బిజీగా ఉన్నారు దర్శక–నిర్మాతలు. ఈలోపే  ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్‌ అంటూ... కొన్ని గాసిప్స్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరి... ఏయే హీరోకి ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!’ చూద్దాం... ఎవరెవరు జోడీ కడతారో మరి...

ముచ్చటగా మూడోసారి 
‘ఖిలాడి’, ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ డింపుల్‌ హయతి ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారా? అంటే... ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్‌ గోలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాకు ‘వీరాధి వీరులు కేరాఫ్‌ మహిళా మండలి’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్‌.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్నది చిత్రయూనిట్‌ ప్లాన్‌ అట. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను స్టార్ట్‌ చేయాలని హసిత్‌ గోలి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట హసిత్‌. ఇందులో భాగంగానే రవితేజకు జోడీగా నటించేందుకు డింపుల్‌ హయతిని సంప్రదించారని తెలిసింది.

మరి... మూడోసారి కూడా రవితేజ–డింపుల్‌ల జోడీ సెట్‌ అవుతుందా? చూడాలి. అలాగే శ్రీ విష్ణుకు జోడీగా ఓ యంగ్‌ నటి కనిపిస్తారట. మరోవైపు రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ఈ ఆగస్టు 21న విడుదల కానుంది. అలాగే వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

దీపిక ప్లేస్‌లో ఆలియా? 
ప్రభాస్‌ ప్రస్తుతం ‘స్పిరిట్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ లోని ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్‌ ‘కల్కి 2898 ఏడీ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్‌. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం అయిన కమల్‌హాసన్, అమితాబ్‌ బచ్చన్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. త్వరలోనే ప్రభాస్‌ కూడా షూట్‌లో జాయిన్‌ అవుతారు. అయితే ఈ మూవీలోని మరో ప్రధానమైన లీడ్‌ రోల్‌ను ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్‌ 1లో దీపికా పదుకోన్‌ చేశారు. కొన్ని కారణాల వల్ల ‘కల్కి 2’లో దీపికా పదుకోన్‌ నటించడంలేదని చిత్రయూనిట్‌ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో దీపిక పదుకోన్‌ ప్లేస్‌లో ఎవరు నటిస్తారు? అనే చర్చ ఎప్పట్నుంచో జరుగుతోంది. తొలుత సాయి పల్లవి, కీర్తి సురేష్‌ వంటి హీరోయిన్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటివలి కాలంలో ఆలియా భట్‌ పేరు వినిపిస్తోంది. త్వరలో ప్రభాస్‌తో పాటు  లీడ్‌ హీరోయిన్‌ కూడా సెట్స్‌లో పాల్గొనాల్సి ఉందట. దీంతో దీపిక ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు? అనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం లేక పోలేదు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ‘కల్కి 2’ సినిమా 2027 చివర్లో రిలీజ్‌ అవుతుందని టాక్‌.

గాడ్‌ ఆఫ్‌ వార్‌లో... 
‘అరవిందసమేత వీరరాఘవ’ (2018) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. 
ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రానుంది. ఈ చిత్రానికి ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్‌. లార్డ్‌ కుమారస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్‌  పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్‌తో సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు మేకర్స్‌ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని, ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ‘డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు ఎనీ్టఆర్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

చరణ్‌కు జోడీగా... 
‘రంగస్థలం’ వంటి సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘ఆర్‌సీ 17’ (వర్కింగ్‌ టైటిల్‌). రామ్‌చరణ్‌ కెరీర్‌ లోని 17వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఏడాదిన్నర క్రితమే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణతో రామ్‌చరణ్‌ బిజీగా ఉండటం వల్ల ‘ఆర్‌సీ 17’ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదే ప్రారంభించాలని అనుకున్నారు మేకర్స్‌.  కానీ ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్‌ చేతికి గాయమైంది. దీంతో ఇటీవల కోయంబత్తూరులో చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు రామ్‌చరణ్‌.

ఈ గాయం నుంచి కోలుకుని తిరిగి రామ్‌చరణ్‌ షూట్‌లో పాల్గొనేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్‌.

 ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగు తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై కూడా సుకుమార్‌ దృష్టి సారించారట. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లును పరిశీలిస్తున్నారు మేకర్స్‌. సమంత, రష్మిక మందన్నా వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా రుక్మిణీ వసంత్‌ పేరు తెరపైకి వచి్చంది. మరి... రామ్‌చరణ్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌నే నటిస్తారా? వేచి చూడాల్సిందే.

రాకాలో నలుగురు నాయికలు? 
అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ ఒక హీరోయిన్‌గా కన్ఫార్మ్‌ అయ్యారు. అయితే ఇందులో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, దీంతో ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్‌కు చాన్స్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మిక మందన్నా ఈ చిత్రంలోని ఇతర హీరోయిన్‌ రోల్స్‌కు ఫైనలైజ్‌ అయ్యారని, ఆల్రెడీ ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఈ ముగ్గురూ పాల్గొంటున్నారని టాక్‌.

అయితే జాన్వీ, రష్మిక, మృణాల్‌లు ఈ సినిమాలో భాగమైన అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.పైగా రష్మిక ఈ చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారట. దీంతో ఆమె ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించక పోవచ్చట. మరి... అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించే హీరోయిన్స్‌ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్‌ కానుందనే ప్రచారం జరుగుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘ధురంధర్‌’ తరహాలో తక్కువ టైమ్‌ గ్యాప్‌లోనే  ‘రాకా’ రెండు భాగాలు రిలీజ్‌ కానున్నాయని సమాచారం.

రోమియో ప్రేయసి... 
నాని తాజా సినిమా ‘ది ప్యారడైజ్‌’. ‘దసరా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఈ సెప్టెంబరు 24న రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే కాస్త గ్యాప్‌ తీసుకుని, ఆ తర్వాత సుజిత్‌ డైరెక్షన్‌లోని ‘బ్లడీ రోమియో’ సినిమాలో నటిస్తారు నాని. అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. 

ముందుగా హైదరాబాద్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్స్‌ జరుగుతాయని తెలిసింది. కానీ... ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ మాత్రం లండన్‌లో ప్లాన్‌ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అన్నది ఇంకా ఫైన లైజ్‌ కాలేదు. ప్రస్తుతానికి భాగ్యశ్రీ భోర్సేను అనుకుంటున్నారట మేకర్స్‌. ఇప్పటికే ఆమెతో చిత్రయూనిట్‌ సంప్రదింపులు జరిపిందని, ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదలై, నాని ‘బ్లడీ రోమియో’ షూట్‌ను స్టార్ట్‌ చేసిన తర్వాత భాగ్యశ్రీ ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. 

ఇక ఈ సినిమా ఫుడ్‌ మాఫియా నేపథ్యంలో సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఉండబోతోందని ఇటీవల రిలీజైన ఈ సినిమా కంటెంట్‌ పరోక్షంగా స్పష్టం చేస్తోంది. నానికి చెందిన నిర్మాణ సంస్థ యునానిమస్‌ ప్రోడక్షన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై వెంకట్‌ బోయనపల్లి ఈ ‘బ్లడీ రోమియో’ను నిర్మించనున్నారు. 2027లో ఈ సినిమా విడుదల కానుంది.

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాలో... 
రామ్‌ హీరోగా నటిస్తూ, కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రా పో 23 (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్‌ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ సాంగ్‌ను, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు రామ్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మేకర్స్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, హీరోయిన్‌ పాత్రకు శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్‌ పేర్లను పరిశీలించారట. సంయుక్త ఆల్మోస్ట్‌ ఖరారు అయ్యారనే టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌ అనుకున్న సమయానికి ప్రారంభం కాని కారణంగా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. అంటే... ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ అవుతుందని చెప్పాచ్చు.

ఎల్లమ్మ..! 
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రానికి ‘బలగం’ ఫేమ్‌ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్రకు తొలుత కీర్తి సురేష్‌ను అనుకున్నారట. కానీ ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయి పల్లవి, మృణాల్‌ ఠాకూర్, మమితా బైజు వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఇప్పటివరకు ఎవరూ ఫైనలైజ్‌ కాలేదు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్‌ గురించి అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది.

నో హీరోయిన్‌!
ఒకవైపు కొన్ని సినిమాల్లో హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంటే ఒక సినిమాకి మాత్రం హీరోయినే అక్కర్లేదట. ఎందుకంటే అసలు హీరోయిన్‌ లేకుండానే ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం.  అల్లు అర్జున్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలో మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కొంతమంది బాలీవుడ్‌ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్రకు పెద్దగా స్కోప్‌ లేక పోవడంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రనే తొలగించాలని మేకర్స్‌ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ఇంకా మరికొందరు తెలుగు హీరోలు నటించనున్న మరికొన్ని కొత్త సినిమాల్లో హీరోయిన్‌ ఫైనలైజ్‌ కాలేదు.

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement