డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఒక లేడీ కిలాడీ హనీ ట్రాప్ దందా ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పల్లవి సింగ్ రాజ్‌పుత్ అనే మహిళ డేటింగ్ యాప్ టిండర్ (Tinder), ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పురుషులతో పరిచయం పెంచుకుని, ఆపై వారిని బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఒక హైకోర్టు లాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హనీట్రాప్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది .విచారణలో విషయాలు తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.
పల్లవి సింగ్ రాజ్‌పుత్ అనే మహిళ టిండర్ ద్వారా పురుషులకు వల వేసి, స్నేహం నటించేది. ఆ తర్వాత వారితో దగ్గరయ్యేది. ఇక్కడే తన ప్లాన్ అమలులో కీలకమైన అడుగు వేసేది. తనకు పరిచయమైన వారితో సన్నిహితంగా ఉంటున్న సమయాల్లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేదని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలు, ఫోటోలు చూపించి బాధితులను బెదిరిస్తూ ఇప్పటివరకు దాదాపు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. అంతేకాదు తాను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులు పెడతానని బెదిరించేది. ఈమె ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే ఐదుగురు జైలుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
నకిలీ ప్రొఫైళ్లు
పల్లవి "స్వీటీ తివారి" అనే పేరుతో సహా వివిధ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఉపయోగించి కొత్తవారిని బురిడీ కొట్టించేదని మరొక ఫిర్యాదులో వెల్లడైంది. ఈమెకు మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరిస్తున్నారని సమాచారం.
ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!
సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
ఈ కేసువెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించి మంచంపై పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పేర్చి ఉన్న ఫొటోలు, అలాగే ఒక మహిళ చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. అయితే, ఈ ఫొటోల విశ్వసనీయతను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోది చేసి ముమ్మర దర్యాప్తు జరుపు తున్నారు.
ఇదీ చదవండి: 26 ఏళ్ల మిలియనీర్ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్


