మోదీతో తొలి భేటీ.. రాఘవ్‌ చద్దా ఎమోషనల్‌ | AAP MP Raghav Chadha Shares Emotional Post After Meeting PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీతో తొలి భేటీ.. రాఘవ్‌ చద్దా ఎమోషనల్‌

Aug 8 2026 1:50 PM | Updated on Aug 8 2026 2:09 PM

Raghav Chadha Emotional Post After Meet PM Modi

రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో తొలిసారి భేటీ అయిన ఆయన.. ఆ భేటీ సారాంశాన్ని సోషల్‌ మీడియాలో భావోద్వేగంగా ప్రదర్శించారు. ఈ సమావేశం తనకు ఎంతో విలువైన అనుభూతిని ఇచ్చిందని.. ఈ ఉదయాన్ని తన జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వ్యాఖ్యానించారు.

"ఎప్పటికీ గుర్తుండిపోయే ఉదయం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ జీని కలిసే అవకాశం లభించింది. సుదీర్ఘమైన, ఎంతో ఉపయోగకరమైన చర్చ జరిగింది. ఆయన విలువైన సమయం కేటాయించినందుకు, ఆయన ఆలోచనలు, మార్గదర్శకత్వం పొందే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు" అంటూ రాఘవ్‌ చద్దా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

ఆప్‌ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్‌ చద్దా.. మోదీని కలిసిన ఈ ఉదయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొనడం గమనార్హం. ప్రధానితో జరిగిన ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేదంటే రాఘవ్‌ చద్దాకు పార్టీలో మరింత కీలక బాధ్యతలు దక్కే సంకేతమా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.

రాఘవ్‌ చద్దా.. ఒకప్పుడు ఆప్‌లో ఉన్నప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌లతో నెటిజన్ల దృష్టిని.. మరీ ముఖ్యంగా జెన్‌జీ దృష్టిని ఆకర్షించారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్‌ చద్దా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీక్‌ల అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆయన మద్దతుగా మాట్లాడారు.

నీట్‌ నిరసనలపై ఎందుకు మౌనంగా ఉన్నాడో అనేదానిపైనా ఆయన పార్లమెంట్‌లో వివరణ ఇచ్చుకున్నారు. తన రోల్‌ మారిందని.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో తాను లేనని చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్‌ లీక్‌ వ్యవస్థపై కఠిన చర్యలు అవసరమని, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల పారదర్శకత కోసం కఠిన చట్టాలు, వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్న ప్రభుత్వ వైఖరికి ఆయన మద్దతు తెలిపారు.

బీజేపీలో చద్దా పాత్రపై ఆసక్తి
రాఘవ్‌ చద్దా–మోదీ భేటీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటున్నారు. కీలక విధాన అంశాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా.. ఒకప్పుడు భిన్న రాజకీయ వేదికపై ఉన్న రాఘవ్‌ చద్దా ఇప్పుడు బీజేపీ నేతగా ప్రధాని మోదీని కలవడం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపుగా కనిపిస్తోంది.

యువతకు మోదీ భరోసా
మరోవైపు, ఇవాళ ఢిల్లీలోని ఐఐటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతపై విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారత్‌ (వికసిత్‌ భారత్‌) లక్ష్యాన్ని సాధించడంలో యువత శక్తి, ప్రతిభ కీలకమని అన్నారు. యువతలో ఉన్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని ప్రధాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement