తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్‌ల మధ్య రాజకీయ పెనుగులాట ఆసక్తికరంగా ఉంది. మూడో పక్షం బీజేపీ అధికార సాధన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకైతే ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు,ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో హైడ్రా ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల అమ్మకం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించినా అందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తుంది.
ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందన్నది చర్చగా ఉంది. ప్రభుత్వంపై కాని, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాని ఆరోపణలు వస్తున్న తీరు రేవంత్ కు చికాకు కలుగుతుండవచ్చు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆధారపడి రాజకీయాలను నడుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జనంలో తిరగకుండా, వెనుక ఉండి పార్టీని నడుపుతున్నారు. ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా కేటీఆర్, హరీష్ రావులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ఆందోళనలకు సన్నద్దమవుతున్నారు. రేవంత్ ప్రసంగాలలో ఏ మాత్రం తప్పులు దొర్లినా వెంటనే అందుకుని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్, హరీష్ రావు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రభుత్వపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.
ఈ క్రమంలో కొన్నిసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం ఇంజనీర్లందరిని కించపరచడం కాకపోవచ్చు. ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కోల్పోతోందని చెప్పాలన్నది ఆయన భావన. అందులో కొంత నిజం ఉంది. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల సుమారు 60 కాలేజీలు మూతపడ్డాయట. లెక్చరర్లు మంచి విద్య అందించాలని చెప్పడం తప్పు కాదు. కాని అసలు ఆ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని అనడం విమర్శలకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బందులలో పడుతున్నారు. హైడ్రాను సమర్ధించడానికి హిట్లర్‌తో పోల్చుకోవడం, ఇరాన్ యుద్ద విధ్వంసాన్ని ప్రస్తావించడం వంటివి చేశారు.
ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో అయినా కొన్ని ప్రమాణ లోపాలు ఉండవచ్చు. కాని అంతమాత్రాన దానిని క్రిమినల్ వేస్ట్ అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. అలాగైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా! ఇంజనీరింగ్ విద్యను లక్షలాది మంది చదువుకున్నారు కాబట్టే దేశంలోకాని, ఇతర దేశాలలో కాని మనవాళ్లు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారన్న సంగతిని గ్రహించాలి. రేవంత్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవడానికిబీఆర్ఎస్ నేతలు అన్ని వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణలోని యువతను అవమానించే రీతిలో రేవంత్ మాట్లాడారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్లికేషన్ రాయలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారంటున్న రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్ ను పూర్తి చయగలరా అని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు . ఆ తర్వాత రేవంత్ పై కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు.
రేవంత్ ఇంజీనిరింగ్ విద్యను వేస్ట్ అనడాన్ని ఎవరూ సమర్దించరు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ ను అదే మాట అనడం కరెక్టు కాదని చెప్పాలి. తమను వ్యక్తిగతంగా అటాక్ చేస్తే తామూ అదే చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కొంత హద్దులు మీరి ఇరువైపులా విమర్శలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంజీనర్లకు మద్దతు ఇస్తూ రాకెట్ పంపుతున్నవారిని అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జెన్ జి, కాక్రోచ్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నా, తెలంగాణకు వచ్చేసరికి అదికారంలో అదే పార్టీ ఉండడంతోబీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వాడుకుంది. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులతో సంగ్రామ్ పేరుతో ఒక భారీ సభను నిర్వహించారు. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడాన్ని తన నోట్ లో తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జీషీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం యువతను ఆకర్షిస్తే తమకు అధికారం రావడం ఖాయమనిబీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రేవంత్ వ్యాఖ్య వారికి అందివచ్చినట్లయిందనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో రేవంత్ కోర్టు ఆదేశాలను పాటించడానికి ఇష్టపడడం లేదని అర్దం అవుతుంది. రంగనాధ్ ను బదిలీ చేయాలని హైకోర్టు సూచించినా ,అది ప్రభుత్వ విచక్షణాధికారమన్న భావనలో రేవంత్ ఉన్నారనుకోవాలి.
అదే టైమ్ లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల అమ్మకం ద్వారా అరవైవేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు దీనిని వాడవచ్చన్నది ప్రభుత్వ వర్గాల భావన. అయితే ఈ భూములను అమ్మడానికి అవకాశం లేదన్నది విపక్షం వాదనగా ఉంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉండడం, ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేకపోవడం, మెట్రో రైలు రుణం వ్యవహారం మొదటికి రావడం ఇలా అనేక సమస్యలు ఉన్న తరుణంలో నిజంగానే ఈ భూములను అమ్మే అవకాశం వస్తే అది ప్రభుత్వానికి జాక్ పాట్ అవుతుంది.కాని మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి.
ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను చెల్లించవలసిన సుమారు 400 కోట్లకు పైగా రుణాన్ని తీర్చివేశారట.ఇది ఎలా సాధ్యమైందని,దానిపై విచారణ చేయించగలరా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటింగ్ ఏజెంట్లుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఆయా శాఖలలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఇవన్ని ఒక చక్రబంధం వంటివి. వీటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోవాలని అదికార కాంగ్రెస్ యత్నిస్తుంది. కాని ఆ చక్రబంధంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికిబీఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే తేల్చుతుంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


