పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు..: బాబుపై బుగ్గన ఫైర్‌ | Buggana Rajendranath Slams Chandrababu Naidu Over White Paper in Hyderabad | Sakshi
Sakshi News home page

పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు..: బాబుపై బుగ్గన ఫైర్‌

Aug 8 2026 11:40 AM | Updated on Aug 8 2026 12:15 PM

Buggana Fresh Attack on Kutami Govt Over CBN Whitepaper

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలను ప్రతిబింబించేవి కావని.. అవి కేవలం రాజకీయ జిమ్మిక్కులేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అంటున్నారు. ఆయన మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా చంద్రబాబు హామీలు ఇస్తారని, కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ప్రొగ్రెస్‌ కార్డు అనే కాన్సెప్ట్‌ తెచ్చిన చంద్రబాబు.. అది తనకు తానే ఇచ్చుకుంటున్నాడని, కానీ అది ఇవ్వాల్సింది ప్రజలని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

‘హైదరాబాద్‌ను కడితే.. కుతుబ్‌ షా ఏం చేసినట్లు?’
చంద్రబాబు హైదరాబాద్‌ అభివృద్ధి గురించి చెప్పుకునే తీరుపై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. “చంద్రబాబు హైదరాబాద్‌ను కడితే.. కుతుబ్‌ షా ఏం చేసినట్లు? చంద్రబాబు బిర్యానీ కనిపెడితే.. ఇరానీయులు ఏం చేసినట్లు?. అందరినీ అమెరికాకు తానే పంపానని అంటారు.. ఇతర రాష్ట్రాల వాళ్లను కూడా ఆయనే పంపారా?” అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు చూస్తే ఇతర దేశాల్లో అయితే ఆయనను పబ్లిక్‌ లైఫ్‌ నుంచి వెల్లగొట్టేవారని బుగ్గన అన్నారు.

వాళ్లను అడిగితే సరిపోదా?.. 
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని బుగ్గన సూచించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో మహిళలను అడిగితే చెబుతారని, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విమర్శించారు. ఆయన సభలకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.

ఆరోగ్యశ్రీపై విమర్శలు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావడం లేదని బుగ్గన ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జగన్‌ జనాదరణపై వ్యాఖ్యలు
చంద్రబాబు మీటింగ్‌ పెడితే జనం మధ్యలో వెళ్లిపోతున్నారన్న బుగ్గన.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని అంటున్నారు. అది చూసి చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఇంకా ఆదరణ ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement