వెట్టిచాకిరీ చేయలేదని సస్పెండ్‌ చేశారు | Woman Home Guard Suspended After Refusing Domestic Work, Krishna Police Deny Allegations | Sakshi
Sakshi News home page

వెట్టిచాకిరీ చేయలేదని సస్పెండ్‌ చేశారు

Aug 8 2026 9:22 AM | Updated on Aug 8 2026 10:15 AM

Woman Home Guard  Incident In AP

పెనమలూరు/కోనేరుసెంటర్‌: పోలీస్‌ శాఖలో వెట్టిచాకిరీ వ్యవహారంపై తీవ్ర చర్చకు దారితీసిన అంశమిది. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేసిన రూపకళ గురువారం యనమలకుదురులో మీడియాతో మాట్లాడుతూ వెట్టిచాకిరీ చేయడానికి నిరాకరించానని తనను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ‘భర్త మృతి చెందటంతో నాకు హోంగార్డు పోస్టు ఇచ్చారు. గన్నవరం డివిజన్‌ పెనమలూరు పీఎస్‌లో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల 14వ తేదీన హోంగార్డు కార్యాలయం నుంచి సాల్‌మన్‌ అనే కానిస్టేబుల్‌ ఫోన్‌ చేసి ట్రైనింగ్‌ ఉందని రమ్మని చెప్పడంతో 15వ తేదీన వెళ్లి కలిశాను.

 మాచవరంలో ఐజీ ఉంటారని అక్కడ పని చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్నానని వెళ్లలేనని చెప్పాను. దీనిని మనసులో పెట్టుకుని అప్పటి నుంచి నిన్నటి వరకూ ప్రతిరోజూ మచిలీపట్నం తిప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడ గడ్డి పీకించారు. ఆర్‌ఐని కలిసి నాకు ఆరోగ్యం బాగాలేదని మెడికల్‌ డాక్యుమెంట్లు చూపాను. ఆర్‌ఐ న్యాయం చేయకపోవటంతో గన్నవరం సర్కిల్‌లో హోంగార్డు విధులు పర్యవేక్షించే గుప్తాను కలిశాను. సొమ్ము ఇస్తే పనులు అవుతాయని గుప్తా చెప్పారు. నా నెల జీతం రూ.20 వేలేనని, సొమ్ము ఇవ్వలేనని చెప్పాను. దీంతో అక్కడి నుంచి నన్ను పంపించేశారు.

ఉద్యోగం పీకేస్తానని ఎస్పీ బెదిరించారు
న్యాయం కోసం ఎస్పీని కలిసాను. ఆయన కూడా సీ క్యాటగిరీలో ఉన్న వారు ఇళ్లల్లోనే పని చేయాలని చెప్పారు. తన అర్హతను చూసి పోలీస్‌స్టేషన్‌కు కేటాయించారని, తన పరిస్థితి అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరితే ఉద్యోగం పీకేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో బుధవారం హోంగార్డ్‌ ఆఫీసులో నాకు ఒక పేపర్‌ ఇచ్చి, అందులో ఏముందో కూడా చదువుకునే అవకాశం లేకుండా సంతకం చేయించుకున్నారు. తర్వాత సస్పెన్షన్‌ ఆర్డర్‌ చేతిలో పెట్టారు. ఆదేశించిన మేరకు ట్రైనింగ్‌కు హాజరు కాలేదని ఆరోపించారు’ అని కన్నీంటి పర్యంతమయ్యారు. అధికారుల ఇళ్లల్లో పని చేయాలంటే వ్యక్తిగత పనులు, వెట్టి చాకిరి చేయాల్సిందేనని రూపకళ ఈ సందర్భంగా వివరించారు. ‘పిల్లలతో కాలకృత్యాలు తీర్పించి వారికి స్నానాలు చేయించాలి. బాత్‌ రూమ్‌లు కడగాలి. వృద్ధులు ఉంటే డైపర్లు మార్చాలి. వంట చేయాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

చేయాల్సిందే..
మహిళా హోంగార్డు చేసిన ఆరోపణలను కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఓ ప్రకటనలో ఖండించింది. సి–కేటగిరికి ఎంపికై న హోంగార్డులు గార్డెనింగ్‌, టైలరింగ్‌, శానిటేషన్‌ తదితర విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని, పోలీస్‌స్టేషన్‌లలో మాత్రమే పనిచేస్తానని భీష్మిస్తే కుదరదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement