హెరిటేజ్‌ కోసమే చలసానిపై లోకేష్‌ కుట్ర: పేర్ని నాని | Perni Nani Alleges Red Book Rajyam Behind Vijaya Dairy Chairman’s Resignation, Accuses Lokesh Of Targeting Dairy | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ కోసమే చలసానిపై లోకేష్‌ కుట్ర: పేర్ని నాని

Aug 8 2026 8:58 AM | Updated on Aug 8 2026 11:35 AM

Perni Nani React On Vijaya Dairy Chalasani Resign

కృష్ణా జిల్లా: విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. విజయ డెయిరీని దెబ్బతీసి హెరిటేజ్‌ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మంత్రి నారా లోకేష్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కంచే చేను మేసిన చందంగా లోకేష్‌ తీరు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆంజనేయులు రాజీనామా అంశంపై పేర్ని నాని తాజాగా స్పందిస్తూ.. సహకార సంఘాల ద్వారా నిర్మితమై విజయవంతంగా కొనసాగుతున్న విజయ డెయిరీని లోకేష్‌ ధనదాహం, అధికార మదంతో దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యాపార లావాదేవీలతో విజయ డెయిరీ బలమైన సంస్థగా ఎదిగిందని, దాని విలువైన ఆస్తులను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహకారంతో మండవ జానకిరామయ్య హయాంలో విజయ డెయిరీ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 2019-24 మధ్య సహకార సంఘాల ద్వారా కొనసాగుతున్న డెయిరీ అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మండవ జానకిరామయ్య బాటలోనే చలసాని ఆంజనేయులు కూడా విజయ డెయిరీ అభివృద్ధికి సేవలు అందించారని చెప్పారు.

చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ ఉందని ఆరోపించారు. సహకార సంఘాల సభ్యుల ద్వారా ఎన్నికైన చైర్మన్‌ను పదవి నుంచి తప్పించేందుకు మంత్రులకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులును ఐసీయూలోనే బెదిరించి రాజీనామా చేయించారని, రాజీనామా చేయకపోతే అక్రమ కేసులు పెట్టి ఆయన కుమార్తె, కుమారుడిని అరెస్టు చేయిస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. కూటమి నేతల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే ఆంజనేయులుకు గుండెపోటు వచ్చింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలపైనా అదే విధానాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు.

పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలతో విజయవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని బలహీనపరిచి హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు. సహకార సంఘాల ద్వారా సమర్థవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెయిరీపై కుట్రలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement