రాజకీయ ఈర్ష్యతో ‘దిశ’ రద్దు దురదృష్టకరం | YS Jagan Mohan Reddy on Disha cancellation | Sakshi
Sakshi News home page

రాజకీయ ఈర్ష్యతో ‘దిశ’ రద్దు దురదృష్టకరం

Aug 8 2026 5:27 AM | Updated on Aug 8 2026 5:27 AM

YS Jagan Mohan Reddy on Disha cancellation

చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం మహిళలు, చిన్నారులకు చీకటి రోజు    

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

మహిళల భద్రతకు అత్యంత రక్షణగా నిలిచిన వ్యవస్థ 

మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారం

ఫోన్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా, ఫోన్‌ను ఐదు సార్లు షేక్‌ చేసినా పోలీసులకు సమాచారం

తక్షణ స్పందన, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ప్రత్యేక కోర్టులు, సత్వర న్యాయం

చంద్రబాబు సర్కారు ‘దిశ’ ఉపసంహరణ ద్వారా నేరస్తుల్లో చట్టంపై తగ్గనున్న భయం  

తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

దిశను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి

సాక్షి, అమరావతి: మహిళల భద్రతలో దేశానికే దిశా నిర్దేశం చేసిన ‘దిశ’ను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్య తో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మంత్రివర్గం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి హితవు పలుకుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శుక్రవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మహిళలు, చిన్నారులకు రక్షణ వ్యవస్థగా నిలిచిన ‘దిశ’
‘దిశ’ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్ర­భు­త్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర‡్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘దిశ’ను తీసుకొచ్చింది.

నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యా­ప్తు, ఫోరెన్సిక్‌ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా, ఫోన్‌ను ఐదు సార్లు షేక్‌ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘దిశ’ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం.

 ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్‌ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్‌ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్‌ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్‌ను రూపొందించాం. అందుకనే ‘దిశ’ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అందించింది. 

నిందితుడికి శిక్షపడే వరకూ రక్షణ నెట్‌వర్క్‌ 
2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్‌ఏ నివేదికలకు నెలలు పట్టేది. ‘దిశ’ ఫోరెన్సిక్‌ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. 

మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి. ఇదీ ‘దిశ’ ఇచ్చిన భరోసా.. ఇవీ ‘దిశ’ సాధించిన ఫలితాలు. అందుకే 19 జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో ‘దిశ’ గెలుచుకుంది. ‘దిశ’ అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ ఎస్‌వోఎస్‌ నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్‌వర్క్‌.

నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గిస్తోంది 
‘దిశ’ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ‘దిశ’ను రద్దు చేయడం కాదు– రక్షించాలి. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు–మరింత బలోపేతం చేయాలి.

న్యాయం అనే లక్ష్యానికి బీఎన్‌ఎస్‌ ఎలా ప్రత్యామ్నాయం?
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ‘బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు’ అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌వోఎస్‌ వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్‌లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటా బేస్, వేగవంతమైన ఫోరెన్సిక్‌ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తుతో కూడిన న్యాయం అనే లక్ష్యానికి బీఎన్‌ఎస్‌ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు ఏడు పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్ షీట్‌ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా ‘దిశ’ ద్వారా తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. 

21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే. దర్యాప్తులో జాప్యం ఉండకూడదు.. విచారణలో ఆలస్యం ఉండకూడదు.. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి.. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పు పట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?

1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్‌ డౌన్‌లోడ్‌
31,607 అత్యవసర కాల్స్‌ పరిష్కారం
18 ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లు.. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు
13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్‌ వ్యవస్థ
900 ద్విచక్ర వాహనాలు, 
163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్‌
ఆరు నగరాల్లో ఫోరెన్సిక్‌ వ్యవస్థ బలోపేతం, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు
2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్‌ 
అందువల్లే ‘దిశ’తో గొప్పగా భద్రతా సేవలు.. 19 జాతీయ అవార్డులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement