ఫీజుల ఒత్తిడి తాళలేక ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | Unable to bear the pressure of fees Inter student commits dead | Sakshi
Sakshi News home page

ఫీజుల ఒత్తిడి తాళలేక ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Aug 8 2026 5:12 AM | Updated on Aug 8 2026 5:12 AM

Unable to bear the pressure of fees Inter student commits dead

కాకినాడ జిల్లాలో విషాదం 

కాకినాడ క్రైం: కాకినాడలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు జె.రామారావుపేట సమ్మెట వారి వీధికి చెందిన విద్యార్థి (16) స్థానిక శాంతినగర్‌లోనిఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్‌ ఫీజు గడువు ముగిసింది. అయితే, శుక్రవారం విద్యార్థి తన తండ్రితో కలిసి ఫీజు చెల్లించేందుకు వెళ్లాడు. కళాశాల యాజమాన్యం, ఆలస్యం అయిందని కట్టించుకునేందుకు ప్రధాన కార్యాలయ అనుమతి కావాలని, రేపు రావాలని చెప్పా­రు. దీంతో ఇద్దరు ఇంటికి బయల్దేరారు. మార్గ మధ్యంలో తండ్రి తాను పనిచేస్తున్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళతానని, ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని కుమారుడిని పంపేశా­డు. 

ఇంటికి వెళ్లిన విద్యార్థి, ఇంట్లో ఫ్యానుకు తన తల్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి అతడి అన్నయ్య గమనించి కాకినాడ జీజీహెచ్‌కు తరలించాడు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ వేధింపులు, ఫీజు ఒత్తిడి వల్లే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫీజుల కోసం విద్యార్థిని పొట్టనబెట్టుకున్నారని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆత్మహత్య ఘటనపై కాకినాడ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement