మృతదేహంతో పాఠశాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల ధర్నా
రూ.50వేల సాయం అందించి చేతులు దులుపుకొన్న కేఆర్‌పురం ఐటీడీఏ పీవో
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన బాలికోన్నత పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందింది. మండలంలోని చిట్టంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పాఠశాలకు ఆనుకుని ఉన్న మరో భవనంలో ఆరబెట్టిన దుస్తులు తీసుకునేందుకు వెళ్లింది. దుస్తులు అందకపోవడంతో అక్కడున్న ఇనుప స్టాండ్‌పై ఎక్కి ఇనుప కిటికీని పట్టుకుంది. ఆ కిటికీకి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్‌కు గురై కేకలు వేసింది.
మరో విద్యార్థిని దీపిక ఆమెను చున్నీతో లాగింది. వెంటనే ఆమెను వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీపార్వతి మృతికి హాస్టల్ వార్డెన్, హెచ్‌ఎం కారణమంటూ తల్లిదండ్రులు కెచ్చెల అమల, సుధాకర్‌రెడ్డి, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మోసుకుని ఆశ్రమ పాఠశాల గేటు వద్దకు తీసుకెళ్లి బైఠాయించారు.


