సాక్షి, మహబూబాబాద్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నారంటూ ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. సదరు భర్త.. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలం చిలకోడు గ్రామానికి చెందిన గాడే రాజేశ్వర్ రావు, సూర్యాపేట జిల్లా మోటే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానిని 2016లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్వర్ రావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, తన భార్య భవానికి ఓ కొరియర్ డెలివరీ బాయ్ సైదులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత నెల 27న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసినట్లు ఆయన తెలిపారు.

ఆ తర్వాత భార్య మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలను పరిశీలించగా, తనను(భర్తను) టార్గెట్ యాక్సిడెంట్ చేసి చంపేయాలని, లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియుడికి సందేశాలు పంపినట్లు గుర్తించానని రాజేశ్వర్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై గత నెల 28న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సమీప గ్రామంలో ఉన్న తన అన్నయ్యను తీసుకురావడానికి వెళ్తుండగా, సైదులు తనను వెంబడించాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని రాజేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


