రేవంత్‌ యాచిస్తుండో.. సొమ్మిచ్చివస్తుండో? | KTR pay tributes to Prof Jayashankar | Sakshi
Sakshi News home page

రేవంత్‌ యాచిస్తుండో.. సొమ్మిచ్చివస్తుండో?

Aug 7 2026 6:07 AM | Updated on Aug 7 2026 6:07 AM

KTR pay tributes to Prof Jayashankar

జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న కేటీఆర్‌

32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు తెచ్చిందేమిటి?: కేటీఆర్‌  

మన గురువు జయశంకర్‌.. రేవంత్‌కు మాత్రం పొరుగు రాష్ట్ర సీఎం 

గాడ్‌ ఫాదర్‌లా కేసీఆర్‌కు జయశంకర్‌ మార్గనిర్దేశం చేశాడు 

తెలంగాణను మళ్లీ కేసీఆర్‌ చేతిలో పెట్టడమే జయశంకర్‌కు నివాళి

సాక్షి, హైదరాబాద్‌: ‘మనకేమో గురువు జయశంకర్‌.. కానీ సీఎం రేవంత్‌కు గురువు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం ‘జై తెలంగాణ’అనేందుకు కూడా రేవంత్‌కు మనసొప్పదు. రేవంత్‌ సీఎం పదవి చేపట్టిన తర్వాత 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్తూ సగటున 13 రోజులకోసారి ప్రదక్షిణలు చే స్తున్నారు. ఢిల్లీకి వెళ్లి వారిని యాచిస్తున్నడో లేక వారికే తెలంగాణ సొమ్మును ఇచ్చి వస్తున్నాడో తెలియదు. కానీ తెలంగాణకు ఢిల్లీ నుంచి ఏం తెస్తున్నాడో చెప్పడం లేదు. ఢిల్లీకి సామంతుల్లా తలవంచడం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే స్వతంత్ర నాయకత్వం కావాలి’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 

తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా భావిస్తే, కేసీఆర్‌కు జయశంకర్‌ సార్‌ గాడ్‌ఫాదర్‌లా మార్గనిర్దేశం చేశారన్నారు. 

జయశంకర్‌ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పాలన 
‘తెలంగాణ కోసమే పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్‌ఎస్‌ అయితే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడే నాయకత్వం కేసీఆర్‌దే. పార్లమెంటులో ఓ బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చినా బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు స్పందించలేదు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ ఉంటే ఆ వ్యాఖ్యలు చేసిన వారిని గల్లా పట్టి నిలదీసేవాడు. తెలంగాణ మళ్లీ ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతోంది. ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఐఏఎస్‌ అధికారి బీపీఆర్‌ విఠల్‌ అధ్యయనాల ప్రకారం తెలంగాణ మిగులు రాష్ట్రం. నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం వాటిని వినియోగించలేకపోతోంది.

ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తుంటే, జీఆర్‌ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని హరీశ్‌రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారు. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదో రేవంత్‌రెడ్డి, రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలి. జైపాల్‌రెడ్డి జీవితంలో ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. నిఖార్సయిన ఉద్యమకారులుగా కోదండరాం వంటి వారి పేర్లను కూడా రేవంత్‌ చెప్పడం లేదు. జయశంకర్‌ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పాలన సాగుతోంది’అని కేటీఆర్‌ మండిపడ్డారు.

ఉద్యమానికి దిక్సూచి జయశంకర్‌
‘స్వయం సమృద్ధి, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే మూడు దశల ద్వారా తెలంగాణ సమాజాన్ని జయశంకర్‌ విశ్లేíÙంచారు. యాచించి కాదు.. శాసించి తెలంగాణ సాధించాలి అనే స్ఫూర్తిని కేసీఆర్‌లో జయశంకర్‌ నింపారు. కాంగ్రెస్‌ తెలంగాణకు శాశ్వత శత్రువని, మూడు తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్‌ అని జయశంకర్‌ చెప్పేవారు. జయశంకర్‌ ఆశయ సాధన కోసం బీఆర్‌ఎస్‌ పనిచేస్తుంది. తెలంగాణను మళ్లీ కేసీఆర్‌ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు పాల్గొని జయశంకర్‌కు నివాళులు అరి్పంచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement