దోచింది దాచేందుకే విదేశాలకు.. | BJLP leader Aleti Maheshwar Reddy fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

దోచింది దాచేందుకే విదేశాలకు..

Aug 7 2026 6:00 AM | Updated on Aug 7 2026 6:00 AM

BJLP leader Aleti Maheshwar Reddy fires on Revanth Reddy

సీఎం, మంత్రులపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు 

టెండర్లు, కమీషన్లు, భూకేటాయింపులపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: దోచుకున్నది పంచుకొని దాచుకోవడానికే సీఎం సహా రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, ఇతర నేతలతో కలిసి మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులనే కాంగ్రెస్‌ సర్కార్‌ కొనసాగిస్తోందని ఆరోపించారు.

 ప్రస్తుతం మూసీ రివర్‌ఫ్రంట్‌ చైర్మన్‌గా ఉన్న నరసింహారెడ్డి గతంలో కేటీఆర్‌తో సన్నిహితంగా వ్యవహరించారని, ఆయనతోపాటు హరీశ్‌రావు వద్ద దీర్ఘకాలం ఓఎస్‌డీగా పనిచేసిన అశోక్‌రెడ్డికి కాంగ్రెస్‌ ప్రభు త్వం కీలక బాధ్యతలు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహనకు నిదర్శనమన్నారు. టెండర్లు, కమీషన్లు, భూకేటాయింపులు, షెల్‌ కంపెనీలు, నియామకాలు, సబ్‌ కాంట్రాక్ట్‌లు, మంత్రుల విదేశీ పర్యటనలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని  డిమాండ్‌ చేశారు.  

రూ. 82 వేల కోట్ల పనులు ఏపీ కాంట్రాక్టర్లకే... 
మూసీలో చెత్త తొలగింపు పేరుతోనే మొత్తం రూ. 21 వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేయబోతోందని ఏలేటి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సుమారు రూ. 92 వేల కోట్ల విలువైన పనుల్లో రూ. 82 వేల కోట్ల పనులను ఏపీకి చెందిన కాంట్రాక్టర్లకే అప్పగించిందని కూడా ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ సంపదను 30 శాతం ఆస్థాన కాంట్రాక్టర్లే దోచుకుంటుంటే ప్రభుత్వం మౌనం ఎందుకు వహిస్తోందని నిలదీశారు. ‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ట్రాన్స్‌కో, సింగరేణి సీఎండీకి అమెరికా టూర్‌ ఎందుకు? భట్టి టూర్‌పై చాలా అనుమానాలు ఉన్నాయి’అని ఏలేటి వ్యాఖ్యానించారు. 

దొంగకు తాళం ఇస్తే ఎలా ఉంటుందో... 
‘కాంట్రాక్టరే.. మంత్రి అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు స్పష్టమౌతోంది. దొంగకు తాళం ఇస్తే ఎలా ఉంటుందో రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసి చూపిస్తున్నారు. 103 షెల్‌ కంపెనీల సంగతి ఏమిటి? మీ కంపెనీకి అన్ని ఆస్తులు ఎలా బదిలీ అయ్యాయి? రూ. లక్ష కోట్ల విలువైన భూములు మీ (పొంగులేటి)పై, మీ బినామీల పేర్లపై ఉన్న మాట వాస్తవం కాదా’అని ఏలేటి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement