సింగరేణికి చేరిన ’నైనీ’ సిరులు | Black gold from Odisha to the state | Sakshi
Sakshi News home page

సింగరేణికి చేరిన ’నైనీ’ సిరులు

Aug 7 2026 5:52 AM | Updated on Aug 7 2026 5:52 AM

Black gold from Odisha to the state

ఒడిశా నుంచి రాష్ట్రానికి వచ్చిన నల్లబంగారం

1,131 కి.మీ. ప్రయాణించి సింగరేణి థర్మల్‌ కేంద్రానికి చేరిన తొలి రేకు

సాక్షి, హైదరాబాద్‌/జైపూర్‌ : తెలంగాణ ఇంధన అవసరాలు తీర్చే దిశగా సింగరేణిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి నైనీ బొగ్గు గని నుంచి లోడ్‌ చేసిన తొలి బొగ్గు రైల్వే రేకు సుమారు 1,131 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి గురువారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని  సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి (ఎస్టీపీపీ) చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సింగరేణి గని నుంచి తెలంగాణకు బొగ్గు సరఫరా కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. 

తొలి రైల్వే రేకుకు అధికారుల ఘన స్వాగతం
సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి చేరుకున్న తొలి నైనీ బొగ్గు రైల్వే రేకుకు సంస్థ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎల్‌.వి. సూర్యనారాయణ, డైరెక్టర్‌ (ఈ–ఎం) ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. 

భట్టి వీడియో సందేశం
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క నైనీ బొగ్గు రాక సందర్భంగా అక్కడి నుంచే సింగరేణి యాజమాన్యానికి, కార్మికులకు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘ సింగరేణికి ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. రాష్ట్ర అవసరాలు తీర్చడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి బొగ్గును సరఫరా చేస్తోంది. ఇప్పటికే మనం ’తాడిచర్ల–2’ బ్లాక్‌ను పొందాం, ఇటీవల వేలంలో మణుగూరు బ్లాక్‌ ను దక్కించుకున్నాం. భవిష్యత్తులో మరిన్ని బ్లాకులను పొందటానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది’. అని భట్టి పేర్కొన్నారు.  

‘సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత’
సాక్షి, హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌), జిమ్కో సీనియర్‌ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం బృందం సభ్యులు టెక్సాస్, అరిజోనా రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాత మైనింగ్‌ యంత్రాల తయారీ కేంద్రాలను సందర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సింగరేణికి తీసుకురావడం, తద్వారా గనుల్లో భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ పర్యటనకు శ్రీకారం చుట్టాయి. 

ముందుగా అరిజోనా రాష్ట్రం టక్సన్‌లోని ’కేటర్పిల్లర్‌ డెమాన్‌స్ట్రేషన్‌ అండ్‌ లెర్నింగ్‌ సెంటర్‌’ను ఈ బృందం సందర్శించింది. అక్కడ స్వయంచాలిత (అటానమస్‌), రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేసే భారీ మైనింగ్‌ యంత్రాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించింది. అనంతరం టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌ సమీపంలోని లాంగ్‌వ్యూలో ఉన్న ’కొమాట్సు మైనింగ్‌ కార్పొరేషన్‌’ ఫెసిలిటీని కూడా ఉన్నత స్థాయి బృందం సందర్శించింది. అక్కడ భారీ మైనింగ్‌ యంత్రాల తయారీ, అసెంబ్లీ ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, క్యాటర్‌పిల్లర్‌ ఇండియా ప్రతినిధి ఆర్‌కె మిశ్రా, డెన్నిస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement