వైద్య రంగంలో సరికొత్త అడుగు
సాక్షి స్పెషల్ డెస్క్: అమెరికా పరిశోధకులు డయాబెటిస్‌ను అత్యంత కచ్చితంగా గుర్తించి, మెరుగైన చికిత్స అందించడానికి ఒక వినూత్న ఏఐ టూల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58.90 కోట్లకుపైగా ఉన్న మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో 85.30 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ తరుణంలో ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడనుంది.
కచ్చితమైన వర్గీకరణ
రోగుల క్లినికల్ డేటా, మెషీన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి ఈ టూల్ డయాబెటిస్‌ను నాలుగు నిర్దిష్ట రకాలుగా వర్గీకరిస్తుంది అవి : ప్రీ–డయాబెటిస్, టైప్–1 డయాబెటిస్, టైప్–2 డయాబెటిస్, ప్యాంక్రియాటిక్ వ్యాధి వల్ల వచ్చే డయాబెటిస్.
ఏఐ టూల్ పనితీరు – శిక్షణ విధానం
సాధారణ వైద్య పరీక్షల్లో డాక్టర్లకు లభించని సూక్ష్మమైన వివరాలను, రోగి ఆరోగ్య రికార్డులను విశ్లేషించి కచ్చితమైన నిర్ధారణను ఇస్తుంది. పిమా ఇండియన్స్ డయాబెటిస్ డేటాబేస్, కాగెల్ రిపాజిటరీ నుంచి సేకరించిన 21,539 నమూనాలతో ఈ మోడల్‌ను రూపొందించారు. ఇందులో 60 శాతం నమూనాలను శిక్షణకు, 40 శాతం నమూనాలను టెస్టింగ్‌కు ఉపయోగించారు.
రోగులకు చేకూరే ప్రయోజనాలు
⇒ వ్యాధి ఏ రకానికి చెందిందో స్పష్టంగా తెలియడం వల్ల ప్రతీ రోగికి ప్రత్యేకంగా తగిన కచ్చితమైన మందులు, చికిత్స అందించడం సులభమవుతుంది.
⇒ రోగిలో స్పష్టమైన లక్షణాలు కనిపించే ముందే ఈ టూల్ డయాబెటిస్‌ను పసిగట్టగలదు.
⇒ రక్త పరీక్షల (బ్లడ్ ప్యానెల్) నివేదికలు రాగానే, వాటిని ఏఐ టూల్‌లో అప్‌లోడ్ చేసి తక్షణమే ఫలితాలను వర్గీకరించవచ్చు.
⇒ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే మాస్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాల్లో ఈ సాంకేతికత అత్యంత ప్రయోజనకరంగా మారుతుంది.


