పంద్రాగస్టున స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ | Distribution of smart ration cards on August 15th | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టున స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ

Aug 7 2026 5:49 AM | Updated on Aug 7 2026 5:49 AM

Distribution of smart ration cards on August 15th

సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం.. 

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ

పేద కుటుంబాల ఆహార భద్రత బలోపేతమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆహార భద్రతకార్డుల స్థానంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏకకాలంలో కొత్తగా రూపొందించిన స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్‌ ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) స్మార్ట్‌ రేషన్‌కార్డులను ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజినల్‌ అధికారి (ఆర్‌డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 

లబ్ధిదారుల జాబితాల ఖరారు, రేషన్‌కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ప్రచారం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం 15న సంగారెడ్డిలో స్ట్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ విషయాన్ని‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కేవైసీ పూర్తి చేసిన కుటుంబాలకు మాత్రమే స్మార్ట్‌ రేషన్‌కార్డు వచ్చే అవకాశం ఉందని, ఇంటి ఇల్లాలు పేరిట, ఆమె ఫొటోతోనే స్మార్ట్‌ రేషన్‌కార్డు ఉంటుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. కేవైసీ ఆధారంగా ఆధార్‌కార్డుపై ఉన్న ఫొటోను స్మార్ట్‌ రేషన్‌కార్డుకు బదిలీ చేస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement