సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఒక దారుణ హత్యోదంతం కలకలం రేపింది. పాపులర్ హాలీవుడ్ క్రైమ్ సిరీస్ 'ది స్టేర్‌కేస్' (The Staircase) చూసి, దాని ఆధారంగా భార్యను హత్య చేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది.62 ఏళ్ల సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్, ఆస్తి వివాదం కారణంగా భార్యను దారుణంగా హత్య చేశాడు. రియల్ స్టోరీ ఆధారంగా తీసిన ఈ సిరీస్ మరో హత్యకు దారి తీసింది. అయితే సాక్ష్యాలను తుడిచిపెట్టి పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
ఒక భర్త, ఒక భార్య, ఒక దారుణమైన మరణం, ఆపై శాశ్వతంగా మాయమైన హత్యాయుధం. చివరికి న్యాయం అస్పష్టంగా మిగిలిపోవడం... ఇదీ HBO'ది స్టేర్‌కేస్'. సరిగ్గా ఇదే స్టోరీ తూర్పు ఢిల్లీలోని ఒక ఇంట్లో, ఇదే కథనం నిజ జీవితంలో మరోసారి పునరావృతమైంది.ఈ ఘటన జూలై 30న జరిగింది
పోలీసుల వివరాల ప్రకారం62 ఏళ్ల సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ కమల్ సింగ్, ఆయన భార్య కోమల్ సింగ్ దంపతుల మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు తలెత్తాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా వీరిద్దరూ విడివిడిగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారంటే వీరి విభేదాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అయితే తాను అనుకున్న పథకాన్ని అమలు చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడికి అవకాశం చిక్కింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి (కుమారుడు లైబ్రరీకి, కుమార్తె ఆఫీసుకు, పనిమనిషి పని ముగించుకుని వెళ్లిన తర్వాత) మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో బాల్కనీలో బట్టలు ఆరేస్తున్న భార్యపై కమల్ కత్తితో వెనుక నుంచి దాడి చేశాడు. దెబ్బ గట్టిగా తగలక పోవడంతో కోమల్ కేకలు వేస్తూ కిచెన్‌లోకి పరుగెత్తింది. కమల్ ఆమెను జుట్టు పట్టుకుని లివింగ్ రూమ్‌లోకి ఈడ్చుకొచ్చి, కత్తెరతో దారుణంగా పొడిచి చంపేశాడు. పొరుగువారికి కేకలు వినిపించినా ఎవరూ కలగజేసుకోకపోవడం మరో విషాదం.
అనంతరం కమల్ రక్తం మరకల బట్టలు, కత్తిని బ్యాగ్‌లో పెట్టి, స్నానం చేసి స్కూటర్‌పై పారిపోయాడు. మార్గమధ్యంలో ఆ బ్యాగ్‌ను పారేశాడు. అలాగే భార్య గదిలోని రూ. 5 లక్షలతో పాటు, రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 7 లక్షలు ఉపసంహరించి మొత్తం రూ. 12.75 లక్షల నగదుతో పరారయ్యాడు. రాత్రి కుమారుడు ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులోపడి ఉంది. మృతదేహం వద్ద కత్తెర మాత్రమే దొరికింది,కత్తి కనిపించలేదు.
అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని ట్రాక్ చేశారు. కమల్ మొదట తన ఫోన్ ఆన్ చేసి గోరఖ్‌పూర్ వైపు వెళ్లాడు. నేపాల్ పారిపోతున్నట్లు బిల్డప్ ఇవ్వాలని చూశాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మథుర వైపు వెళ్లాడు. ఎట్టకేలకు మూడు రోజుల గాలింపు తర్వాత ఢిల్లీ పోలీసులు మథుర రైల్వే స్టేషన్ వద్ద కమల్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి స్కూటర్ ,పూర్తి నగదును స్వాధీనం చేసుకున్నారు. 'ది స్టేర్‌కేస్' సిరీస్‌లో చూపించినట్లుగానే, ఆయుధాన్ని దొరక్కుండా పారేస్తే తనపై బలమైన ఆధారాలు ఉండవని భావించి ఆయుధాన్ని దాచేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
ఇదీ చదవండి : ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత
జగత్‌పురిలో ఒక ఆస్తిని తన తండ్రి పేరిట కొనాలని కమల్ భావించగా, అందులో వాటా కావాలని భార్య కోమల్ పట్టుబట్టింది. దీనికి తోడు కమల్‌కు ముంబైలో మరొక మహిళతో ఉన్న సంబంధం వీరి మధ్య ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.


