బ్యాంక్ లోన్ కట్టలేదా? కొత్త నిబంధనలు ఇవే! | RBI Loan Recovery Rules: New Guidelines Issued Against Agent Harassment | Sakshi
Sakshi News home page

బ్యాంక్ లోన్ కట్టలేదా? కొత్త నిబంధనలు ఇవే!

Aug 7 2026 11:51 AM | Updated on Aug 7 2026 11:59 AM

RBI Major Crackdown Recovery Agents New Loan Recovery Rules

బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ వసూళ్ల వ్యవహారంలో రికవరీ ఏజెంట్ల అక్రమాలు, వేధింపులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చెక్ పెట్టింది. రుణగ్రహీతల హక్కులకు రక్షణ కల్పిస్తూ సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఫోన్ కాల్స్, సమయంపై కఠిన పరిమితులు

కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. పరిమితికి మించి పదేపదే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు పంపకూడదు. రుణగ్రహీతలను భయభ్రాంతులకు గురిచేయడం, అనామక సంభాషణలు జరపడం, అసభ్య పదజాలం వాడటం పూర్తిగా నిషేధం. అంతేకాక, బంధువులు, స్నేహితులు లేదా సహోద్యోగులకు ఫోన్ చేసి వేధించడం, సోషల్ మీడియాలో రుణగ్రహీత ఫొటోలు లేదా వివరాలు పోస్ట్ చేసి వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడాన్ని ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణించింది.

ఏజెంట్లకు ఐఐబీఎఫ్ శిక్షణ నిర్బంధం

బ్యాంకులు నియమించే రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్’ (ఐఐబీఎఫ్‌) సర్టిఫికేషన్ పొంది ఉండాలి. ఏజెంట్ మొదటిసారి వెళ్లేముందే బ్యాంకులు కస్టమర్‌కు సమాచారం అందించాలి. ప్రతి ఏజెంట్ వద్ద ఐడీ కార్డు, బ్యాంక్ అధికార పత్రం ఉండాలి. సంభాషణలకు సంబంధించిన కాల్ రికార్డింగ్‌లను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. వైద్య అత్యవసర పరిస్థితులు, వివాహాలు, తీవ్ర విషాద సమయాల్లో వసూలు ప్రయత్నాలు చేయకూడదు. పొరపాటు వసూలు చర్యలకు గురైన బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

మొబైల్ ఫోన్ రుణాలు.. పరిహారం

  • మొబైల్ కొనుగోలు రుణ బకాయిలు చెల్లించకపోతే మాత్రమే ఆ పరికరాన్ని ‘డివైజ్ లాకింగ్’ సాంకేతికత ద్వారా నిరోధించేందుకు అనుమతి ఉంటుంది.

  • ఈఎంఐ చెల్లింపు 30 రోజులు ఆలస్యమైతే పాక్షికంగా, 60 రోజులు దాటితే పూర్తిస్థాయి ఆంక్షలు విధించవచ్చు. అయితే, ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ సేవలను నిలిపివేయడానికి వీల్లేదు.

  • రుణగ్రహీత కాంటాక్ట్‌లు, ఫొటోలు, గ్యాలరీని యాక్సెస్ చేయడం నిషేధం.

  • బాకీ చెల్లించిన 1 గంటలోపు ఫోన్ అన్‌లాక్ చేయాలి.

  • ఆలస్యమైతే గంటకు రూ.250 చొప్పున పరిహారం బాధితుడికి చెల్లించాలి.

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్, సాంప్రదాయ రుణ మార్కెట్లో జవాబుదారీతనాన్ని పెంచి సామాన్య రుణగ్రహీతలకు మానసిక ప్రశాంతతను అందిస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement