''మన జీవితానికి అసలైన లక్ష్యం డబ్బు కాదు. నిజానికి డబ్బు అనేది మనం చేసిన పని ఎంత విలువైనదో కొలిచే ఒక కొలమానం మాత్రమే'' అని అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.
చాలామంది జీవితంలో ''మంచి ఉద్యోగం రావాలి, మంచి జీతం రావాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి'' అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఒక ఉద్యోగం, ఒక కంపెనీ, ఒక జీతం.. ఇదే వారి ప్రపంచంగా మారిపోతుంది. తమ సమయాన్ని ఒక సంస్థ కోసం వెచ్చిస్తారు. నెలాఖరులో దానికి బదులుగా జీతం తీసుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ.. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. మనం కేవలం డబ్బు కోసం పనిచేస్తున్నామా? లేక మనం ఏదైనా విలువను సృష్టిస్తున్నామా?
తేనెటీగ ఫార్ములా
ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి తేనెటీగ జీవితం సరిగ్గా సరిపోతుంది. తేనెటీగ పువ్వు దగ్గరకు వెళ్లినప్పుడు.. పరాగసంపర్కం చేయాలి అనుకోదు. దానికి కావాల్సింది మకరందం మాత్రమే. దీనికోసం పువ్వు దగ్గరకు వెళ్తుంది. కానీ ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకు వెళ్తున్నప్పుడు, దాని ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. అంటే పరాగసంపర్కం దాని ప్రధాన లక్ష్యం కాదు. కానీ అది చేసే పనికి సహజంగా వచ్చే ఫలితం.
డబ్బు విషయంలో తేనెటీగ ఫార్ములాను అప్లై చేసుకోవచ్చు. నువ్వు.. నాకు డబ్బు కావాలి అని మాత్రమే ఆలోచిస్తూ, దాని వెంట పరుగెత్తితే, ప్రపంచంలో ఉన్న అందరితో నువ్వు అదే డబ్బు కోసం పోటీ పడుతున్నట్టే. కానీ.. నేను ఒక నిజమైన సమస్యను పరిష్కరించాలి. అది చాలా మందికి ఉపయోగపడాలి అని ఆలోచిస్తే, నీ దృష్టి డబ్బు నుంచి విలువ వైపు మారుతుంది.

ఇలా చేస్తే.. ఆదాయం అదే వస్తుంది!
ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక మంచి సాఫ్ట్‌వేర్ తయారు చేశాడనుకుందాం. అతని మొదటి ఆలోచన.. దీంతో నేను ఎంత డబ్బు సంపాదించగలను?.. అయితే అతని దృష్టి ఆదాయంపైనే ఉంటుంది. కానీ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను నేను ఎలా సులభంగా పరిష్కరించగలను? అని ఆలోచిస్తే, అతను ఒక విలువను సృష్టిస్తున్నాడు.
ఆ సాఫ్ట్‌వేర్ నిజంగా ఉపయోగపడితే, ఎక్కువ మంది దాన్ని ఉపయోగిస్తారు. ఎక్కువ మందికి ఉపయోగపడితే, దాని ద్వారా ఆదాయం వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.
డబ్బు అవసరం లేదని దీని అర్థం కాదు. మన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం. కానీ డబ్బును జీవితానికి ఒకే ఒక లక్ష్యంగా చేసుకుంటే, మనం సృష్టించగల విలువను మనమే పరిమితం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అసలు ప్రశ్న “నేను ఎంత డబ్బు సంపాదించగలను?” అనేది కాకుండా, నేను ఏ సమస్యను పరిష్కరించగలను?, నా పని ఎంతమందికి ఉపయోగపడగలదు?, నేను ఇతరుల జీవితంలో ఎంత విలువను సృష్టించగలను?, అని ఆలోచించాలి.
ఎందుకంటే మనం డబ్బును నేరుగా వెంబడించినప్పుడు, డబ్బే మన గమ్యంగా మారుతుంది. కానీ మనం విలువను సృష్టించడంపై దృష్టి పెట్టినప్పుడు, డబ్బు మన ప్రయాణంలో వచ్చే ఒక ఫలితంగా మారుతుంది.
ఇదీ చదవండి: డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్


