జాబ్ చేస్తున్నారా.. జాగ్రత్త! కియోసాకి హెచ్చరిక | Have a Job Who Really Benefits Robert Kiyosaki Explains | Sakshi
Sakshi News home page

జాబ్ చేస్తున్నారా.. జాగ్రత్త! కియోసాకి హెచ్చరిక

Sep 18 2026 8:34 PM | Updated on Sep 18 2026 9:22 PM

Have a Job Who Really Benefits Robert Kiyosaki Explains

ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఏఐ, ఆటోమిషన్, సాఫ్ట్‌వేర్ వంటి టెక్నాలజీలు.. కంపెనీలు పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. గతంలో ఒక పని చేయడానికి వందల మంది ఉద్యోగులు అవసరమైతే, ఇప్పుడు అదే పనిని తక్కువ మంది వ్యక్తులతో లేదా కొన్ని సాఫ్ట్‌వేర్ సిస్టం సహాయంతో చేయగలుగుతున్నారు. ఈ మార్పు కంపెనీలకు ప్రయోజనం కలిగించవచ్చు. కానీ ఇదే సమయంలో ఉద్యోగుల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఈ విషయాన్ని కియోసాకి చెబుతున్నారు.

కియోసాకి ప్రకారం.. మెటా కంపెనీ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని రోజులకు సంస్థ స్టాక్ మార్కెట్ విలువ 50 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే ఇక్కడ పెట్టుబడిదారులు లాభపడ్డారు. కంపెనీలో కోసం కష్టపడిన ఎంతోమంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అదే హెచ్చరించాను
తమ రాత్రులు, వారాంతాలు, కుటుంబ సమయాన్ని త్యాగం చేసిన ఉద్యోగులకు ఆటోమేటెడ్ టెర్మినేషన్ ఈమెయిల్ వచ్చింది. ఇదే సమయంలో వాటాదారులు మరింత ధనవంతులయ్యారు. ఇది వ్యవస్థలో లోపం కాదు, వ్యవస్థ రూపొందించిన విధంగానే పనిచేస్తోంది. అందుకే నేను దశాబ్దాలుగా దీని గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను. ఉద్యోగుల వర్గం ఎప్పుడూ ఒక ఉచ్చుగానే ఉండేదని కియోసాకి చెప్పారు.

చాలామంది ఒక కంపెనీకి నిజాయితీగా పనిచేస్తే, కంపెనీ కూడా మనకు జీవితాంతం భద్రత ఇస్తుందని అనుకుంటారు. అందుకోసమే మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలి, ప్రమోషన్స్ పొందాలి, జీతం పెంచుకోవాలి, రిటర్మెంట్ వరకు అదే విధంగా కొనసాగాలి అనేది సాధారణమైన ఆలోచన. కానీ ప్రస్తుత ప్రపంచంలో కంపెనీల అవసరాలు మారుతున్నాయి. మార్కెట్ పరిస్థితులు, ఆటోమిషన్, ఏఐ వంటి కారణాల వల్ల ఒకప్పుడు అవసరమైన ఉద్యోగం భవిష్యత్తులో అవసరం లేకపోవచ్చు.

ఉద్యోగం చెడ్డది కాదు, కానీ..
ఉద్యోగం చెడ్డది అని కాదు. ఉద్యోగం ఇప్పటికీ చాలా మందికి స్థిరమైన ఆదాయాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. కానీ.. మన మొత్తం ఆర్థిక భవిష్యత్తును ఒక్క జీతంపైనే ఆధారపెట్టడం ప్రమాదకరంగా మారవచ్చు. ఉద్యోగంతో పాటు మనకు సొంతంగా ఉండే ఆస్తులు లేదా ఇతర ఆదాయ మార్గాలను కూడా నిర్మించుకోవడం తప్పనిసరి.

ఏఐ, ఆటోమిషన్ ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి. ఒక కంపెనీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎక్కువ పనిని తక్కువ ఖర్చుతో చేయగలిగితే, ఆ కంపెనీకి ప్రొడక్టివిటీ పెరగవచ్చు. దాని వల్ల ఏర్పడే అదనపు లాభం ఎక్కడికి వెళ్తుంది? అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. అది షేర్ హోల్డర్లకు వెళ్లవచ్చు, కంపెనీ విస్తరణకు ఉపయోగపడవచ్చు, కొత్త టెక్నాలజీలో పెట్టుబడి కావచ్చు. ఇక్కడ ఉద్యోగులు లాభపడేది ఏముంటుంది?.

మీరు ఏ వైపు?
రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రకారం.. పూర్ డాడ్ ఉద్యోగం మీద నమ్మకం ఉంచారు. విధేయతతో పనిచేశారు. రిచ్ డాడ్ ఎప్పుడూ వ్యవస్థను నమ్మలేదు. వ్యవస్థ తొలగించలేని ఆస్తులను ఆయన నిర్మించుకున్నాడు. ఉద్యోగం పోయినప్పుడు.. పూర్ డాడ్ ఇబ్బదులు ఎదుర్కొన్నారు. రిచ్ డాడ్ తాను నిర్మించుకున్న ఆస్తులతో ముందుకు సాగారు. మార్పు ఇప్పటికే మొదలైంది. ఇక మిగిలింది మీరు ఏ పక్షాన ఉన్నారనేదే ప్రశ్న అని కియోసాకి వెల్లడించారు.

ఇదీ చదవండి: 'చరిత్రలో అతిపెద్ద క్రాష్ మొదలైంది': కియోసాకి హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement