సిగార్‌తో యోగి.. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అఖిలేశ్‌.. అదిరిపోయే సీన్‌.. | Samajwadi Party AI Film, Akhilesh Yadav Takes On Yogi Adityanath In 80s Style Ahead Of 2027 Polls, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

సిగార్‌తో యోగి.. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అఖిలేశ్‌.. అదిరిపోయే సీన్‌..

Sep 18 2026 1:41 PM | Updated on Sep 18 2026 2:21 PM

Samajwadi Party AI film Akhilesh Yadav vs Yogi Video Viral

చీకటి గదిలో విలన్‌ తరహా కుర్చీలో యోగి.. చేతిలో సిగార్‌.. చుట్టూ అనుచరులు.. మరోవైపు ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్‌’లా అఖిలేశ్‌ ఎంట్రీ.. డైలాగ్‌లు పేలుతుంటే బయట జనం నినాదాలు.. ఇదేదో 80ల బాలీవుడ్‌ సినిమా కాదు.. 2027 యూపీ ఎన్నికల ముందు సమాజ్‌వాదీ పార్టీ విడుదల చేసిన ఏఐ పొలిటికల్‌ సినిమా!

ఎన్నికల సమరం మొదలవ్వకముందే ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ తెరపై కొత్త సీన్‌ మొదలైంది. మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు AI సినిమాల యుద్ధంగా మారుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్‌ చేస్తూ మరో AI వీడియోను విడుదల చేశారు. ఈసారి ఏకంగా 80ల నాటి మసాలా సినిమాల ఫార్ములాను తీసుకొచ్చారు.

సీన్‌.. విలన్‌ ఎంట్రీ!
తెరపై యోగి ఆదిత్యనాథ్‌ పాత్ర కనిపిస్తుంది. సాధారణ రాజకీయ నాయకుడిలా కాదు.. పాత బాలీవుడ్‌ విలన్‌ గెటప్‌లో! చుట్టూ అనుచరులు.. చేతిలో సిగార్‌.. తన పీఆర్‌ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్లు సన్నివేశం. ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు పీఆర్‌ యంత్రాంగం పనిచేస్తుందన్న అర్థంలో డైలాగ్‌లు ఉంటాయి. అంతేకాదు.. పీఆర్‌ కోసం తాను భారీగా ఖర్చు చేస్తున్నానని, ప్రధాని మోదీ కంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నానని యోగి పాత్ర చెప్పేలా వీడియోను రూపొందించారు.

కట్‌ చేస్తే.. హీరో ఎంట్రీ!
కట్‌ చేస్తే హీరోగా అఖిలేశ్‌ యాదవ్‌ పాత్ర తెరపైకి వస్తుంది. ముఖంలో కోపం.. మాటల్లో పదును.. యోగి పాత్రను ప్రశ్నిస్తూ వరుస డైలాగ్‌లు. మహిళలపై పెరుగుతున్న నేరాలు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణ నాణ్యత, అవినీతి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ యోగి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నట్లు చూపించారు. ధరల పెరుగుదలను కూడా ప్రస్తావిస్తూ.. ‘చక్కెర కంటే మనిషి ప్రాణం చౌకైపోయింది.. గ్యాస్‌, రేషన్‌ అన్నీ ఖరీదయ్యాయి.. చౌకగా మిగిలింది పేదవాడి ప్రాణమే’ అనే భావన వచ్చేలా అఖిలేశ్‌ పాత్రకు డైలాగ్‌ పెట్టారు.

‘పీఆర్‌’ వర్సెస్‌ ‘ప్రజల ప్రేమ’!
ఇక్కడే కథలో మరో ట్విస్ట్‌. వీడియోలో యోగి పాత్ర తన పీఆర్‌ యంత్రాంగం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. దానికి అఖిలేశ్‌ పాత్ర.. తనకు ప్రజల నుంచి లభించే ప్రేమే ఏ పీఆర్‌ వ్యవస్థకైనా సరిపోతుందని బదులిస్తుంది. అంటే.. ఒకవైపు పీఆర్‌.. మరోవైపు ప్రజల ప్రేమ! అంటూ రాజకీయ సందేశాన్ని సినిమా సన్నివేశాల రూపంలో చూపించే ప్రయత్నం చేసింది ఎస్పీ. అయితే, వీడియోలో యోగి పాత్ర రాజకీయ ‘మోడల్‌’పై కూడా అఖిలేశ్‌ పాత్ర ఆరోపణలు చేస్తున్నట్లు సన్నివేశాలను రూపొందించారు. ప్రజలను విభజించడం, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించడం వంటి ఆరోపణలు అందులో ఉన్నాయి.

చివరి సీన్‌ మరింత సినిమాటిక్‌గా ఉంటుంది. కిటికీ బయట భారీగా ఎస్పీ కార్యకర్తలు గుమిగూడినట్లు చూపించారు. చేతుల్లో ప్లకార్డులు.. నినాదాలతో హోరెత్తుతున్న వాతావరణం. ఇదంతా చూస్తే.. ఎన్నికల ప్రచారంలో పోస్టర్లు, సభలు, రోడ్‌షోలు దాటి రాజకీయ పార్టీలు ఇప్పుడు AI తెరపైకి కూడా అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇక, యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎస్పీ రూపొందించిన AI వీడియోలలో ఇది తాజా ఎపిసోడ్‌. గతంలో విడుదల చేసిన మరో AI వీడియోలో యోగి పాత్రను చిల్లం తాగుతున్నట్లు చూపించారు. ఆ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించి విమర్శలు చేసింది. ఇప్పుడు 80ల సినిమా ఫార్ములాతో వచ్చిన కొత్త వీడియోతో మరోసారి రాజకీయ దుమారం మొదలైంది. 2027 యూపీ ఎన్నికల వేడి పెరిగే కొద్దీ.. ఈ AI రాజకీయ సినిమా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement