ముంబై: ముంబై: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలే గుర్తుకొస్తాయి. జూలైలో ముంబైకి వచ్చిన నోలన్.. ఓ పాత ఇరానీ కేఫ్‌లో చాయ్, బన్ మస్కా రుచి చూశారు. అయితే కొద్ది రోజులకే అదే కేఫ్ ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన కారణాలతో వార్తల్లోకి వచ్చింది.
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, నటులు మాట్ డేమన్, టామ్ హాలండ్ చాయ్, బన్ మస్కా తిన్న ముంబైలోని ప్రముఖ ఇరానీ కేఫ్ ‘ఒలింపియా కాఫీ హౌస్’కు తాజాగా షాక్ తగిలింది. కొలాబాలో ఉన్న 108 ఏళ్ల నాటి ఈ కేఫ్ ఫుడ్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సెప్టెంబర్ 16న తక్షణమే సస్పెండ్ చేసింది. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ‘సేఫ్ ఫుడ్ సేఫ్ మహారాష్ట్ర’ కార్యక్రమం కింద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని న్యూస్18 కూడా తన కథనంలో పేర్కొంది.
ఎఫ్‌డీఏ తనిఖీల్లో ఆహార పదార్థాలు నిల్వ చేసే ప్రాంతంలోనే యూరినల్ ఉండటం, రిఫ్రిజిరేటర్‌లో మాంసం రక్తపు అవశేషాలు కనిపించడం, కేఫ్ పరిసరాల్లో బొద్దింకలు, ఈగల సమస్య ఉండటం వంటి అంశాలు గుర్తించినట్లు తనిఖీ నివేదికలో పేర్కొన్నారు. ఆహార పదార్థాలను నేలపైనే ఉంచి నిర్వహించడం, ఆహార తయారీలో పరిశుభ్రంగా లేని నీటిని ఉపయోగించడం, మాంసాహార–శాకాహార ముడి పదార్థాలను సరిగా వేరు చేయకపోవడం వంటి లోపాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పరిశుభ్రత లేని చెక్క కటింగ్ బోర్డులను ఉపయోగించడం, ఆహారం తయారు చేసే సిబ్బంది రక్షణ దుస్తులు ధరించకపోవడం వంటి అంశాలను కూడా గుర్తించారు.
మొత్తం 35 మంది ఆహార సిబ్బందిలో 34 మందికి ఫుడ్ సేఫ్టీపై సరైన శిక్షణ లేదని అధికారులు పేర్కొన్నారు. నీటి నాణ్యత పరీక్షలు, పారిశుద్ధ్యానికి సంబంధించిన తప్పనిసరి రికార్డులు కూడా తనిఖీ సమయంలో అందుబాటులో లేవని తెలిపారు. ఈ లోపాలు ఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో లోపాలను పూర్తిగా సరిచేసే వరకు కేఫ్‌లో ఆహారం కొనుగోలు, తయారీ, నిల్వ, విక్రయాలు, పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది. మళ్లీ తనిఖీ నిర్వహించి పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిన తర్వాతే కేఫ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.
కాగా, ‘ది ఒడిస్సీ’ ముంబై ప్రీమియర్‌కు ముందు జూలైలో క్రిస్టోఫర్ నోలన్, మాట్ డేమన్, టామ్ హాలండ్ తదితర చిత్ర బృందం అనుకోకుండా ఒలింపియా కాఫీ హౌస్‌కు వెళ్లింది. అక్కడ వారు చాయ్, బన్ మస్కా తీసుకున్నారు. దీంతో 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఇరానీ కేఫ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తాజాగా ఎఫ్‌డీఏ చర్యతో అదే కేఫ్ పరిశుభ్రత, ఆహార భద్రత అంశంలో చర్చనీయాంశంగా మారింది. లైసెన్స్ సస్పెన్షన్‌పై కేఫ్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.
ఇదీ చదవండి: వాళ్లు స్టార్ హీరోలే కావొచ్చు! కానీ చట్టాన్ని ఉల్లంఘించారు


