ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాఠాలు చెప్పిన మాజీ ఉపాధ్యాయుడు హెచ్‌సీ పటేల్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ చిన్ననాటి జ్ఞాపకాలను పటేల్ గుర్తుచేసుకోవడం ఒకవైపు ఆసక్తికరంగా మారితే.. మరోవైపు ఆయన ప్రస్తుత వయసుపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇద్దరికీ ఒకే వయసు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలోనూ పొంతన కుదరకపోవడమూ.. చర్చకు దారి తీసింది.
హెచ్‌సీ పటేల్ గుజరాత్‌లోని వడ్నగర్‌లో మోదీ చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారట. 1965 జూన్ నుంచి 1967 మే వరకు మోదీకి మ్యాథ్స్, సైన్స్ బోధించినట్లు పటేల్ స్వయంగా గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పటేల్ 10, 11 తరగతులకు మ్యాథ్స్, సైన్స్ బోధించారని పేర్కొన్నారు. పీటీఐ ఆధారంగా వచ్చిన మరో కథనంలో 11, 12 తరగతుల సైన్స్ టీచర్‌గా పేర్కొన్నారు. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.
మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే 1965లో ఆయన వయసు సుమారు 14–15 ఏళ్లు. 1967లో స్కూల్ విద్య పూర్తిచేసే సమయానికి ఆయన వయసు 16–17 ఏళ్ల మధ్య ఉంటుంది. అందువల్ల పటేల్ ఆ సమయంలో ఉపాధ్యాయుడిగా ఉన్న విషయం మాత్రం ఆయన చెప్పిన వివరాలతో స్పష్టంగా ఉంది. మరి టీచర్ వయసెంత? అంటూ ట్రోలింగ్ మొదలైంది.
Ahmedabad, Gujarat: Teacher of Prime Minister Narendra Modi, H.C. Patel says, "I taught Narendra Modi for two years, from June 1965 to 1967 May, when he was in Classes 10 and 11. In Class 11, he would sometimes come to my house for tuition-not every day, but occasionally. There… pic.twitter.com/d7L7wCqk9N
— IANS (@ians_india) September 17, 2026
మోదీకి 14–16 ఏళ్ల వయసులో పాఠాలు చెప్పిన టీచర్.. ఇప్పుడు 76 ఏళ్ల మోదీతో పోలిస్తే మరింత వయసులో ఉండాలని కొందరు నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాధారణంగా టీచర్, విద్యార్థి మధ్య ఉండే వయసు తేడాను ప్రస్తుత వయసులతో పోల్చుతూ.. పటేల్ 80 లేదంటే 90లలో ఉండాల్సి ఉంటుందని కొందరు పోస్టులు చేస్తున్నారు.
‘మోదీ.. చాలా షార్ప్’
ఓవైపు ఈ చర్చ నడుస్తుండగా.. పటేల్ మాత్రం మోదీ విద్యార్థిగా ఉన్న రోజుల గురించి ఎన్నో విషయాలు గుర్తుచేసుకున్నారు. మోదీ చాలా చురుకైన విద్యార్థి అని, స్కూల్‌లో జరిగే దాదాపు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని చెప్పారు. ఒకసారి పాఠశాల భవనం ప్రహరీ నిర్మాణానికి నిధులు సేకరించేందుకు నిర్వహించిన నాటకంలో మోదీ జోగీదాస్ ఖుమాన్ పాత్ర పోషించారని తెలిపారు. కత్తితో నటిస్తూ కాఠియావాడీ భాషలో సంభాషణలు చెప్పిన ఆయనకు ప్రేక్షకుల నుంచి దాదాపు పది నిమిషాల పాటు చప్పట్లు(స్టాండింగ్ ఒవేషన్) లభించాయని పటేల్ గుర్తుచేసుకున్నారు.
చిన్నప్పటి నుంచే మోదీకి ఈత అంటే ఆసక్తి ఉండేదని కూడా పటేల్ చెప్పారు. వడ్నగర్‌లోని శర్మిష్ఠ చెరువులో ఈత కొట్టే సమయంలో ఓసారి పిల్ల మొసలిని ఇంటికి తీసుకొచ్చారని.. తల్లి హీరాబెన్ దానిని తిరిగి చెరువులో వదిలేయాలని చెప్పడంతో మరుసటి రోజు మళ్లీ చెరువులో వదిలేశారని వివరించారు.
రాజకీయాల్లోకి వచ్చినా.. టీచర్‌ను మర్చిపోలేదు
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను గుర్తించారని పటేల్ తెలిపారు. 2001లో మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు.. జన సందోహం మధ్య తనను గుర్తించిన మోదీ వచ్చి పాదాలకు నమస్కరించారని చెప్పారు. తర్వాత 2005లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన పాత ఉపాధ్యాయులను సత్కరించిన కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు.
సోషల్ మీడియాలో ప్రశ్న.. అసలు క్లారిటీ ఇదే
అయితే మోదీ, ఆయన టీచర్ పటేల్ వయసు 76 అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. పటేల్ వయసు 90–91 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో ఆయన వయసుపై సోషల్ మీడియాలో వచ్చిన అనుమానాలకు తెరపడినట్టయింది. ఇక ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలో ఎన్డీటీవీ, పీటీఐ కథనాల్లో కనిపించిన తేడా మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.
Age of PM modi - 76
Age of Teacher - 75 pic.twitter.com/kVODe4xyd7 https://t.co/e0mimnacaU— AIN (@Tejusurya_) September 17, 2026
ఇదీ చదవండి: ఆ స్టార్ హీరోలు చట్టాన్ని ఉల్లంఘించారని తెలుసా?


