చిప్‌ పరిశ్రమకు దన్ను  | India built a fledgling chip industry in 5 years says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

చిప్‌ పరిశ్రమకు దన్ను 

Sep 18 2026 5:13 AM | Updated on Sep 18 2026 5:13 AM

India built a fledgling chip industry in 5 years says PM Narendra Modi

తయారీకి విశ్వసనీయమైన హబ్‌గా భారత్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తయారీకి విశ్వసనీయ ప్రత్యామ్నాయ హబ్‌గా భారత్‌ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సెమీకండక్టర్ల పరిశ్రమకు పూర్తి మద్దతునిస్తూ, చిప్‌ల తయారీకి భారత్‌ను కీలక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.  

ఎల్రక్టానిక్స్‌ శాఖతో కలిసి పరిశ్రమ సంఘం సెమీ నిర్వహిస్తున్న సెమీకాన్‌ ఇండియా అయిదో సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘సిలికాన్‌ టు సిస్టమ్స్‌: బిల్డింగ్‌ ది ఎకోసిస్టమ్‌‘ పేరిట సెపె్టంబర్‌ 17న ప్రారంభమైన సదస్సు 19 వరకు జరుగుతుంది. సెమీకండక్టర్‌ కంపెనీలు, విధాన నిర్ణేతలు, ఇన్వెస్టర్లు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. అలాగే 243 అంతర్జాతీయ సంస్థలతో పాటు 500 పైచిలుకు ఎగ్జిబిటర్లు, 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.  

పరిశ్రమల భాగస్వామ్యం భేష్‌.. 
‘ప్రపంచం తయారీకి సంబంధించి సరికొత్త, విశ్వసనీయమైన కేంద్రాల కోసం అన్వేషిస్తోంది. ఇందుకోసం భారత్‌ సర్వసన్నద్ధమవుతోంది‘ అని మోదీ తెలిపారు. భారత్‌లో తయారైన చిప్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అలాగే భారత్‌పై ప్రపంచానికి నమ్మకం కూడా పెరుగుతోంది‘ అన్నారు. 

2022లో సెమీకండక్టర్ల మిషన్‌పై మరింతగా దృష్టి పెట్టినప్పటి నుంచి భారత్‌ సాధిస్తున్న విజయాల్లో పరిశ్రమ దిగ్గజాలు కీలక మూలస్తంభాలుగా, భాగస్వాములుగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. 

అలాగే దేశంలో అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని విదేశాల్లో పని చేస్తున్న భారతీయ పరిశోధకులను కోరారు. సెమీకండక్టర్‌ కంపెనీలు భారతీయ విద్యాసంస్థలతో పరిశోధనలకు సంబంధించిన భాగస్వామ్యాలు విస్తరించాలని పేర్కొన్నారు. గ్లోబల్‌ కంపెనీలు, అంకుర సంస్థలు, డిజైన్‌ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించేలా ప్రభుత్వం నియంత్రణలపరమైన మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రధాని చెప్పారు.  

చిప్‌ డిజైనింగ్‌లో లక్ష విద్యార్థులకు శిక్షణ .. 
సెమీకండక్టర్‌ వేల్యూ చెయిన్‌వ్యాప్తంగా పూర్తి వ్యవస్థను నిర్మించుకునేందుకు భారత్‌కు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. సెమీకండక్టర్‌ యంత్రపరికరాలు, రసాయనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని ఆయన సూచించారు. 

చిప్‌ డిజైన్‌తో పాటు అనుబంధ విభాగాలకు ఉపయోగపడేలా 1,00,000 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణనివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.  ఇప్పటికే 70,000 మందికి శిక్షణ కల్పించినట్లు వివరించారు. కేంద్రం రూ. 1.275 లక్షల కోట్లతో రెండో విడత సెమీకాన్‌ ఇండియా ప్రోగ్రాంను జూలైలో ప్రకటించింది. దీనితో 1,50,000 నుంచి 2,00,000 వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.  

2.0 స్కీము మార్గదర్శకాలు విడుదల 
సెమీకాన్‌ 2.0 ప్రోగ్రాంనకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఈ ప్రోగ్రాం కింద ఆమోదం పొందిన చిప్‌ ప్లాంట్లలో వ్యాపారపరమైన ఉత్పత్తిని ప్రకటించే వరకు, ఆ ప్రాజెక్టుల్లో ఏ భాగాన్నీ అమ్మడానికి గానీ తనఖా పెట్టడానికి గానీ వీల్లేదు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా చేయాల్సి వస్తే ముందస్తుగా నోడల్‌ ఏజెన్సీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

 ఈ స్కీమునకు డిజైన్, మెషిన్స్‌–మెటీరియల్స్, మరిన్ని ఫ్యాబ్రికేషన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ఏటీఎంపీ–ఓఎస్‌ఏటీ పరిశ్రమ, పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను పటిష్టం చేయడం, నిపుణులను తయారు చేసుకోవడం అనే ఆరు అంశాలు కీలకమైన పునాదిరాళ్లుగా ఉంటాయి. ఇందులో మెషిన్లు–మెటీరియల్స్, మరిన్ని ఫ్యాబ్‌ల ఏర్పాటు, ఏటీఎంపీ–ఓఎస్‌ఏటీ పరిశ్రమను బలోపేతం చేయడానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. 

మెషిన్స్‌–మెటీరియల్స్‌ కింద దరఖాస్తు చేసుకునే సంస్థలు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలుంటుంది. స్కీము ద్వారా ఆర్థిక తోడ్పాటు అందుకునే ప్లాంట్లు, మొత్తం ప్రాజెక్టులో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి కనీసం మూడేళ్ల పాటు ఉత్పత్తిని కొనసాగించాల్సి ఉంటుంది. స్థల సమీకరణ, అభివృద్ధి, ప్రాజెక్టు సైటులో తాత్కాలిక నిర్మాణాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులను మూలధన వ్యయాలు లేదా పెట్టుబడి కింద పరిగణించరు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement