టాటా సన్స్‌ X టాటా ట్రస్ట్స్‌ | Dominance Fighting Of Tata Trusts Vs Tata Sons | Sakshi
Sakshi News home page

టాటా సన్స్‌ X టాటా ట్రస్ట్స్‌

Sep 18 2026 4:52 AM | Updated on Sep 18 2026 4:52 AM

Dominance Fighting Of Tata Trusts Vs Tata Sons

చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్లు చాన్స్‌

 టాటా గ్రూప్‌ చైర్మన్‌గా పునర్నియామకానికి ఆమోదం.. 

టాటా సన్స్‌ లిస్టింగ్‌కు కూడా ఓకే.. 

బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు 

ఇది చట్టవిరుద్ధమంటూ తిరస్కరించిన టాటా ట్రస్ట్స్‌ 

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక కార్పొరేట్‌ దిగ్గజం... టాటా గ్రూప్‌లో బోర్డ్‌ రూమ్‌ వార్‌ మరో కొత్త మలుపు తిరిగింది. టాటా ట్రస్ట్స్, టాటా సన్స్‌ బోర్డు మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. టాటా ట్రస్ట్స్‌ వ్యతిరేకతను సైతం పట్టించుకోకుండా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించడంతో పాటు.. ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న టాటా సన్స్‌ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌కు కూడా సై అంది. 

ముంబై: టాటా సన్స్‌ బోర్డు సమావేశంలో గురువారం సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. ఎన్‌. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పునర్నియమించేందుకు ఆమోదం లభించింది. అంతేకాకుండా టాటా సన్స్‌ లిస్టింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. అయితే, బోర్డు నిర్ణయాలను టాటా సన్స్‌లో మెజారిటీ వాటా కలిగిన టాటా ట్రస్ట్స్‌ చట్టవిరుద్ధమని, చెల్లవని తిరస్కరించింది.  

దాదాపు మూడు గంటల పాటు నాటకీయంగా జరిగిన డైరెక్టర్ల బోర్డు భేటీలో మెజారిటీ సభ్యులు చంద్రశేఖరన్‌కు మద్దతుగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, డైరెక్టర్ల మెజారిటీ ఓట్లపై వివాదం, చివరకు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నుంచి లీగల్‌ ఓపీనియన్‌ తీసుకోవడం దాకా వెళ్లింది. 2027 ఫిబ్రవరి 20న టాటా గ్రూప్‌నకు గుడ్‌బై చెబుతానంటూ ఆగస్టులో చంద్రశేఖరన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా టాటా ట్రస్ట్‌ల సారథి నోయెల్‌ టాటాతో విభేదాలు, పునర్నియామకంపై బోర్డు సాగదీత, ఏకాభిప్రాయం లేకపోవడం దీనికి పురిగొల్పాయి. కాగా, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా టాటా సన్స్‌ డైరెక్టర్ల బోర్డు చేసిన అభ్యర్థనను చంద్రశేఖరన్‌ అంగీకరించారు. దీంతో ప్రస్తుత పదవీ కాలం ముగిశాక మరో ఐదేళ్లు గ్రూప్‌ చైర్మన్‌గా తిరిగి నియమించాలని బోర్డు తీర్మానించింది. అయితే, ఈ రెండు కీలక నిర్ణయాలకు కంపెనీ ఏజీఎంలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 

ఎట్టకేలకు లిస్టింగ్‌ బాటలో... 
టాటా సన్స్‌ పబ్లిక్‌ లిస్టింగ్‌కు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ తన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ  (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్‌ను సరెండర్‌ చేయడం కోసం పెట్టుకున్న దరఖాస్తును ఇటీవలే ఆర్‌బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే.  ఆర్‌బీఐ దెబ్బకు చివరికి బోర్డు లిస్టింగ్‌కు తలొగ్గాల్సి వచ్చింది. ‘ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా లిస్టింగ్‌ సహా ఇతర చర్యలన్నీ చేపట్టాలని కూడా బోర్డు తీర్మానించింది. 

ఈ విషయంలో ఆర్‌బీఐతో పాటు టాటా ట్రస్ట్‌లు, ఇతర పక్షాల మార్గనిర్దేశంలో ముందుకెళ్తాం’ అని టాటా సన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. టాటా సన్స్‌ను ఆర్‌బీఐ 2022లో అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ జాబితాలో చేర్చడంతో.. మూడేళ్లలోపు కంపెనీని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాల్సి ఉంది. 

అయితే, ఎన్‌బీఎఫ్‌సీ డీ రిజిస్ట్రేషన్‌ అభ్యర్థన పెండింగ్‌లో ఉండగానే, ఆ గడువు 2025 సెపె్టంబర్‌లో ముగిసింది. కాగా, లిస్టింగ్‌ మినహాయింపు కోసం టాటా సన్స్‌ దాదాపు రూ.21,000 కోట్ల రుణాలను కూడా తీర్చేయడం గమనార్హం. లిస్టింగ్‌ విషయంలో కూడా టాటా ట్రస్ట్‌లు, టాటా సన్స్‌ డైరెక్టర్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. లిస్టింగ్‌కు టాటా ట్రస్ట్స్‌ సుముఖంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.  

అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా.. 
ఒకవేళ టాటా సన్స్‌ గనుక పబ్లిక్‌ ఇష్యూకొస్తే... భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. 1% వాటా విక్రయించినా.. రూ.15,000–20,000 కోట్ల విలువ ఉంటుందని అంచనా. దీని ప్రకారం మొత్తం కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు రూ.20 లక్షల కోట్లు (230 బిలియన్‌ డాలర్లు)గా లెక్కతేలుతుంది. అంటే, ప్రస్తుతం మార్కెట్‌ క్యాప్‌ పరంగా నంబర్‌వన్‌గా ఉన్న రిలయన్స్‌ను కూడా మించిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టీల్‌æ, ఆటోమొబైల్, సాఫ్ట్‌ వేర్, హోటళ్లు, విమానయానం తదితర రంగాల్లో డజనుకు పైగా లిస్టెడ్‌ కంపెనీల్లో టాటా సన్స్‌కు నియంత్రణ వాటా ఉన్న సంగతి తెలిసిందే.

నోయెల్‌ నో... 
బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ పునర్నియామకం ప్రతిపాదనను టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా తీవ్రంగా వ్యతిరేకించారు. చైర్మన్‌ నియామకం విషయంలో ట్రస్ట్‌ నామినేట్‌ చేసిన డైరెక్టర్లు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుందని, నోయెల్‌ వ్యతిరేకంగా ఓటేయడంతో బోర్డు నిర్ణయం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ట్రస్ట్స్‌ వాదించింది. దీనికి అనుకూలంగా చీఫ్‌ జస్టిస్‌ అభిప్రాయాన్ని కూడా సమరి్పంచినప్పటికీ, బోర్డు సభ్యులు మాత్రం మెజారిటీ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించడం విశేషం. 

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌లో 66% వాటా ఉన్న టాటా ట్రస్ట్స్‌ ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ సవాలు చేసే అవకాశం తెలుస్తోంది. ఏజీఎంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మరోపక్క, టాటా సన్స్‌లో 18 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌... లిస్టింగ్‌ కోసం ఎప్పటినుంచో పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కాగా,  ఎస్‌పీ గ్రూప్‌ వాటాలో కొంత భాగాన్ని టాటా సన్స్‌ కొనుగోలు చేయడం ద్వారా కనీసం రూ.25,000 కోట్లు ఎస్‌పీ గ్రూప్‌నకు లభించేలా బోర్డు మీటింగ్‌లో నోయెల్‌ ప్రతిపాదించినట్లు టాటా ట్రస్ట్స్‌ పేర్కొంది. తద్వారా లిస్టింగ్‌ లేకుండా చేయొచ్చనేది నోయెల్‌ ప్లాన్‌.  అయితే, దీనిపై ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు.  

‘చంద్ర’గ్రహణం వీడినట్లేనా..? 
తాజా బోర్డ్‌ రూమ్‌ వార్‌ 2016లో అప్పటి టాటా గ్రూప్‌ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ తొలగింపును మరోసారి గుర్తుకుతెస్తోంది. మిస్త్రీని అర్థాంతరంగా తొలగించిన తర్వాత రతన్‌ టాటా తాత్కాలిక చైర్మన్‌గా కొన్నాళ్లు కొనసాగారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2021లో సుప్రీం కోర్టు టాటా ట్రస్ట్స్‌కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆ కథ సద్దుమణిగింది. కాగా, 2017లో టీసీఎస్‌ సారథిగా ఉన్న చంద్రశేఖరన్‌ను టాటా సన్స్‌ బోర్డు చైర్మన్‌గా నియమించారు. 

తొలిసారి టాటా సామ్రాజ్యం పగ్గాలు పార్శీయేతర వ్యక్తికి అప్పగించారు. టాటా గ్రూప్‌లో ‘చంద్ర’గా సుపరిచితమైన చంద్రశేఖరన్‌ను 2022లో మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తూ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కాగా, 2025లో మూడోసారి కూడా ఆయనకు అవకాశం ఇచ్చేందుకు టాటా ట్రస్ట్స్‌ ఓకే చెప్పింది. అయితే, నోయెల్‌ టాటా దీనికి అడ్డుపుల్ల వేయడంతో ప్రతిపాదన అటకెక్కింది. ముఖ్యంగా ఎయిరిండియా, టాటా డిజిటల్‌ భారీ నష్టాలను ఆయన లేవనెత్తారు. 

అంతేకాకుండా, చంద్రను కొనసాగించాలంటే టాటా సన్స్‌ను అన్‌లిస్టెడ్‌ కంపెనీగానే ఉంచాలని కూడా మెలికపెట్టారు. మరోపక్క,  టాటా ట్రస్ట్స్‌లో కీలకమైన సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ ఇప్పటికే చంద్ర వారసున్ని వెతికే పనిలో ఉంది. టాటా స్టీల్‌ సీఈఓ టీవీ నరేంద్రన్, టాటా సన్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌ఓ సౌరభ్‌ అగర్వాల్, ఎన్‌ఎస్‌ఈ సీఈఓ ఆశిశ్‌ చౌహాన్‌ తదితరులు ఈ రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు బోర్డు నిర్ణయాలతో, ఆ ప్రయత్నాలకు అడ్డుకట్టపడి.. చంద్రశేఖరన్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.

టాటా షేర్లు రయ్‌... 
టాటా సన్స్‌ బోర్డు నిర్ణయాలతో టాటా గ్రూప్‌ కంపెనీల షేర్లు రివ్వుమన్నాయి. టాటా కెమికల్స్‌ అత్యధికంగా 7 శాతం జంప్‌ చేయగా... టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ 5.5 శాతం, టీఎంపీవీ 4.5 శాతం, టాటా స్టీల్‌ 2.82 శాతం, టాటా పవర్‌ 2 శాతం, టాటా కన్జూమర్‌ 1.2 శాతం చొప్పున లాభపడ్డాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement