బంగారం కొనేవారికి బిగ్ షాక్.. హాల్‌మార్కింగ్ ఛార్జీ పెంపు! | Gold Hallmarking Fee Hiked Rs 75 What it Means for Jewellery Buyers Ahead of Festive Season | Sakshi
Sakshi News home page

బంగారం కొనేవారికి బిగ్ షాక్.. హాల్‌మార్కింగ్ ఛార్జీ పెంపు!

Sep 17 2026 9:10 PM | Updated on Sep 17 2026 9:12 PM

Gold Hallmarking Fee Hiked Rs 75 What it Means for Jewellery Buyers Ahead of Festive Season

పండుగల సీజన్‌లో బంగారం కొనాలని చూస్తున్న వారికి ఇది కొంచెం నిరాశ కలిగించే వార్త. ఎందుకంటే.. బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ చేయడానికి వసూలు చేసే ఫీజును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పెంచింది. ఇప్పటివరకు ఒక బంగారు వస్తువుకు రూ.45గా ఉన్న హాల్‌మార్కింగ్ ఫీజు.. ఇకపై రూ.75కి చేరనుంది. అంటే.. ఒక్కో వస్తువుపై రూ.30 అదనపు ఖర్చు పడుతుంది.

హాల్‌మార్కింగ్ అంటే
బంగారం కొనేటప్పుడు దాని స్వచ్ఛత ఎంత ఉంది?.. అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మనం చెల్లించే డబ్బుకు తగ్గ నాణ్యత కలిగిన బంగారమే వస్తుందా? లేదా?.. అన్నది వినియోగదారుడికి తెలియాలి. ఇక్కడే హాల్‌మార్కింగ్ ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. హాల్‌మార్కింగ్ అనేది బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాల స్వచ్ఛతను పరీక్షించి, అది నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. ఈ ప్రక్రియను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పర్యవేక్షిస్తుంది.

రూ.45 నుంచి రూ.75కు పెంపు
కొత్త హాల్‌మార్కింగ్ సవరణ నిబంధనల ప్రకారం.. బంగారు ఉత్పత్తికి వసూలు చేసే ఫీజు రూ.45 నుంచి రూ.75కు పెరిగింది. అంటే దాదాపు 67 శాతం పెంపు అన్నమాట. అయితే వెండికి సంబంధించిన హాల్‌మార్కింగ్ ఫీజులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఇది రూ.35గానే ఉంది.

బంగారం విషయంలో ఒక్కో కన్సైన్‌మెంట్‌కు కనీసం రూ.200 ఫీజు వర్తిస్తుంది. వెండికి కనీస కన్సైన్‌మెంట్ ఫీజు రూ.150గా ఉంది. సాధారణంగా ఈ హాల్‌మార్కింగ్ ఫీజును నగల వ్యాపారులే చెల్లిస్తారు. కాబట్టి.. ఫీజు పెంపుపై జ్యువెలరీ పరిశ్రమ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.

హాల్‌మార్క్‌లో ఏముంటుంది?
ప్రస్తుతం బంగారు ఆభరణాలపై ఉండే హాల్‌మార్క్‌లో కొన్ని ముఖ్యమైన వివరాలు ఉంటాయి. వాటిలో బీఐఎస్ లోగో, బంగారం క్యారెట్/ఫైనెస్ వివరాలు, ఆభరణానికి సంబంధించిన 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఇవి ఉండటం వల్ల వినియోగదారుడు తాను కొనుగోలు చేస్తున్న బంగారం ఏ ప్రమాణానికి చెందినదో తెలుసుకోవచ్చు.

హాల్‌మార్కింగ్ ఇలా..
నగల వ్యాపారి తయారు చేసిన ఆభరణాలను నేరుగా మార్కెట్‌లోకి పంపించే ముందు, బీఐఎస్ గుర్తింపు పొందిన అసెయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ ఆభరణాన్ని పరీక్షించి అందులోని బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తారు. పరీక్షలో బంగారం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తేలితే, ఆ ఆభరణంపై హాల్‌మార్క్ వేస్తారు. అంటే హాల్‌మార్క్ అనేది కేవలం ఒక గుర్తు కాదు.. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన అధికారిక ధృవీకరణ.

బంగారం కొనేవారిపై ప్రభావం ఎంత?
ఫీజు పెంపు వల్ల, నగల వ్యాపారుల ఖర్చు పెరుగుతుంది. అయితే.. వ్యాపారులు ఆ అదనపు ఖర్చును పూర్తిగా లేదా కొంతవరకు ఆభరణాల ధరలోకి బదిలీ చేస్తే, చివరికి దాని ప్రభావం వినియోగదారుడిపై పడవచ్చు. అయితే రూ.30 ఫీజు పెరిగిందని బంగారం ధర కూడా అదే మొత్తంలో పెరుగుతుందని చెప్పలేం. ఆభరణం మొత్తం ధరలో బంగారం మార్కెట్ ధర, తయారీ ఛార్జీలు, పన్నులు, ఇతర ఖర్చులు వంటి అనేక అంశాలు ఉంటాయి.

ఇదీ చదవండి: పాత రూ.10 నోటు చూశారా.. ఈ విషయం తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement