టాటా సన్స్ 108వ వార్షిక సాధారణ సమావేశం (AGM) ఆగస్టు 18న జరగాల్సి ఉండగా, అవసరమైన కోరం లేకపోవడంతో తొలిసారిగా వాయిదా పడింది. కోరంకు కీలకమైన.. రెండు అతిపెద్ద టాటా ట్రస్టులైన సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌ల ఉమ్మడి ప్రతినిధులు సమావేశానికి హాజరు కాకపోవడమే దీనికి కారణం. (కోరం అంటే.. కంపెనీ సమావేశాన్ని చట్టబద్ధంగా నిర్వహించడానికి తప్పనిసరిగా ఉండాల్సిన కనీస సభ్యులు లేదా వారి ప్రతినిధుల హాజరు).
అసలు సమస్య ఏంటి?
టాటా సన్స్‌లో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లకు కలిపి సుమారు 51.5 శాతం వాటా ఉంది. కాబట్టి.. ఈ రెండు ట్రస్టుల ప్రతినిధుల పాత్ర చాలా కీలకం. అయితే.. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు సంబంధించిన అన్ని సమావేశాలపై నిషేధం విధించడంతో, రెండు ట్రస్టులు కలిసి తమ ప్రతినిధిని నామినేట్ చేయలేకపోయాయి. దీంతో AGMకు అవసరమైన కోరం ఏర్పడలేదు.
సమావేశంలో ఎవరు ఉన్నారు?
ఏజీఎం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై, 3:00 గంటలకు వాయిదా పడింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, బోర్డు సభ్యులు సౌరభ్ అగర్వాల్, అనితా మరంగోలీ జార్జ్ బాంబే హౌస్‌లో ప్రత్యక్షంగా హాజరయ్యారు. నోయెల్ టాటా, హరీష్ మన్వానీ, వేణు శ్రీనివాసన్ తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. రతన్ టాటా విల్‌కు ఎగ్జిక్యూటర్‌గా ఉన్న మాజీ టాటా గ్రూప్ ఇన్‌సైడర్ మెహ్లీ మిస్త్రీ కూడా వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు.
ఇక ముందు ఏం జరుగుతుంది?
నిజానికి ఏజీఎం రద్దు కాలేదు. అయితే.. కోరం లేకపోవడంతో వాయిదా పడింది. టాటా సన్స్ బోర్డు సమావేశమై AGMను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద.. టాటా గ్రూప్ చరిత్రలోనే తొలిసారిగా ఏజీఎం కోరం లేక వాయిదా పడింది. ఇది ప్రస్తుతం టాటా ట్రస్టుల పరిపాలనకు సంబంధించిన సమస్యలు టాటా సన్స్ వ్యవహారాలపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఇదీ చదవండి: ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం!


