కొత్త ఆర్డర్లు రావడం దేశీయంగా సెప్టెంబర్‌లో తయారీ రంగంలో ఉత్సాహం నింపింది. దీంతో పరిశ్రమ వృద్ధి ఏడు నెలల గరిష్టానికి ఎగిసింది. ఇందుకు సంబంధించిన హెచ్‌ఎస్‌బీసీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 55.1కి చేరింది. ఆగస్టులో ఇది 52.8గా నమోదైంది. పీఎంఐ పరిభాషలో ఇండెక్స్ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.
దేశీయంగా వినియోగానికి, ఎగుమతులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం తయారీ రంగానికి బూస్ట్‌గా పని చేసింది. వ్యాపారాలపై ఆశాభావం నాలుగు నెలల గరిష్టానికి ఎగిసింది. ఆర్డర్లు, ఉత్పత్తి పెరగడంతో ఫ్యాక్టరీల్లో నియామకాలు కూడా జోరందుకున్నాయని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు.
ముడి వస్తువులు, విక్రయాల రేట్లు గణనీయంగా పెరిగినప్పటికీ గత చరిత్రతో పోలిస్తే ధరల పెరుగుదల నామమాత్రంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలతో కంపెనీలు ముడి వస్తువులను గణనీయంగా కొనుక్కుని, నిల్వలు పెంచుకున్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్ మొదలైన వాటికి నెలకొన్న డిమాండ్‌తో మొత్తం అమ్మకాలు ఫిబ్రవరి తర్వాత అత్యధిక స్థాయిలో భారీగా వృద్ధి నమోదు చేశాయి. బ్రెజిల్, యూరప్, యూఏఈ, అమెరికాలోని క్లయింట్ల నుంచి ఎగుమతుల ఆర్డర్లు కూడా పెరిగాయి.


