పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల, వాహనాలు దెబ్బతింటాయనే విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని ఎవరైనా చెబితే.. దానికి సరైన ఆధారాలు చూపించాలని బిహార్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2026లో ఆయన సవాల్ విసిరారు.
కోట్ల వాహనాలు నడుస్తున్నాయి
2022 నుంచి 4 కోట్లకు పైగా ఫోర్ వీలర్స్, 20 కోట్ల ద్విచక్ర వాహనాలు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో ఎలాంటి సమస్య లేకుండా నడుస్తున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా అధిక ఇథనాల్ మిశ్రమాలతో వాహనాలను పరీక్షించాయని ఆయన తెలిపారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా.. ఇథనాల్ వల్ల వాహనాలకు నష్టం జరుగుతోందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
రైతులకు లాభం
ఇథనాల్ వినియోగం వెనుక.. కేవలం వాహనాల విషయం మాత్రమే లేదు. ఈ విధానం ద్వారా రైతులు లాభపడతారు. ముఖ్యంగా మొక్కజొన్న వంటి పంటలను ఇథనాల్ తయారీకి ఉపయోగించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
సాధారణంగా రైతులు ఆహారం కోసం పంటలు పండిస్తారు. కానీ.. ఇథనాల్ తయారీకి పంటలను ఉపయోగించడం వల్ల రైతులు దేశానికి శక్తి వనరులను అందించే స్థాయికి కూడా రైతు ఎదగవచ్చని గడ్కరీ అభిప్రాయపడ్డారు. అందుకే.. రైతులను కేవలం ‘అన్నదాతలు’గా కాకుండా ఉర్జాదాతలు (శక్తి ఉత్పత్తిదారులు)గా కూడా చూడాలని ఆయన అన్నారు.
రూ.45,000 కోట్ల ఆదాయం
బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ వల్ల రైతులకు అదనంగా రూ.45,000 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని గడ్కరీ పేర్కొన్నారు. అంటే.. రైతులకు తమ పంటలను విక్రయించడానికి మరో మార్కెట్ ఏర్పడిందన్నమాట. దీనివల్ల వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడవచ్చని ఆయన చెబుతున్నారు.
ఇథనాల్‌తో పాటు వ్యవసాయ వ్యర్థాలను కూడా ఇంధనంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. వరి గడ్డితో విమాన ఇంధనం తయారు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో.. సాంకేతికత, పరిశోధన, కొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
బిహార్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి కూడా గడ్కరీ మాట్లాడారు. పర్యాటక రంగంతో పాటు.. మఖానాకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బిహార్‌లో ఉత్పత్తి అయ్యే మఖానాకు దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉందని, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం కలగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు!


