నెలకు రూ.70 వేల ఇంటి రెంట్‌.. రూ.4 లక్షల డిపాజిట్‌! | Bengaluru Rent Shock 2BHK For Rs 70K, Rs 4L Deposit Cheaper in France | Sakshi
Sakshi News home page

నెలకు రూ.70 వేల ఇంటి రెంట్‌.. రూ.4 లక్షల డిపాజిట్‌!

Oct 2 2026 2:16 PM | Updated on Oct 2 2026 2:52 PM

Bengaluru Rent Shock 2BHK For Rs 70K, Rs 4L Deposit Cheaper in France

భారత ఐటీ హబ్‌ బెంగళూరులో గృహాల అద్దెలు చుక్కలనంటుతున్న వైనం మరొకసారి చర్చనీయాంశమైంది. ఒక సాధారణ 2బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ.70,000 అద్దెతో పాటు రూ.4 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్‌ డిమాండ్ చేయడం ఐటీ ఉద్యోగులు, అద్దెదారులను ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియా వేదిక ‘రెడ్డిట్’లో వెలుగుచూసిన ఈ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వర్గాల్లో వేడిని రాజేసింది.

ఆఫీసుకు సమీపంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో నెలకు రూ.70 వేలు చెల్లించేందుకు సిద్ధపడినప్పటికీ ఫ్లాట్ యజమానులు ఇచ్చే సదుపాయాలు మాత్రం దానికి తగినట్లుగా లేకపోవడం గమనార్హం. కేవలం కొన్ని సోఫాలు, చిన్న టీవీ ఉంచి దాన్ని ఫుల్లీ ఫర్నిష్డ్‌గా ప్రచారం చేయడం, కనీసం రెండో బెడ్‌రూమ్‌లో బెడ్‌ లేదా వర్క్ డెస్క్ పట్టేంత స్థలం కూడా లేకపోవడాన్ని సదరు అద్దెదారు ఎత్తిచూపారు. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. రూ.65,000 అద్దె, 3 నెలల డిపాజిట్‌కు ప్రతిపాదన చేసినప్పటికీ ఓనర్ నిరాకరించడంతో ఆ డీల్‌ను వదులుకున్నట్లు ఆయన తెలిపారు.

ఫ్రాన్స్ కంటే బెంగళూరులోనే ఎక్కువ!

ఈ ఉదంతంపై స్పందించిన నెటిజన్లు బెంగళూరు రెంట్ మార్కెట్ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో అంతకంటే మెరుగైన జీవన ప్రమాణాలు, ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ అక్కడ ఇంటి అద్దెలు బెంగళూరు కంటే తక్కువగా ఉన్నాయని ఒక యూజర్ పోల్చి చెప్పారు.

ఐటీ కంపెనీల జీతాలు ఎల్లప్పుడూ నిలకడగా ఉండవని, ఉద్యోగ భద్రత తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి అసంబద్ధమైన అద్దెలను డిమాండ్ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానికేతరుల అవసరాలను ఆసరాగా చేసుకుని యజమానులు ఇష్టారాజ్యంగా డిపాజిట్లు, అద్దెలు పెంచుతున్నారని, అద్దెదారులు కూడా విచక్షణ లేకుండా అడిగినంత చెల్లించడం మానుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: పరుగెత్తిన పసిడి ధర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement