లిస్టింగ్‌పై 16 కంపెనీలు గురి | Sights on IPOs Despite Market Dip Draft Papers with SEBI | Sakshi
Sakshi News home page

లిస్టింగ్‌పై 16 కంపెనీలు గురి

Oct 2 2026 8:32 AM | Updated on Oct 2 2026 8:57 AM

Sights on IPOs Despite Market Dip Draft Papers with SEBI

పెరుగుతున్న వడ్డీ రేట్లు, బలపడుతున్న బాండ్ల ఈల్డ్స్‌ నేపథ్యంలో సెకండరీ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నప్పటికీ.. ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఏకంగా 16 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయడమే దీనికి నిదర్శనం! కొన్ని సంస్థలు గోప్యతా మార్గంలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. కొద్ది నెలలుగా జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రోత్సాహంతో పలు రంగాల కంపెనీలు నిధుల సమీకరణకు ఇది తగిన సమయంగా భావిస్తున్నాయి. వెరసి ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 50 కంపెనీలు సెబీ తలుపుతట్టడం గమనార్హం!

ఇదీ జాబితా

తాజాగా లిస్టింగ్‌ బాట పట్టిన కంపెనీల జాబితాలో అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, బీఎస్‌ స్పాంజ్, ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్, గ్రేస్‌ రెనెవబుల్‌ ఎనర్జీ, సోలియోస్‌ ఎనర్జీ, రుద్ర గ్రీన్‌ షిప్‌ రీసైక్లింగ్, ఎన్‌ఎన్‌టీ డెవలపర్స్, వినీర్‌ ఇంజినీరింగ్, రాథోడ్‌ జ్యువెలరీ మ్యాన్యుఫాక్చరింగ్, సునీల్‌ గోల్డ్‌ ఇండియా, తన్వీ ఎక్స్‌పోర్ట్స్‌ ఇండియా, పీఈఎస్‌ ఇన్‌స్టలేషన్స్, సర్వా ఫోమ్‌ ఇండస్ట్రీస్, కాటలైన్, దోస్తీ రియల్టీ, మనీట్రీ రియల్టీ సర్వీసెస్‌ చేరాయి. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను కంపెనీలు వ్యాపార విస్తరణ, రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనున్నాయి.

అనరాక్‌ ప్రాపర్టీ

రియల్టీ రంగ కంపెనీ అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణ ప్రణాళికలు వేసింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లకు సైతం వినియోగించనుంది.  

బీఎస్‌ స్పాంజ్‌

మెటల్‌ రంగ సంస్థ బీఎస్‌ స్పాంజ్‌ ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 650 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది.

ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌

ఇండస్ట్రియల్, మెడికల్‌ గ్యాస్‌ల సరఫరా కంపెనీ ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 7.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత పెట్టుబడిదారులు ఆఫర్‌ చేయనున్నారు. దీంతో నిధులు కంపెనీకి చేరబోవు.  

గ్రేస్‌ రెనెవబుల్‌ ఎనర్జీ

పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా పునరుత్పాదక రంగ కంపెనీ గ్రేస్‌ రెనెవబుల్‌ ఎనర్జీ 84.15 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా  ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 27.85 లక్షల షేర్లు విక్రయానికి ఉంచనున్నారు.

సోలియోస్‌ ఎనర్జీ

పునరుత్పాదక రంగ కంపెనీ సోలియోస్‌ ఎనర్జీ ఐపీవోలో భాగంగా కోటి ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 90 లక్షల షేర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను స్థాపిత సామర్థ్యంగల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది.  

రుద్ర గ్రీన్‌ షిప్‌

హాంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌(హెచ్‌కేసీ) సరి్టఫికేషన్‌గల రుద్ర గ్రీన్‌ షిప్‌ రీసైక్లింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐపీవోలో భాగంగా 1.9 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 90 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ఇతర వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనుంది.

పీఈఎస్‌ ఇన్‌స్టలేషన్స్‌

నర్స్‌ కాల్, మెడికల్‌ గ్యాస్‌ తదితర టర్న్‌కీ హెల్త్‌కేర్‌ సరీ్వసులందిస్తున్న పీఈఎస్‌ ఇన్‌స్టలేషన్స్‌ ఐపీవోలో భాగంగా 57.94 లక్షల ఈక్విటీలను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 24.83 లక్షల షేర్లను వాటాదారులు విక్రయించనున్నారు.  

తన్వి ఎక్స్‌పోర్ట్స్‌

బంగారు ఆభరణ తయారీ, ఎగుమతుల సంస్థ తన్వి ఎక్స్‌పోర్ట్స్‌ ఇండియా ఐపీవోలో భాగంగా 35.8 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 35.8 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు.  

సునీల్‌ గోల్డ్‌  

బంగారు ఆభరణ తయారీ, విక్రయ కంపెనీ సునీల్‌ గోల్డ్‌ ఇండియా ఐపీవోలో భాగంగా 2.1 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 50 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 220 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

సర్వా ఫోమ్‌

రీబాండెడ్‌ ఫోమ్‌ తయారీ కంపెనీ సర్వా ఫోమ్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 13.5 లక్షల షేర్లను ప్రమోటర్‌ ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు రీబాండెడ్‌ పాలీయురిథేన్‌ ఫోమ్‌ ప్రొడక్టుల తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చించనుంది. మరో రూ. 30 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది.

ఎన్‌ఎన్‌టీ డెవలపర్స్‌

ఈపీసీ సేవలందించే ఎన్‌ఎన్‌టీ డెవలపర్స్‌ ఐపీవోలో భాగంగా 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 25 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలుకి, రూ. 75 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌కు, మరో రూ. 22 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.

వినీర్‌ ఇంజినీరింగ్‌  

ఇంజినీరింగ్‌ సర్వీసులందించే వినీర్‌ ఇంజినీరింగ్‌ ఐపీవోలో భాగంగా 71 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను అడ్వాన్స్‌డ్‌ ఫోర్జింగ్, మెషీనింగ్‌ ప్లాంట్, మెషీనరీ, వర్కింగ్‌ క్యాపిటల్, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.

రాథోడ్‌ జ్యువెలరీ

బంగారు ఆభరణ తయారీ కంపెనీ రాథోడ్‌ జ్యువెలరీ ఐపీవోలో భాగంగా 1.03 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 115 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌కు, రూ. 90 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

కాటలైన్‌ లిమిటెడ్‌

ఐపీవోలో భాగంగా రహదారుల భద్రతా ప్రొడక్టుల తయారీ కంపెనీ కాటలైన్‌ లిమిటెడ్‌ 43 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 43 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను తయారీ ప్లాంట్‌ ఆధునీకరణ, ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ పరికరాల కొనుగోలుకు వినియోగించనుంది.

గోప్యతా విధానంలో..

రియల్టీ డెవలపర్‌ సంస్థ దోస్తీ రియల్టీ, ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ మనీట్రీ రియల్టీ సర్వీసెస్‌ సైతం సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి.

ఇదీ చదవండి: బ్లాక్‌మనీని వైట్‌గా ఎలా మారుస్తున్నారో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement