నల్లధనాన్ని వదిలించుకునేందుకు పన్ను ఎగవేతదారులు ఎంచుకుంటున్న పన్నాగాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. పట్టుబడితే భారీ జరిమానాలు, కఠిన జైలు శిక్షలు తప్పవనే ఐటీ శాఖ హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా.. సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ల మరుగున కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ‘తెల్లగా’ మార్చుకుంటున్నారు.
ఈవెంట్ల పేరిట నల్లధనం తెల్లగా!
ఉదాహరణకు ఒక వ్యాపారి వద్ద లెక్కల్లో చూపని రూ.1 కోటి నల్లధనం ఉందనుకుందాం. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసులు తథ్యం. దీంతో సదరు వ్యాపారి ఒక ప్రముఖ గాయకుడు, డాన్స్ టీమ్‌తో భారీ మ్యూజికల్ ఈవెంట్ ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లో అమ్ముడైన టికెట్లు కేవలం 500 మాత్రమే. రికార్డుల్లో మాత్రం ఏకంగా 2,000 టికెట్లు అమ్ముడైనట్లు చూపిస్తాడు. ఆ అదనపు 1,500 నకిలీ టికెట్ల మూలంగా వచ్చినట్లు చూపించిన నగదుతో రూ.1 కోటి నల్లధనాన్ని ఈవెంట్ అధికారిక ఆదాయంగా లెక్కల్లో జమ చేస్తాడు.
మరొకవైపు, షో నిర్వహణకు అయిన అసలు ఖర్చును స్పాన్సర్లు, నిజంగా అమ్ముడైన 500 టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ముతో భర్తీ చేస్తాడు. ఫలితంగా నల్లధనం ఈవెంట్ ఆదాయంగా మారి వైట్ మనీగా మారిపోతుంది.
ఐటీ శాఖ హెచ్చరికలు
గతంలో కొన్ని విభాగాలకు చెందిన ఈవెంట్లు, టికెట్ సేల్స్, పన్ను వివాదాలపై దాడులు నిర్వహించిన ఐటీ శాఖ ఇప్పుడు ఇటువంటి ఆడిట్ అవకతవకలపై దృష్టి సారించింది. టికెట్ల విక్రయాలు, ఆడిటోరియం సీటింగ్ సామర్థ్యం, డిజిటల్ చెల్లింపుల ఆధారాలను పరిశీలిస్తే ఈ నకిలీ టికెట్ల గుట్టు తేలిపోతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాపారాల మరుగున జరుగుతున్న ఈ లాండరింగ్‌పై కఠిన నిఘా ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మరింత అలసిపోయిన పసిడి ధర!


