పెద్ద బ్యాంకునే ముంచిన ఏఐ మాయ! | AI Scam Italy Top Bank loses Rs 10360 Crore | Sakshi
Sakshi News home page

పెద్ద బ్యాంకునే ముంచిన ఏఐ మాయ!

Sep 27 2026 9:32 AM | Updated on Sep 27 2026 9:37 AM

AI Scam Italy Top Bank loses Rs 10360 Crore

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత మోసాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఇటలీలో జరిగిన భారీ బ్యాంకింగ్‌ మోసం మరోసారి బయటపెట్టింది. ఇటలీకి చెందిన అతిపెద్ద రుణదాత ఇంటెసా సాన్పాలోకు చెందిన ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ విభాగం ఫిడ్యూరామ్‌ నుంచి మోసగాళ్లు సుమారు 95 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.10,360 కోట్లు) విదేశీ ఖాతాలకు బదిలీ చేయించుకున్నట్లు రాయిటర్స్‌ నివేదించింది. ఇందులో సుమారు 53 మిలియన్‌ యూరోలు తిరిగి రికవరీ చేసినప్పటికీ, దాదాపు 36 మిలియన్ యూరోలు ఇంకా ఆచూకీ లేకుండా పోయినట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి.

అసలు మోసం ఎలా జరిగిందంటే..

ఈ ఘటన 2026 ఫిబ్రవరిలో జరిగింది. అప్పట్లో ఫిడ్యూరామ్‌ చైర్మన్‌గా ఉన్న  పాలో మోలెసినికి ఇంటెసా సాన్పాలో సీఈఓ కార్లో మెస్సినా నుంచి వచ్చినట్లుగా కనిపించిన ఓ వాట్సాప్‌ సందేశం వచ్చింది. విదేశాల్లో జరుగుతున్న ఓ అత్యవసర ఆర్థిక లావాదేవీని పూర్తి చేయడానికి ఫిడ్యూరామ్‌ ట్రెజరీ నుంచి వెంటనే నిధులు బదిలీ చేయాలని అందులో కోరారు.

ఈ సందేశాన్ని మరింత నమ్మేలా చేయడానికి మోసగాళ్లు మరో అడుగు ముందుకేశారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ న్యాయ సంస్థకు చెందిన సీనియర్‌ భాగస్వామి నుంచి కాల్‌ వచ్చినట్లుగా ఏర్పాటు చేశారు. మోలెసినికి ఆ న్యాయవాది పరిచయం ఉండటంతో, ఫోన్‌లో వినిపించిన గొంతు కూడా నిజమైనదిగానే అనిపించింది. అయితే ఆ గొంతును ఏఐ సాంకేతికతతో క్లోన్‌ చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

చైనా, హాంకాంగ్‌కు బదిలీలు

అభ్యర్థన నిజమైనదేనని భావించిన మోలెసిని ఫిడ్యూరామ్‌ ఆర్థిక విభాగాన్ని సంప్రదించి వరుసగా నిధులు బదిలీ చేయాలని ఆదేశించారు. దీంతో సుమారు 95 మిలియన్ యూరోలు చైనా, హాంకాంగ్‌ సహా విదేశీ ఖాతాలకు తరలిపోయాయి.

అయితే ఫిడ్యూరామ్‌ వ్యవస్థలు కొద్దిసేపటికే లావాదేవీల్లో అసాధారణతలను గుర్తించాయి. వెంటనే ఇతర బ్యాంకులు, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశారు. చైనా, పోర్చుగల్‌, ఇటలీ అధికారుల మధ్య సహకారంతో భారీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. రాయిటర్స్‌ ప్రకారం సుమారు 53 మిలియన్‌ యూరోలు రికవరీ అయ్యాయి. కొన్ని ఇటాలియన్‌ మీడియా నివేదికల్లో రికవరీ మొత్తం సుమారు 59 మిలియన్‌ యూరోలుగా పేర్కొనడం గమనార్హం.

మిగిలిన నిధులు పలు విదేశీ ఖాతాల ద్వారా తరలిపోయి, చివరకు క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు సమాచారం. దీంతో వాటి ఆచూకీ కనుగొనడం మరింత క్లిష్టంగా మారింది. సుమారు 36 మిలియన్‌ యూరోలు ఇంకా కనిపెట్టాల్సి ఉందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

మోలెసినిపై కేసు లేదు

ఈ మోసానికి సంబంధించి పాలో మోలెసిని లేదా ఫిడ్యూరామ్‌కు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం లేదు. అయితే మిలన్‌ ప్రాసిక్యూటర్లు కంప్యూటర్‌ మోసం అనుమానంతో ఐరోపా వెలుపల నివసిస్తున్న ఓ విదేశీ వ్యక్తిపై దర్యాప్తు ప్రారంభించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది.

కాగా మోలెసిని 2026 మార్చిలో వ్యక్తిగత కారణాలను చూపుతూ ఫిడ్యూరామ్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో ఆయన వైదొలగడానికి సంబంధించిన మరిన్ని వివరాలను సంస్థ వెల్లడించలేదు.

గతంలోనూ ఇటలీలో ఏఐ వాయిస్‌ మోసం

ఇటలీలో ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌ ఆధారిత మోసం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో రక్షణ మంత్రి గైడో క్రొసెట్టో గొంతును ఏఐతో అనుకరిస్తూ పలువురు ప్రముఖ ఇటాలియన్‌ వ్యాపారవేత్తలను మోసగాళ్లు సంప్రదించారు. మధ్యప్రాచ్యంలో బందీలుగా ఉన్న జర్నలిస్టులను విడిపించేందుకు డబ్బు అవసరమంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. మాజీ ఇంటర్‌ మిలాన్‌ యజమాని మాసిమో మొరాట్టి దాదాపు 1 మిలియన్‌ యూరోలు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ మొత్తాన్ని అధికారులు అనంతరం స్తంభింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement