నకిలీ ‘సెజ్‌’ పేరుతో రూ.5.68 కోట్ల జీఎస్టీ ఎగవేత | Fake Sez Certificate Rs 5-68 Crore GST Evasion Arrest | Sakshi
Sakshi News home page

నకిలీ ‘సెజ్‌’ పేరుతో రూ.5.68 కోట్ల జీఎస్టీ ఎగవేత

Sep 25 2026 1:41 PM | Updated on Sep 25 2026 2:41 PM

Fake Sez Certificate Rs 5-68 Crore GST Evasion Arrest

నిందితుడిని అరెస్ట్‌ చేసిన కేంద్ర జీఎస్టీ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ ఎస్‌ఈజెడ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జత చేసి రూ.5.68 కోట్ల జీఎస్టీ ఎగవేసిన నిందితుడిని కేంద్ర జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం ఆధారంగా రంగారెడ్డి కేంద్ర వస్తు పన్ను విభాగం (సీజీఎస్టీ) కమిషనరేట్‌ అధికారులు, హైదరాబాద్‌ జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్, రంగారెడ్డి సీజీఎస్టీ కమిషనర్‌ అజాజుద్దీన్‌ మార్గదర్శకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ తిరుమల సర్వీసెస్‌ సంస్థ ప్రధాన కార్యాలయం, అలాగే సంస్థ యజమాని దారా రవికిశోర్‌ నివాసంలో తనిఖీలు నిర్వహించారు.

దర్యాప్తులో రవికిశోర్‌ తన సంస్థను స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఎస్‌ఈజెడ్‌) యూనిట్‌గా తప్పుడు వివరాలతో నమోదు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో జీఎస్టీ చెల్లించకుండా జీరో–రేటెడ్‌ సరఫరాలుగా వస్తువులను కొనుగోలు చేసే ప్రయోజనాన్ని పొందినట్లు అధికారులు గుర్తించారు. సంస్థ ఎస్‌ఈజెడ్‌ హోదాను క్లెయిమ్‌ చేసేందుకు సమర్పించిన విశాఖపట్నం స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (వీసెజ్‌) డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ జారీ చేసినట్లు చూపిన అనుమతి లేఖ నకిలీదిగా విచారణలో తేల్చారు.

రూ.30 కోట్ల విలువైన పన్ను విధించదగిన సరఫరాలపై రూ.5.68 కోట్ల జీఎస్టీ ఎగవేత జరిగినట్లు లెక్కించారు. రవికిశోర్‌ను ఈనెల 24న సీజీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్‌ 69 కింద అరెస్ట్‌ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్, ప్రిన్సిపల్‌ కమిషనర్‌ అజాజుద్దీన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో డీజేలపై ఆంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement